ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు

ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు
  • రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

ముద్ర.వీపనగండ్ల:- ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను 10 సంవత్సరాలు పాలించిన బిఆర్ఎస్ పార్టీ అప్పుల రాష్ట్రంగా చేసి కాంగ్రెస్ పార్టీకి అప్పగించిందని, రాష్ట్రాన్ని అభివృద్ధి లోకి తీసుకువచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నెరవేరుస్తామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మండల పరిధిలోని బొల్లారంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, ఎస్సీ కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ గత రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి పనుల రూపంలో వసూలు చేసిన డబ్బులను దుర్వినియోగం చేయటంతో పాటు 7 లక్షల కోట్లు అప్పుల చేసి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని అన్నారు. దీనితో ప్రస్తుతం ప్రతి సంవత్సరం 40 వేల కోట్ల అప్పులకు వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేయడం జరిగిందని, మహిళలకు ఆర్టిసి బస్సులో ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ పథకానికి 10 లక్షలు పెంచటం జరిగిందని, తొందర్లోనే మరో నాలుగు గ్యారెంటీలను ప్రజలకు అందించడం జరుగుతుందని అన్నారు.

గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు కొల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు తేవడం జరిగిందని పాలకులు సరిగ్గా వినియోగించుకోకపోవడంతో వెనికి వెళ్లాయని అన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గం లోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్తానని అన్నారు. సింగోటం రిజర్వాయర్ నుంచి గోపాల్ దిన్నె రిజర్వాయర్ వరకు కాల్వపనులను పూర్తి చేయించి ఉమ్మడి వీపనగండ్ల చిన్నంబాయి మండలంలోని చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించిన చూస్తానని, కాలువ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం అందేలా అధికారులను తో మాట్లాడతానని అన్నారు.యువత చెడు వ్యసనాలకు లోను కాకుండా శారీరక శ్రమతో ఆరోగ్యవంతులుగా ఉండాలని, క్రీడలను అలవాటు చేసుకోవాలని, ప్రతిరోజు ఉదయం వ్యాయామం తప్పనిసరిగా చేయాలని సూచించారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలలో యువత నిర్లక్ష్యంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని రోడ్డు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పద్మమ్మ, ఎంపీటీసీ కవిత, తాసిల్దార్ వరలక్ష్మి, ఎంపీడీవో కథలప్ప, మండల పంచాయతీ అధికారి శ్రీనివాస్, ఆర్ఐ కురుమయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బీరయ్య, వనపర్తి జిల్లా ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షుడు ఇంద్రకంటి వెంకటేష్, నాయకులు సుదర్శన్ రెడ్డి, నారాయణరెడ్డి, పాపయ్య, కృష్ణ, రఘునాథ్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు గంగిరెడ్డి, కృష్ణయ్య తదితరులు ఉన్నారు.