క్షయ నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత

క్షయ నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత

  • డిప్యూటి డిఎంహెచ్ ఓ  డాక్టర్ ఎన్ శ్రీనివాస్

 ముద్ర ప్రతినిధి, జగిత్యాల:  క్షయ నివారణ ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించాలని జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్ అన్నారు.  జగిత్యాల పట్టణంలోని మోతే వాడ అర్బన్ హెల్త్ సెంటర్లో శనివారం ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.. జిల్లాలో ప్రతిఏటా 1900 కేసులు నమోదు అవుతున్నాయని, ఈ ఏడాది మార్చి వరకు 426 కేసులు గుర్తించామని అన్నారు. రెండు వారాలకు మించి దగ్గు, ఆకలి లేకపోవడం, జ్వరం, బరువు తగ్గడం లాంటి లక్షణాలు ఉంటే వెంటనే తెమడ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. క్షయ బాధితులకు ఉచితంగా మందులు అందజేయడంతో పాటు ప్రతినెల రూ.500  పోషణ భత్యం అందిస్తున్నామని అన్నారు. దాతల సాయంతో నిక్షయ పోషణ కిట్లను నిరుపేదలకు అందిస్తున్నామన్నారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ నిర్వహించారు. మధుమేహ , రక్తపోటు, హెచ్ ఐ వి , డయాలసిస్ బాధితులకు క్షయ (టీబీ) వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నందున లక్షణాలు ఉంటే త్వరగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. జిల్లా కేంద్రంలో క్షయ వ్యాధి  నివారణకు సిబినాట్, ఎక్స్ రే, ఇతర పరీక్షలు అందుబాటులో ఉన్నాయని, క్షయ వ్యాధిని త్వరితగతిన గుర్తించి సరైన చికిత్స పొందితే తక్కువ సమయంలోనే పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలిపారు.  మొండి టీబి బాధితులకు ఏడాది నుంచి రెండేళ్ల వరకు అధునాతన మందులతో చికిత్స అందిస్తున్నామని అన్నారు. అనంతరం ఆయన క్షయ నివారణకు కృషిచేసిన సిబ్బందిని ఆయన ప్రశంసించారు.  ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు గీతిక, శ్రావణి, స్వాతి, డీపీపీఎం కట్ట హరీశ్ సూపర్వైజర్లు, సిబ్బంది తదితరులు ఉన్నారు.