అంజన్న ఆభరణాలు అంతేనా..? 

అంజన్న ఆభరణాలు అంతేనా..? 
  • కేవలం 295 కిలోలు వెండి నిల్వ ఉన్నట్లు ప్రకటించిన అధికారులు..
  • వెండి, బంగారo నిల్వలపై అనుమానాలు..?

ముద్ర, మల్యాల: కొండగట్టు అంజన్నకు భక్తులు సమర్పించిన బంగారు, వెండి ఆభరణాల నిల్వలపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శనివారం కొండగట్టులో స్వామి వారి పేరిట గల బంగారు, వెండి ఆభరణాలపై ఆలయ అధికారులు, అర్చకులతో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు సమీక్షించారు. ఈ సందర్బంగా బంగారు, వెండి నిల్వలు ఎంత, ఎక్కడెక్కడ ఉన్నాయనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. అభరణాలతో పాటు, భక్తులు సమర్పించిన ఇతర సామాగ్రి రక్షణ బాధ్యత పూర్తిగా ఆలయ అధికారులు, అర్చకులదేనని స్పష్టం చేశారు. ఉత్సవాలతో పాటుగా, స్వామి వారి నిత్య సేవకు ఉపయోగించేవి తప్పా... మిగతా అభరణాలు బ్యాంక్ లాకర్లోనే ఉండాలని, వాటి వివరాలు రికార్డ్లో ఎప్పటికప్పుడు పొందుపర్చలన్నారు.

295 కిలోలేనా.. వెండి నిల్వ..!
బంగారు, వెండి ఆభరణాల వివరాలు తెలుసుకున్న దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు 295 వెండి నిల్వ ఉన్నట్లు ప్రకటించారు. ఇటీవల ఆలయంలో జరిగిన చోరీలో 33.5 కిలోల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్ళినట్లు పేర్కొన్నారు. అయితే ఈ విషయంమై పలువురు అధికారులను వివరణ కోరగా పొంతన లేని సమాధానం ఇచ్చారు. మరో 300 కిలోలతో స్వామి వారి లాకెట్స్ కోసం మెల్టిoగ్ చేయించినట్లు, అర్చకుల వద్ద 70 కిలోలు ఉన్నట్లు ఓ అధికారి పేర్కొన్నారు. మరొక అధికారి 500 కిలోలు బ్యాంకులో బాండ్స్ రూపంలో ఉన్నట్లు తెలిపడం గమనార్హం. ప్రతి హుండీ లెక్కింపులో కిలోల కొద్ది వెండి సమకూరుతున్న లెక్కల్లో మాత్రం స్పష్టత లేకపోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.