సమీపిస్తున్న చిన్న జయంతి

సమీపిస్తున్న చిన్న జయంతి
  • వచ్చే నెల 4 నుంచి కొండగట్టులో ఉత్సవాలు..
  • ఇంకా సమీక్షా నిర్వహించని అధికారులు.. ముందుకు సాగని ఏర్పాట్లు..
  • ఉత్సవాల ఖర్చుల్లో గోల్ మాల్..?

ముద్ర, మల్యాల: ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో ప్రతి ఏటా జరిగే చిన్న జయంతి ఉత్సవాలు సమీపిస్తున్న ఆలయ అధికారులు నిమ్మకు నిరెత్తనట్లుగా వ్యవరిస్తున్నారు.  వచ్చే నెల 4 నుంచి 3 రోజుల పాటు చిన్న జయంతి ఉత్సవాలు జరుగనున్నాయి. ఉత్సవాలకు ఒక్క తెలంగాణ నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది దీక్ష పరులు, భక్తులు తరలివస్తారు. అయితే ఇప్పటివరకు ఉత్సవాల నిర్వహణపై ఓ సమీక్షా గాని, ప్రణాళిక చేయకపోవడం గమనార్హం. ప్రతి ఏటా ఉత్సవాల ఏర్పాట్లపై 15 రోజుల ముందు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.  లక్షలాదిగా తరలివాచ్చే భక్తులకు సౌకర్యాలు ఇంకా పూర్తి చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం చలువ పందిళ్ల పనులు తప్పా ఇంకా ఏవి కూడా ఏర్పాట్లు జరగడం లేదు. ప్రతి ఏటా  భక్తులు అసౌకర్యాల మధ్యనే స్వామివారిని దర్శనం చేసుకుని, వెళ్తుంటారు. ఎన్ని విమర్శలు వచ్చిన ఇక్కడి అధికారులు పట్టించుకోరనేది భక్తుల మాట.. ఇది ఇలా ఉండగా, ముఖ్యంగా దీక్ష పరుల మాల విరమణ మండపం కోసం నిధులు మంజూరు అయినా.. నిర్మాణం పనులు పూర్తి చేయకపోవడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు మెట్ల దారి పనులు కూడా పూర్తి కాకపోవడంతో జయంతి ఉత్సవాల్లో ఈ దారి గుండా కాలినడకన వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

చలువ పందిళ్లలో గోల్ మాల్...
జయంతి ఉత్సవాల సందర్బంగా ప్రతి ఏటా మాదిరిగా ఎండభారి నుంచి భక్తుల రక్షణ కోసం చలువ పందిళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇందులో అధికారులు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. కొండపై 50 వేల 700 ఫీట్ల చలువ పందిళ్ళు ఏర్పాటు చేయడానికి అధికారులు ఎస్ట్ మేట్ తయారుచేశారు. పనులు గుత్తేదారుకు అప్పగించారు. రూపాయలు 5.50 లక్షల పనికి 12.30 లక్షలు వేచ్చిoచడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పనులు దక్కించుకున్న గుత్తేదారు, మరో వ్యక్తికి 5.50 లక్షలకు అప్పగించినట్లు ఏ ఈ దృష్టికి తీసుకెళ్లిన నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నట్లు పలువురు పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా, జయంతి ఉత్సవాల సందర్బంగా వివిధ ఏర్పాట్లకు కూడా అధికారులు అత్యధికoగా నిధులు వేచ్చిస్తున్నట్లు వారు ఇచ్చిన నివేదికలో తెలుస్తోoది. చిన్న జయంతికి ఆలయం చుట్టూ విద్యుత్ దీపాలంకరణ కోసం 9.10 లక్షలు వెచ్చించిన అధికారులు, నెల వ్యవదిలో వచ్చే పెద్ద జయంతికి 9.80 లక్షలు ఎస్ట్ మేట్ తయారుచేయడం గమనార్హం. సీసీ కెమెరాలు అద్దె కోసం 2 లక్షలు, ఇలా ప్రతి ఏర్పాట్లలో అవకతవకలకు పాల్పడుతున్నారని పలువురు ఆరోపిస్తూన్నారు