అప్పులబాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య

అప్పులబాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య

ముద్ర, హైదరాబాద్ బ్యూరో: పైర్లు పాడై, దిగుబడి చేతికి అందక, పంటసాగుకు, కుటుంబ నిర్వహణకు చేసిన రుణం భారమై జనగామ, వికారాబాద్ జిల్లాలకు చెందిన ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జనగామ జిల్లా తరిగొప్పుల మండలం సోలిపురం గ్రామానికి చెందిన రైతు ఉచ్చెంతల శ్రీను (47) నాలుగెకరాల్లో వరిసాగు చేశాడు. ఈ పైరును కాపాడుకోడానికి నాలుగు బోర్లు వేసినా, నీళ్లు పడక పొలంలో పైరు ఎండిపోయింది. ఈ ఏడు పంట ఎండిపోవడమే కాకుండా నిరుడు ఇంటి నిర్మాణం కోసం చేసిన రుణం, బోర్లు వేయడానికి, సాగు పెట్టుబడికి దాదాపు పది లక్షల రూపాయల మేరకు అప్పులు చేశాడు. వాటిని తీర్చలేని పరిస్థితులలో మనస్తాపంతో వ్యవసాయ బావి దగ్గరున్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

 ఇక వికారాబాద్ జిల్లా ధారూరు మండలం నాగారం గ్రామానికి చెందిన రైతు ముసలిగల అనంతయ్య (42)కు తనకు చెందిన 30 గుంట పొలంలో వరి, మరో రెండు ఎకరాలలో కంది, మక్క సాగు చేశాడు. వర్షాలు లేక కంది, మక్క పంటలు ఎండిపోయాయి. ఇదే కాకుండా అంతకుముందే 3 లక్షల రూపాయల అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాడు. ఈ రుణం తీర్చేదారి కనపడక పురుగుమందు తాగాడు. తర్వాత భయంతో తాను స్వయంగా వెళ్లి తాండూరు ఆస్పత్రిలో చేరాడు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం వికారాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.