మహిళలు, యువతులు నిర్భయంగా ఫిర్యాదు చేయండి: కరీంనగర్ సిపి అభిషేక్ మొహంతి

మహిళలు, యువతులు నిర్భయంగా ఫిర్యాదు చేయండి: కరీంనగర్ సిపి అభిషేక్ మొహంతి

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : 'జిల్లాలోని మహిళలు, యువతులు ఎలాంటి సమస్యలున్నా నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చని పోలీస్ కమిషనర్ అబిషేక్ మహంతి   తెలిపారు. మహిళల రక్షణ కోసం షీ టీం, యాంటి ఉమెన్ ట్రాఫికింగ్ టీంలు పనిచేస్తున్నాయని తెలిపారు. విద్యార్థినులు, మహిళలు వేదింపులకు గురైనప్పుడు భయపడొద్దని, దైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. కళాశాల, పాఠశాలల విద్యార్థులకు ర్యాగింగ్, ఈవ్ టిజింగ్, ఫోక్సో, షీ టీం, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ పై అవగాహన కార్యక్రమాల ద్వారా జిల్లాలో అవగాహన కల్పించామన్నారు. జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ నెలలో షీ టీంకు 11 ఫిర్యాదులు అందాయని, వాటిలో 9 పెట్టి కేసులు, 3 కౌన్సిలింగ్,1 ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశామని, అలాగే 65 హాట్ స్పాట్స్ ని విసిట్ చేస్తూ, 28 అవర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థిని విద్యార్ధులకు, షాపింగ్ మాల్స్ ప్రైవేట్ సంస్థల యందు వివిధ పనులకు వెళ్లే మహిళలకు వేదింపులకు గురైనట్లయితే షీ టీం ను సంప్రదించినచో వారి వివరాల గోప్యంగా ఉంచబడతాయని అవగాహన కల్పించడం జరిగింది. 

అదేవిదంగా పురుషులకి మహిళల పట్ల సోదరీ భావం కలిగి ఉండాలని ఎవరైనా వేధింపులు చేస్తూ పట్టుబడినట్లైతే ఉపేక్షించేది లేదని హెచ్చరించడం జరిగిందని. ఉజ్వలపార్క్, బస్టాండ్ ప్రాంతలలో షీ టీం సభ్యులు డ్యూటీ చేస్తూ మహిళలను వేదిస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తుండగా నలుగురు పోకిరిలను పట్టుకొని  కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ చేయడం జరిగింది. మరల పట్టుబడినట్లయితే కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించడం జరిగింది. చిన్న పిల్లల రక్షణ విషయంలో పోలీసు శాఖ పటిష్ట చర్యలు చేపడుతుందన్నారు.

మహిళలు సామాజిక మాద్యమాలైన ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వినియోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఫొటోలు, వీడియోలు పోస్టు చేసే సమయంలో వ్యక్తిగత భద్రతకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, గుర్తుతెలియని వ్యక్తులు చేసే మెసేజ్ లకు స్పందించవద్దని సూచించారు. కరీంనగర్ షీ టీం ఆఫీస్ మహిళా పోలీస్ స్టేషన్ ఆవరణలో కలదు. షీ టీం కి మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బి. శ్రీనివాస్ ఇంచార్జ్ గా ఉన్నారు. నేరుగా సంప్రదించలేని వారు 87126 70759, లేదా డయల్ 100కు, లేదా షీ టీం QR కోడ్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. కాలనీ ఏరియాలలో స్కూల్ ఏరియాలలో, పబ్లిక్ ప్లేస్ లలో ఎవరైనా వేధింపులు గురి చేసినట్లయితే సమాచారం అందించాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు.