ఆకాంక్ష దూబే ఆత్మహత్యకు ముందు ఆమె గదిలో ఓ వ్యక్తి

ఆకాంక్ష దూబే ఆత్మహత్యకు ముందు ఆమె గదిలో ఓ వ్యక్తి

ప్రముఖ భోజ్ పురి నటి ఆకాంక్ష దూబే ఆత్మహత్య కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించారు. 25 ఏళ్ల దూబే ఈ నెల 26న ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఓ హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. ‘లైక్ హూన్ మైన్ నలైక్ నహీన్’ అనే సినిమా షూటింగ్ కోసం ఆమె వారణాసికి వచ్చినప్పుడు ఇది జరిగింది. హోటల్ గదిలోని సీలింగ్ ఫ్యాన్ కు ఆకాంక్ష దూబే నిర్జీవంగా వేలాడుతూ ఉండడాన్ని గుర్తించిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.  ఆకాంక్ష దూబే మరణించే రోజు రాత్రి ఆమెను ఓ వ్యక్తి వాహనంలో తీసుకొచ్చి హోటల్ దగ్గర దిగబెట్టినట్టు పోలీసులు తెలుసుకున్నారు. అంతేకాదు సదరు వ్యక్తి ఆకాంక్ష గదిలో 17 నిమిషాల పాటు గడిపినట్టు ఆధారాలు లభించాయి. హోటల్లోని సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అతడి కోసం పోలీసులు అన్వేషణ మొదలు పెట్టారు.  ఆమె గదిలో ఆత్మహత్య లేఖ లభించలేదు. తన కుమార్తె మరణంలో ఇద్దరి పాత్ర ఉందని ఆకాంక్ష తల్లి మధు దూబే పోలీసులకు తెలిపారు. సమర్ సింగ్, సంజయ్ సింగ్ పేర్లను వెల్లడించారు. ఈ నెల 21న సమర్ సింగ్ సోదరుడైన సంజయ్ సింగ్ ఆకాంక్షను చంపుతానని బెదిరించగా, అదే విషయాన్ని ఆమె తన తల్లితో పంచుకున్నట్టు సమాచారం.