పెద్దల సభలో ‘తెలుగు’ రికార్డ్

పెద్దల సభలో ‘తెలుగు’ రికార్డ్
  • నాలుగో అతిపెద్ద పార్టీగా వైసీపీ
  • వేల కోట్ల అస్తులున్న ఎంపీల్లో బీఆర్ఎస్​ముందంజ
  • ఏడుగురు బీఆర్‌ఎస్‌ ఎంపీల ఆస్తుల విలువ రూ.5,596 కోట్లు
  • ఆంధ్రప్రదేశ్‌లో 11 మంది సభ్యుల సంపద రూ.3,823 కోట్లు
  • యూపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో 60మంది ఆస్తి 3,546 కోట్లు
  • 225 మంది పెద్దల సభ సభ్యుల్లో 12 శాతం బిలియనీర్లే!
  • వీరిలో ఏపీలో ఐదుగురు.. తెలంగాణ నుంచి ముగ్గురు
  • అత్యంత సంపన్న ఎంపీ బండి పార్థసారథిరెడ్డి 
  • తొలిసారిగా ప్రాతినిధ్యం కోల్పోయిన తెలుగుదేశం

ముద్ర, తెలంగాణ బ్యూరో : కేంద్రంలోని పెద్దల సభలో తెలుగు రాష్ట్రాలు రికార్డు దక్కించుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలు రాజ్యసభలో కీలకంగా మారాయి. ఎంపీల ఆస్తుల్లో తెలంగాణలోని బీఆర్ఎస్​ ఎంపీలు టాప్​లో నిలిచారు. దేశంలో ఉన్న ఎంపీలందరితో పోలిస్తే.. తెలుగు రాష్ట్రాల ఎంపీల ఆస్తులు రెండింతలుగా నమోదయ్యాయి. ఇదే సమయంలో దేశంలో అత్యధికంగా రాజ్యసభ ఎంపీలు ఉన్న పార్టీల్లో నాలుగో అతిపెద్ద పార్టీగా ఏపీలోని అధికార వైసీపీ పార్టీ అవతరించింది. అయితే, ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన తెలుగు దేశం పార్టీ మరో చెత్త రికార్డును దక్కించుకున్నది. ఒక్క సభ్యుడు కూడా లేని పార్టీగా టీడీపీ రికార్డు సాధించుకున్నది. 

ఆస్తుల్లో తెలుగోళ్లు!

రాజ్యసభ ఎంపీలుగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు గురువారం ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆఫిడవిట్లు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. రాజ్యసభలో ఎంపీల వివరాలను పరిశీలిస్తే.. దేశంలో అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తరప్రదేశ్‌ నుంచి ప్రాతినిధ్యం వహించే రాజ్యసభసభ్యుల సంఖ్య 30 మంది ఉంటే.. వీరందరి ఆస్తి రూ.1,941 కోట్లు. మరో పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్ర తరఫున 19 మంది పెద్దల సభలో ఉండగా.. వీరి సంపద రూ.1,070 కోట్లుగా అఫడవిట్లలో చూపించారు. ఇంకో పెద్ద రాష్ట్రం మధ్యప్రదేశ్‌ 11 మంది ఎంపీల ఆస్తి కేవలం రూ.535 కోట్లు. కానీ, ఏడుగురు తెలంగాణ ఎంపీలందరి ఆస్తి ఏకంగా రూ.5,596 కోట్లు. వీరంతా బీఆర్‌ఎస్​కు చెందినవారే. బీజేపీకి అత్యధికంగా 85 మందిగా ఉన్న రాజ్యసభ సభ్యుల అఫిడవిట్‌లో వెల్లడించిన ప్రకారం వీరందరి ఆస్తి కలిపితే రూ.2,579 కోట్లుగా ఉంది. కాంగ్రె‌స్​కు చెందిన 30మంది సభ్యుల సంపద రూ.1,549 కోట్లు. ఆప్​ పార్టీకి చెందిన10 మంది సభ్యుల ఆస్తి రూ.1,316 కోట్లు. దీనిప్రకారం.. బీజేపీ దేశవ్యాప్త ఎంపీలందరి కంటే రెట్టింపుపైగా సంపద బీఆర్‌ఎస్‌ ఏడుగురు ఎంపీలకు ఉండడం గమనార్హం. ఇది కాంగ్రెస్‌ సభ్యులతో పోలిస్తే దాదాపు నాలుగు రెట్లు. ఏపీలో వైసీపీకి చెందిన రాజ్యసభ ఎంపీల ఆస్తి రూ.3,561 కోట్లు. బీజేపీ సభ్యుల కంటే రూ.వెయ్యి కోట్లు, కాంగ్రెస్‌ ఎంపీల కంటే రెట్టింపు సంపద మన తెలుగు ఎంపీల దగ్గేరే నిక్లిప్తమై ఉంది. 

12 శాతం మంది ఎంపీలు బిలియనీర్లే.. 

తాజా లెక్కల ప్రకారం రాజ్యసభలో 12 శాతం మంది ఎంపీలు బిలియనీర్లుగా ఉన్నారు. రాష్ట్రాలవారీగా తెలంగాణ ఎంపీల్లో 43 శాతం, ఏపీ ఎంపీల్లో 45 శాతం బిలీయనీర్లు ఉన్నారు. పార్టీలవారీగా పరిగణిస్తే వైసీపీలో నలుగురు (44 శాతం), బీఆర్‌ఎస్​లో ముగ్గురు(43 శాతం) బిలియనీర్లున్నారు. వ్యక్తిగతంగా.. మహారాష్ట్ర ఎంపీల్లో ముగ్గురు(16 శాతం), ముగ్గురు ఢిల్లీ ఎంపీల్లో ఒకరు(33 శాతం), ఏడుగురు పంజాబ్‌ సభ్యుల్లో ఇద్దరు(29 శాతం), ఐదుగురు హరియాణా ఎంపీల్లో ఒకరు(20శాతం), 11 మంది మధ్యప్రదేశ్‌ సభ్యుల్లో ఇద్దరు(18శాతం) తమకు రూ.100 కోట్లకుపైగా ఆస్తులున్నట్లు అఫిడవిట్లలో ప్రకటించారు. మొత్తంమీద 17మంది ఎంపీలు బిలీయనీర్లే అని తేలింది. ఇక తెలంగాణ ఎంపీల్లో 43శాతం మందిపై క్రిమినల్‌, 14 శాతం మందిపై తీవ్రమైన క్రిమినల్‌  కేసులున్నాయి. ఏపీలో 36 శాతం ఎంపీలపై క్రిమినల్‌, 27 శాతం మందిపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులున్నట్లు ఏడీఆర్‌ తెలిపింది. తమపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు ముగ్గురు వైసీపీ ఎంపీలు అఫిడవిట్లలో పేర్కొన్నారు. బీజేపీకి చెందిన సభ్యుల్లో 23 మంది, 30 మంది కాంగ్రెస్‌ ఎంపీల్లో 12 మంది, 13 మంది టీఎంసీ వారిలో నలుగురిపై, ఆరుగురు ఆర్జేడీ ఎంపీల్లో ఐదుగురు, 10 మంది ఆప్‌ ఎంపీల్లో ముగ్గురు క్రిమినల్‌ కేసుల్లో ఉన్నారు. 

టాప్​లో మనోడే!

దేశంలోనే ధనికులైన రాజ్యసభ ఎంపీల్లో బీఆర్‌ఎస్​కు చెందిన బండి పార్థసారథిరెడ్డి (రూ.5,300 కోట్లు), వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి (రూ.2,577 కోట్లు) మొదటి, రెండు స్థానాల్లో ఉన్నారు. మూడో స్థానంలో అమితాబ్‌ బచ్చన్‌ భార్య, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్‌(రూ.1,001 కోట్లు) ఉన్నారు. వైసీపీ మద్దతుతో ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లిన పరిమళ్‌ నత్వానీ (రూ.396 కోట్లతో) దేశంలోని ధనిక రాజ్యసభ ఎంపీల జాబితాలో 9వ స్థానంలో ఉన్నారు. కాగా అప్పుల్లో నత్వానీ (రూ.209 కోట్లు), అయోధ్య రామిరెడ్డి (రూ.154 కోట్లు), జయా బచ్చన్‌ (రూ.105 కోట్లు) టాప్‌-3లో ఉన్నారు.

నాలుగో పెద్ద పార్టీగా వైసీపీ

ఏపీకి చెందిన ముగ్గురు వైసీపీ ఎంపీల ప్రమాణంతో రాజ్యసభలో నాలుగో అతిపెద్ద పార్టీగా వైసీపీ అవతరంచింది. రాజ్యసభలో వైసీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు మేడా రఘునాథ్‌ రెడ్డి , గొల్ల బాబురావు, వైవీ సుబ్బారెడ్డిలతో రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్కర్‌ ప్రమాణం చేయించారు. వీరి ప్రమాణంతో రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీల సంఖ్య 11కు చేరుకుంది. ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీకి 97 మంది, కాంగ్రెస్‌కు  29 , టీఎంసీకి 13 మంది ఉన్నారు. ఏపీకి చెందిన 11 మందితో నాలుగో స్థానానికి చేరుకుంది. 

ప్రాతినిథ్యం కోల్పోయిన టీడీపీ..

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి వరుసగా సభ్యులుంటూ వస్తున్న టీడీపీకి ప్రస్తుతం రాజ్యసభలో సభ్యులు లేని పార్టీగా మరడం ఇదే ప్రథమం. రాజ్యసభలో ఏపీకి 11 స్థానాలు ఉండగా, ఇప్పుడు ఆ మొత్తం స్థానాలు వైసీపీ ఖాతాలో చేరాయి. టీడీపీ ఆవిర్భావం తరువాత తొలి సారి రాజ్యసభలో ఆ పార్టీ ప్రాతినిధ్యం కోల్పోయింది. ఎన్నికల వేళ ఈ రికార్డు వైసీపీ సొంతం చేసుకుంది. టీడీపీలో ప్రస్తుతం ఏకైక సభ్యుడిగా ఉన్న కనకమేడల రవీంద్రబాబు పదవీ కాలం ముగిసింది. ఇదే సమయంలో వైసీపీ నుంచి కొత్తగా ముగ్గురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేసారు. వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాధ రెడ్డి, గొల్లా బాబూరావు లతో రాజ్యసభ ఛైర్మన్ థన్కడ్ ప్రమాణ స్వీకారం చేయించారు. వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పదవీ కాలం ముగిసింది. ఆయన ఇప్పటికే తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. టీడీపీ నుంచి నెల్లూరు ఎంపీగా ఎన్నికల బరిలో నిలిచారు. ఇదే సమయంలో వైసీపీ మరో అరుదైన ఘనత సాధించింది. రాజ్యసభలో నాలుగో అతి పెద్ద పార్టీగా నిలిచింది. 1983లో పాలన సాధించిన తర్వాత 41 ఏళ్లలో తొలిసారిగా టీడీపీకి ఇదో రికార్డులా మారిపోయింది. 2019 ఎన్నికలకు ముందు రాజ్యసభలో వైఎస్సార్సీపీకి 2 సభ్యులు, టీడీపీకి 9 మంది సభ్యులు ఉన్నారు. ఏపీ కోటాలో ఆ రాష్ట్రంలో రాజ్యసభ సభ్యుల సంఖ్య 11. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో 50 శాతం ఓట్లతో 151 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ గెలుపొందగా, టీడీపీకి 23 సీట్లు మాత్రమే వచ్చాయి.