కుప్పంలో లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యం

కుప్పంలో లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యం
  • మళ్లీ గెలిచే ముందు మీ ఆశీర్వాదం కోసం వచ్చాను
  • జలగ మాదిరిగా జగన్ జనం రక్తం తాగుతున్నాడు
  • మహిళల కోసం టీడీపీ తెచ్చిన ప్రత్యేక పథకాలను జగన్ రెడ్డి రద్దు చేశాడు
  • జగన్ పాలనలో ప్రతి ఒక్కరూ నష్టపోయారు
  • ఉద్యోగులకు మళ్లీ పీఆర్సీ ఇస్తాం
  • కుప్పంలో తెలుగుదేశం అధినేత  చంద్రబాబునాయుడు 

ముద్ర: ‘‘గత 45 ఏళ్లుగా ఆదరిస్తున్న ప్రజలకు రుణపడి ఉన్నా. అన్నగా..తమ్ముడిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా...వచ్చే ఎన్నికల్లో మనందరి లక్ష్యం లక్ష మెజారిటీనే పెట్టుకోవాలి.  రాష్ట్రంలోనే ఎక్కువ మెజారిటీ వచ్చే నియోజకవర్గం కుప్పమే అవ్వాలి. నియోజకవర్గంలో 75 శాతం ఓట్లు టీడీపీకే రావాలి. రాష్ట్రం, పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించేవారు వైసీపీకి ఓటు వేయరు. ..’’ అని తెలుగుదేశం అధినేత  చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు.   కుప్పంలో సోమవారం జరిగిన భారీ బహిరంగ సభలో, మహిళా సదస్సులో  ప్రజానీకాన్నీ  ఉద్దేశించి మాట్లాడారు.  ‘‘ఏకపక్షంగా ఎన్నికలు జరగాలి. ప్రజలు గెలవాలి. రాష్ట్రం నిలవాలి.  నాకు ముఖ్యమంత్రి పదవి కొత్తకాదు. నాకు ముఖ్యం రాష్ట్రం, ప్రజలు.   కుప్పం ప్రజలకు ఏం చేయాలో నేను చూసుకుంటా.  నేను కుప్పం ప్రజలకు ఎంతో రుణపడి ఉన్నాను. 40 ఏళ్లలో  చేసే అభివృద్ధిని ఐదేళ్లలోనే చేస్తా.  మీ రుణం తీర్చుకుంటాను. ..’’అని చంద్రబాబు పేర్కొన్నారు.  ‘‘ఉద్యోగులకు మళ్లీ పీఆర్సీ ఇస్తాం. మీ న్యాయమైన కోర్కెలను తీర్చుతాను. ప్రజాస్వామ్య పరిరక్షణకు , ఉద్యోగుల హక్కుల కోసం ఉద్యోగులు పనిచేయాలి. ..’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రసంగం ఆయన  మాటల్లోనే... 

తెలుగు దేశం పార్టీతోనే మహిళా సాధికారత
మహిళల కోసం టీడీపీ తెచ్చిన ప్రత్యేక పథకాలను జగన్ రెడ్డి రద్దు చేశాడు. తన ఆదాయం కోసం నాసిరకం మద్యంతో సిఎం మహిళల తాళిబొట్లు తెంచాడు.  రాష్ట్రం, దేశంలో మొట్టమొదటిసారిగా మహిళల అభివృద్ధి, సంక్షేమం గురించి మాట్లాడిన ఏకైక పార్టీ టీడీపీ. మొదటి సారిగా ఎన్టీఆర్  మీ గురించి ఆలోచించి ఆస్తిలో సమానహక్కు కల్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు తీసుకొచ్చాం. సర్పంచులు, ఎంపీటీసలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు మహిళలు అయ్యారంటే దానికి ఎన్టీఆర్ ఇచ్చిన 8 శాతం రిజర్వేషన్లే కారణం.  మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం తీసుకొచ్చాం. చదువుకోని మహిళలను ఇంటికొకరి చొప్పున డ్వాక్రా సంఘాలు పెట్టాం. మిమ్మల్ని ఎగతాళి చేసే రోజుల నుండి ఇంటిని కాపాడే పరిస్థితి వచ్చారని నిరూపించింది టీడీపీనే.  మహిళల కోసం వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టాం. లక్షల మంది మహిళల జీవితాలు బాగున్నాయంటే అది టీడీపీ చొరవ.   నేను మొదటి సారి కుప్పం వచ్చినప్పుడు డ్వాక్రా సంఘాలు లేవు.  ఇప్పుడు 60 వేల మంది ఉన్నారు. డ్వాక్రా సంఘాలతో పాటు పాడిపరిశ్రమను ప్రోత్సహించాం.  ఇంటికి రెండు ఆవులు ఇస్తా అంటే నవ్వారు. ఇప్పుడు కుప్పంలో 4 నాలుగు లక్షల లీటర్ల పాలు సేకరణ జరుగుతోంది.  నా తల్లిని చిన్నతనంలో చూశాను...కట్టెల పొయ్యితో ఇబ్బంది పడేది.  కట్టెల పొయ్యిలు పోయి మహిళలు ఇబ్బంది లేకుండా ఉండాలని దీపం పథకం ద్వారా వంటగ్యాస్ అందించాను.  మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతుంటే ఆత్మగౌరవం పేరిట మరుగుదొడ్లు కట్టించాం. మధ్యాహ్న భోజన పథకం పెట్టి అందులోనూ మహిళలకు అవకాశం కల్పించాం. అంగన్వాడీ, రేషన్ షాపులు, సుజల శ్రవంతి వాటర్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసి మహిళలకు అవకాశం కల్పించాం.  ఒంటరి మహిళలకు పెన్షన్ విధానానికి శ్రీకారం చుట్టింది టీడీపీనే. స్కూలుకు వెళ్లడానికి ఆడపిల్లలు ఇబ్బందులు పడుతుంటే ఆడపిల్లలందరికీ సైకిళ్లు అందించాం.  ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు పెట్టాం. కండక్టర్లుగా కూడా మహిళలను నియమించాం.  ప్రతి కిలోమీటరుకు ఒక ఎలమెంటరీ స్కూలు, ప్రతి 3 కి.మీ అప్పర్ ప్రైమరీ, మండలానికి ఒక జూనియర్ కాలేజీ, రెవెన్యూ డివిజన్ కు ఒక ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చాం.   పసుపుకుంకమ ద్వారా రూ.8,800 కోట్లు అందించి...రూ.10 వేల కోట్లు డ్వాక్రా రుణాలు మాఫీ చేశాం. ఉచితంగా 11 రకాల వైద్య సదుపాయాలు అందించాం.  అన్న అమృత హస్తం కింద గర్భిణులకు పరీక్షలు, బేబీ కిట్లు కూడా అందించాం. తల్లీ బిడ్డ ఎక్స్ ప్రెస్, బాలామృతంతో పాటు ప్రసవించినప్పుడు రూ.5,500 ఆర్థికసాయం అందించాం.  పెళ్లికానుకలతో పాటు ఒక అన్నగా సామూహిక సీమంతాలు నిర్వహించాం.   ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయా.? ఆడపిల్లలకు జగన్ ఫ్రభుత్వం ఏం చేసింది? మద్యం ధరకు రెక్కలు వచ్చాయి. క్వార్టర్ మద్యం రూ.60 నుండి 200లకు పెంచి వంద దోచేసిన జలగ జగన్.  నాసిరకం మద్యంతో ఆడబిడ్డల తాళిబొట్లు తెంచాడు. మీకు ఇచ్చేది రూ.10లు..దోచేది రూ.100లు. జలగ మాదిరిగా జగన్ జనం రక్తం తాగుతున్నారు. 

నిజమైన దేవతలు ఆడబిడ్డలే
నన్నే ఎన్నో సార్లు వేదించారు. అసెంబ్లీలో నన్ను తిట్టారు. రాజకీయాల్లో లేని నా సతీమణి భువనేశ్వరిని అవమానించారు.  నాడే చెప్పా. కౌరవసభను గౌరవసభగా చేసి సీఎంగానే అడుగుపెడతానని. మీ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే ఈ 40 రోజులు మీరు కష్టపడి టీడీపీని గెలిపించాలి.  ఎక్కడికి వెళ్లినా రాని ఆనందం కుప్పం వస్తే ఉంటుంది. నాకు స్ఫూర్తి కుప్పం. మీ నిండు మనసుతో నన్ను 7 సార్లు ఆదరించి గెలిపించారు.  మళ్లీ గెలిచే ముందు మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. నిజమైన దేవతలు ఆడబిడ్డలే.  ఆడబిడ్డలు కోరుతున్నా...మీకు అండగా ఉంటా. మీ ద్వారా మీ కుటుంబాన్ని బాగు చేసే పరిస్థితి రావాలి...మీ ఆదాయాన్ని పెంచి చూపిస్తాం.  జగన్ లా రూ.10 ఇచ్చి వంద కొట్టేసే ఆలోచన నాది కాదు. సంపద సృష్టించి మీ ఆదాయాన్ని పెంచుతా. రూ.10లు ఇచ్చి రూ.100 సంపాదించే మార్గాన్ని చూపిస్తా.  నేను సీఎంగా ఉన్నప్పుడు గురజాలలో ముస్లిం బాలికపై అత్యాచారం జరిగింది...24 గంటల్లో పట్టుకోవాలని ఆదేశించడంతో చెట్టుకు ఉరేసుకుని నిందితుడు చనిపోయాడు.  ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు.  అవసరం అయితే మహిళలకు ప్రత్యేక చట్టం తెచ్చి రక్షణ కల్పిస్తాం. 

కొత్త పథకాలకు శ్రీకారం చుట్టాం
ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమంది ఆడబిడ్డలకు నెలకు రూ.15 వందలు ఆడబిడ్డ నిధి కింద అందిస్తాం. నేరుగా మీ అకౌంట్లోకే డబ్బులు వస్తాయి.  ఎంత మంది పిల్లలున్నా తల్లికి వందనం ద్వారా ఒక్కొక్కరికి రూ.15 వేలు అందిస్తాం. 

జగన్ పాలనలో రక్షణ లేకుండా పోయింది
రాష్ట్రంలో జగన్ పాలనలో  ఏ ఒక్కరికీ రక్షణ లేకుండా పోయింది.  ప్రతి ఒక్కరూ నష్టపోయారు. కిల్లీ దుకాణాల్లో గంజాయి దొరుకుతోంది. గత నాలుగేళ్లుగా గంజాయికి వ్యతిరేకంగా పోరాడుతున్నాను. డ్రగ్స్ ను విచ్చల విడిగా అమ్ముతున్నారు.  గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్ నుంచి  విజయవాడ చిరునామాతో డ్రగ్స్ వచ్చాయి. వైకాపా నాయకులకు లింకులు ఉన్నాయని నాడే నేను చెప్పాను. అయినా చర్యలు తీసుకోలేదు . పైగా తెలుగుదేశం కార్యాలయంపైనే దాడి చేశారు.  మనవాళ్లను కొట్టారు.  ఈ ముఖ్యమంత్రి చిత్త శుద్ధితో పనిచేసి ఉంటే రాష్ట్రంలోకి డ్రగ్స్, గంజాయి వచ్చి ఉండేవా? డ్రగ్స్‌ను ఈ విధంగా వదిలిపెడితే యువత భవిత నాశనం అవుతుంది. డీజీపీ అఫీస్‌కు కూతవేటు దూరంలోనే నేరాలు జరుగుతున్నాయి. .. ’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.