ఉమ్మడి నల్లగొండకు రెండు కీలక మంత్రి పదవులు

ఉమ్మడి నల్లగొండకు రెండు కీలక మంత్రి పదవులు
  • ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లకు కీలకపదవుల పట్ల కాంగ్రెస్ శ్రేణుల హర్షం

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-గురువారం తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి 
ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి హుజుర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంనుంచి
శాసనసభ్యుడిగా బంపర్ మెజార్టీతో గెలిచిన మాజీ మంత్రి, మాజీ టిపిసిసి
చీఫ్, మాజీ ఎంపి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి కి హోంశాఖ కేటాయించడం,
నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బారీమెజార్టీతో విజయం సాధించిన
మాజీ మంత్రి, మాజీ ఎంపి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి మున్సిఫల్, ఐటి శాఖ
కేటాయించడంపట్ల ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం
చేస్తున్నాయి. ఆనాడు ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు ఉన్న సమయంలో
నల్లగొండ జిల్లా నుంచి హోంమంత్రిగా భువనగిరి శాసనసభ్యుడు దివంగత
ఎలిమినేటి మాధవరెడ్డి పనిచేశారు. తదుపరి ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి
హయాంలో హోంమంత్రిగా చలకుర్తి శాసనసభ్యుడు కుందూరు జానారెడ్డి పని
చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు
హయాంలో నల్లగొండకు హోంమంత్రి అవకాశం దక్కలేదు. ఉమ్మడి నల్లగొండ
జిల్లాలో సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి మొదట
విద్యాశాఖమంత్రిగా, తదుపరి విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే ఈసారి
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు రెండు కీలకమైన మంత్రి పదవులు లభించాయి.
మొదటినుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి నల్లగొండ జిల్లా కంచుకోటగా
 ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ  రాష్ట్ర నాయకత్వంలో అగ్రశ్రేణి నాయకులు ఎక్కువమంది
ఉమ్మడి నల్లగొండ జిల్లా వారే కావడం గమనార్హం. ఈసారి ఎన్నికల్లో అధికార
బి ఆర్ ఎస్ ప్రభుత్వ వ్యతిరేకత బాగా ఉండడంతో కాంగ్రెస్పార్టీ తిరిగి పూర్వ
వైభవాన్ని సంతరించుకుంది. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న
సమయంలో నాడు మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన మంత్రిపదవిని
తెలంగాణ కోసం తృణప్రాయంగా వదిలేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వదిలేసిన
పదవిని నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేపట్టారు. అప్పట్లో ఈ విషయం పెద్ద దుమారం
లేపింది. కానీ నేడు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలిచి రెండు
మంత్రి పదవులు సాధించారు. మరో సీనియర్ అయిన కుందూరు జానారెడ్డి
ఈసారి ఎన్నికల బరిలో నిల్చోకుండా తన కుమారుడు కుందూరు జయవీర్ రెడ్డిని
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పోటీకి నిల్పి మంచి మెజార్టీతో
గెలిపించుకున్నారు. లేదంటే జానారెడ్డినే పోటీలో ఉండి గెల్చితే జిల్లాలో మంత్రి
పదవిని దక్కించుకునే విషయంలో తీవ్రపోటీ నెలకొని ఉండేది. అంతేగాకుండా
సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మూడోసారి
'ఓడిపోయిన మాజీమంత్రి, టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి 
గెలిచి ఉన్నట్టయితే మంత్రి పదవుల ఈక్వేషన్స్ మళ్లీ గందరగోళ పరిస్థితులు
నెలకొని ఉండేవి. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఇద్దరు జానారెడ్డి పోటీ
చేయకపోగా, దామోదర్ రెడ్డి పోటీ చేసి ఓడిపోవడం గెలిచినవారికి కలిసి వచ్చి
మంత్రి పదవులు దక్కించుకోవడంలో సులభం అయ్యిందని చెప్పవచ్చు. ఇంకా
జిల్లానుంచి రెండోసారి నకిరేకల్ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంనుంచి గెలిచిన
వేముల వీరేశం, తుంగతుర్తి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి గెలిచిన
మందుల సామేల్ కూడా ఎస్సీ కోటాలో మంత్రిపదవిని ఆశించారు. సీనియర్
అయిన మునుగోడు నియోజకవర్గంనుంచి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,
కురుమ సామాజికవర్గం నుంచి ఆలేరు నుంచి గెలిచిన బీర్ల అయిలయ్య బీసీ
కోటాలో మంత్రి పదవులు ఆశించినప్పటికీ సాధ్యపడలేదని సమాచారం. జిల్లాలో ఉన్న 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 11 స్థానాల్లో గెలిచి కాంగ్రెస్ పట్టు నిలుపుకోవడమే కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టడానికి సాధ్యమైనంతగా ఎక్కువ స్థానాలు ఉమ్మడి నల్లగొండ జిల్లా అందించింది కావున జిల్లాకు మంత్రి పదవుల విషయంలో ప్రాధాన్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్పించారని కాంగ్రెస్ శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. మొత్తానికి
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు రెండు కీలకశాఖలు గల రెండు మంత్రిపదవులు
దక్కడం వలన జిల్లా మరింత ప్రగతిపథంలో పయనిస్తుందని ప్రజలు బావిస్తున్నారు.