అయోధ్యలో ముగిసిన కీలక ఘట్టం

అయోధ్యలో ముగిసిన కీలక ఘట్టం
  • గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ట
  • రామయ్యకు ఆగ్రా నుండి 56 రకాల పెటా 
  • పోస్టల్ స్టాంపులను విడుదల చేసిన ప్రధాని  మోడీ

న్యూఢిల్లీ :అయోధ్య రామ మందిర ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించి గురువారం కీలక ఘట్టం పూర్తయ్యింది. అయోధ్య రామాలయంలోని గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఐదేళ్ల బాల రాముడి 51 అంగుళాల పొడవైన నల్లరాతి విగ్రహాన్ని నాలుగు గంటల పూజలు, వేద మంత్రాల నడుమ ప్రతిష్టించారు. రామజన్మభూమి తీర్ధ క్షేత్ర ధర్మకర్త బిమ్లేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా పర్యవేక్షణలో ఈ విగ్రహాన్ని ఎంపిక చేశారు. రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో 121 మంది పూజారులు పాల్గొన్నట్లు పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. ఆలయ ప్రాంగణంలోని గర్భగుడిలో వాస్తు పూజ కూడా నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు, సాధువులు సహా 7,000 మందికి పైగా ఈ వేడుకకు హాజరవుతారని ఆలయ ట్రస్ట్ తెలిపింది. 

రామాలయంపై స్మారక తపాలా స్టాంపులు.. ఆవిష్కరించిన  మోదీ

యావత్ దేశం కాదు సమస్త ప్రపంచంలోని హిందూవులు, శ్రీరాముని భక్తులు అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే శ్రీ రామ జన్మభూమి మందిరంపై స్మారక తపాలా స్టాంపులను విడుదల చేసింది మోదీ సర్కార్. అలాగే శ్రీరాముని అయోధ్య ఆలయానికి సంబంధించిన పుస్తకాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. స్టాంపులను ముద్రించిన పుస్తకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం విడుదల చేశారు. ఈ స్టాంపులలో రామమందిరం, చౌపై ‘మంగల్ భవన్ అమంగల్ హరి’, సూర్యుడు, సరయు నదితో పాటు ఆలయం చుట్టుపక్కలి శిల్పాలు ఉన్నాయి. రామాలయం, గణేష్, హనుమాన్, జటాయు, కేవత్రాజ్, మాతా శబరి ఇలా మొత్తం ఆరుగురికి సంబంధించిన స్టాంపులు ఉన్నాయి. ఈ పుస్తకంలో గంభీరంగా కనిపించే సూర్యకిరణాలు ‘పంచభూతాల’ను ప్రతిబింబించేలా ఉన్నాయి. అంటే ఆకాశం, గాలి, అగ్ని, భూమి, నీరు ఈ ఐదు భౌతికాంశాలు ఈ పుస్తకంపై కనిపించేలా రూపొందించారు. అలాగే 48 పేజీలతో కూడిన ఈ పుస్తకంలో వివిధ దేశాలకు చెందిన స్టాంపులను కూడా ముద్రించారు. శ్రీరాముని కీర్తిని ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందేందుకు ఇది దోహదపడుతుందంటున్నారు. అమెరికా, న్యూజిలాండ్, సింగపూర్, కెనడా, కంబోడియాతోపాటు యునైటెడ్ నేషన్ పరిధిలోని 20 కంటే ఎక్కువ దేశాల స్టాంపులను ఇందులో అచ్చు వేశారు. 

దీనికి సంబంధించి ఒక వీడియోను విడుదల చేశారు. ఆరు స్మారక స్టాంపులపై ప్రధాని మోదీ మాట్లాడుతూ, “ఈరోజు, శ్రీరామ మందిరం ప్రాణ ప్రతిష్ఠా అభియాన్ అనే మరో కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు లభించింది. శ్రీరామ జన్మభూమి ఆలయంపై 6 స్మారక తపాలా స్టాంపులతో కూడిన ఆల్బమ్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. దేశ ప్రజలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులందరికీ ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని పేర్కొన్నారు.  

రామయ్య కోసం ఆగ్రా పేటా నైవేద్యం 

ఆగ్రాలోని పేటా స్వీటు ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్. అంగూరి పేటా నుండి సాధారణ పేటా వరకు ఇక్కడ చాలా రకాలు తయారు చేస్తారు. ఈ ప్రత్యేకతకు మరో విశేషం జోడయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రాంలల్లా ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమం సందర్భంగా 56 రకాల 560 కిలోల పెటా స్వీటును నైవేద్యాల కోసం ఆగ్రా నుండి అయోధ్యకు తీసుకువస్తున్నారు. ఇందుకోసం సరైన రథాలు సిద్ధం చేశామని, 560 కిలోల బరువున్న ఈ పేట 30 గంటల్లో ఆగ్రా నుంచి అయోధ్యకు చేరుకోనుందని తెలిపారు. వీటిల్లో సాదా పేట నుండి కేసర్ పేటా , సాదా అంగూర్ పేటా, కుంకుమ అంగూర్ పేటా, మామిడి చెర్రీ పేటా, ఆరెంజ్ చెర్రీ పేటా, ఖాస్ చెర్రీ పేటా, సాదా చెర్రీ పేటా, కుంకుమ చెర్రీ పేటా, మేడిపండు పేటా, స్ట్రాబెర్రీ పేటా, మామిడి పేటా, ఆరెంజ్ పేటా, గులాబ్ లడ్డు పేటా, పాన్ పేటా , చాక్లెట్ పేటా, రోల్ పేటా, పిస్తా పేటా, శాండ్ విచ్ పేటా, ఆరెంజ్ పేటా ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఈ ప్రత్యేకమైన  పేటాలలో కొన్నింటిని మొదటిసారిగా శ్రీరాముని కోసం ప్రత్యేకంగా తయారు చేశారు.