గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి
  • సరిగ్గా నెల క్రితం తమ్ముడు ఆత్మహత్య
  • తొనిగండ్లలో అలుముకున్న విషాదం

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ టౌన్ పిఎస్ లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ భీమన్నగారి యాదగిరి(53) గుండెపోటుతో మృతిచెందాడు. ఆయన మృతితో పోలీసు శాఖలో విషాదం అలుముకుంది.  గురువారం రాత్రి చాతిలో నొప్పి వస్తుందని తెలపడంతో పట్టణంలోని ఆసుపత్రిలో చూయించిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. యాదగిరి స్వగ్రామం రామాయంపేట మండలం తొనిగండ్ల. కష్టజీవిగా పేరొందిన యాదగిరికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు హరిత చదువు పూర్తి కావడంతో పెళ్లి చేయగా కూతురు, అల్లుడు అమెరికాలో ఉంటున్నారు. చిన్న కూతురు సైతం సాఫ్ట్ వెర్ ఉద్యోగం చేస్తుంది. చిన్న కూతురుకు పెళ్లి చేసిద్దామనుకునే సమయంలో గుండె పోటు రూపంలో యాదగిరిని మృత్యువు కబళించింది. యాదగిరి మరణ వార్త విన్న భార్య సుజాత అలియాస్ లత తీవ్ర అస్వస్థతకు గురైంది. రామాయంపేట ఆసుపత్రికి తరలించారు.

నెల క్రితం తమ్ముడు ఆత్మహత్య

నెల క్రితం యాదగిరి తమ్ముడు రమేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విషాదం నుండి కోలుకోకముందే హెడ్ కానిస్టేబుల్ యాదగిరి గుండెపోటుకు గురై మరణించడాన్ని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, తోటి పోలీసు ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు.

రేపు అంత్యక్రియలు

యాదగిరి అంత్యక్రియలు శనివారం స్వగ్రామంలో జరగనున్నాయి. అమెరికాలో ఉన్న కూతురు వచ్చాక అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

డిఎస్పీ నివాళులు

గుండెపోటుతో మృతిచెందిన హెడ్ కానిస్టేబుల్ భీమన్నగారి యాదగిరి(53) పార్థీవ  దేహానికి మెదక్ డిఎస్పి ఫణీందర్ నివాళులర్పించారు. డిఎస్పీ వెంట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, మెదక్ టౌన్ ఎస్ఐ పోచయ్య ఉన్నారు. ఈ సందర్బంగా కుటుంబ సభ్యులను ఓదార్చారు.