Ranganayaka Sagar Reservoir: కరువు నేలపై ధాన్యపు రాశులు పండిస్తున్నాం

Ranganayaka Sagar Reservoir: కరువు నేలపై ధాన్యపు రాశులు పండిస్తున్నాం
  •  తెలంగాణకు ఇక నీటి గోసలు లేవు
  • ఉద్యమ నేతలే సారధులైన వేళ 
  • తెలంగాణ అభివృద్ధి సాధ్యమైంది
  • సాగునీటి దినోత్సవ వేడుకల్లో మంత్రి హరీష్ రావు 

ముద్ర ప్రతినిధి: సిద్దిపేట: కరువుతో అల్లాడిన నేలను, కన్నీళ్లతో కాలం గడిపిన రైతులను ఆదుకున్నది,అక్కున చేర్చుకున్నది తెలంగాణ  ప్రభుత్వమేనని రాష్ట్రఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. బుధవారం రాత్రి సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్రామ శివారులలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ మధ్యలో.  తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సాగునీటి దినోత్సవ సభ జరిగింది. ఈ సభలో ముఖ్యఅతిథిగా మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. నీటిపారుదల శాఖ ఈ ఎస్ సి హరేరామ్ తో పాటు ఆ శాఖ ఎస్ సి లు బసవరాజు, గోపాలకృష్ణ , సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జాయింట్ కలెక్టర్ ముజామిల్ ఖాన్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ తోపాటు పలువురు నేతలు, వివిధ శాఖల అధికారులు సిద్దిపేట వైద్యులు, సిద్దిపేట న్యాయవాదులు వివిధ శాఖల అధికారులు ఈ సభలో పాల్గొన్నారు.

మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం, అనుమతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నుండి తనదాకా, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారి ఎస్కే జోషి నుండి రిటైర్డ్ ఇంజనీర్ విద్యాసాగర్ రావు దాకా ఢిల్లీ, బాంబే ,హైదరాబాదు కార్యాలయాల చుట్టూ లెక్కలేనన్నిసార్లు తిరిగి అనుమతులు సాధించామనీ తెలిపారు.అటు కాలేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణకు నీటి మళ్లింపు చేసి, ఇటు రంగనాయక సాగర్, మరోవైపు మల్లన్న సాగర్, ఇంకో వైపు మిడ్ మానేర్, అన్నపూర్ణ రిజర్వాయర్ల తోపాటు కొండ పోచమ్మ రిజర్వాయర్లు నిర్మించి తెలంగాణ బీడు భూములను సాగు భూములుగా మార్చామని హరీష్ రావు వివరించారు. పాలమూరు కరువును పారదోలమని, వలస వెళ్లిన ప్రజలను తిరిగి వెనక్కు తెచ్చామని పేర్కొన్నారు. 

నేడు ఒరిస్సా ,బీహార్ రాష్ట్రాల నుంచి తెలంగాణకు కూలీల వలసలు ప్రారంభమయ్యాయని వివరించారు. పది రాష్ట్రాలకు సరిపడా బియ్యాన్ని పండిస్తున్న రాష్ట్రం తెలంగాణని కొనియాడారు. విదేశాలకు బియ్యాన్ని సరఫరా చేస్తున్నామని ఇదంతా సాగునీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం వల్లే సాధ్యమైందని మంత్రి వివరించారు.కరువు నేలలు, బిడ్ భూములు తెలంగాణలో నేడు కనుమరుగయ్యాయని మంత్రి పేర్కొన్నారు. రైతుల ఇంట ధాన్యపు రాశులు పండుతూ న్నాయని తెలిపారు. రాష్ట్రంలో సాగునీటి పారుదల రంగా విజయ వెనుక పాలకులతో పాటు అధికారుల కృషి ఎంతో ఉందని మంత్రి కొనియాడారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్ల డానికి ప్రధాన కారణం ఉద్యమకారుల చేతుల్లోనే పగ్గాలు పెట్టడం వల్లే సాధ్యమైందని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.

బాదలు తెలిసిన వాళ్ళకి బాధ్యతలు ఇస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి నిరూపించామన్నారు. సిద్ధిపేట కోమటి చెరువు తోపాటు రంగనాయక సాగరము ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని దేశంలోనే గొప్ప పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దడానికి 100 కోట్లతో ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. ఇక తెలంగాణ ప్రజలు విహారయాత్రలకు గోవా, ఊటీ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కోమటి చెరువు రంగనాయక సాగరులకు వచ్చేలా డెస్టినేషన్ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 

కృత్తిమ బీచ్లను నిర్మిస్తున్నామన్నారు. సెమినార్స్, కాన్ఫరెన్స్, నిర్వహణకు డాక్టర్లు, బిజినెస్ పర్సన్స్, ఇంజనీర్లు రంగనాయక సాగర్ డెస్టినేషన్ వైపు వచ్చేలా చేస్తున్నామన్నారు. సిద్దిపేట చుట్టూ రెండవ రింగ్ రోడ్డును నిర్మిస్తామని వెల్లడించారు. సిద్దిపేటకు మరో రెండు నెలల్లో రైలు సదుపాయం ప్రారంభించనున్నట్లు తెలిపారు.సిద్దిపేట నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమలకు, బిజినెస్ సిటీ బెంగళూరుకు ప్రత్యేక రైళ్లను ప్రారంభిస్తామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. అభివృద్ధికి, ప్రగతికి సిద్దిపేట జిల్లా చిరునామాగా మార్చామని పేర్కొన్నారు.

ప్రజల ఆదరణ, అన్ని శాఖల అధికారుల సహకారం వల్లే ఇది సాధించగలిగామన్నారు.ఈ సభలో సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని ప్రజా ప్రతినిధులు, నామినేటెడ్ చైర్మన్లు సర్పంచులు ఎంపీటీసీలు, మండలాధ్యక్షులు జడ్పిటిసిలు వివిధ శాఖల అధికారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సాగునీటి వనరులు సాధించిన ప్రగతిపై రాజేష్ కళాబృందం పాడిన పాటలు సభికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ సాగునీటి అభివృద్ధి నివేదికను ఈఎంసి హరే రామ్ ఈ సభలో చదివి వినిపించారు. నీటిపారుదల రంగంలో విశేష కృషి చల్పిన ఇంజనీర్ జితేందర్ రెడ్డి మోత్యా ఖాజామయినద్దీన్ మల్లయ్య లకు మంత్రి హరీష్ రావు చేతులమీదుగా మెమొంటోలను అందజేశారు.