రెండు వారాల్లో నన్ను చంపేస్తారు..!

రెండు వారాల్లో నన్ను చంపేస్తారు..!

లఖ్‌నవూ: ‘రెండువారాల్లో నన్ను చంపేస్తారు’ అంటూ గ్యాంగ్‌స్టర్ అతీక్‌ అహ్మద్  సోదరుడు అష్రాఫ్ అహ్మద్ ఆరోపణలు చేశాడు. 2006లో ఉమేశ్‌ పాల్ కిడ్నాప్‌ కేసు లో అష్రాఫ్ కూడా ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం బరేలీ జైల్లో ఉన్నాడు.  ఇతడికి మరో పేరు ఖలీద్‌ అజీం అని తెలుస్తోంది.  ‘రెండు వారాల్లో జైలు నుంచి బయటకు రప్పించి చంపేస్తానని ఒక సీనియర్ అధికారి నన్ను బెదిరించాడు. నాపై మోపిన అభియోగాలన్నీ నిరాధారమైనవి. నాపై పెట్టిన తప్పుడు కేసులతో నేను పడుతున్న బాధను ముఖ్యమంత్రి అర్థం చేసుకున్నారు’ అని అష్రాఫ్ వ్యాఖ్యానించాడు. అయితే ఆ అధికారి ఎవరని ప్రశ్నించగా.. తాను పేరు చెప్పలేనన్నాడు. తాను హత్యకు గురైతే ఒక ఎన్వలప్‌లో ఆ పేరు ముఖ్యమంత్రికి చేరుతుందని వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు ఓ వార్తా సంస్థతో మాట్లాడాడు.   2005లో జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్‌ హత్యకేసులో అతీక్‌ అహ్మద్‌ ప్రధాన నిందితుడు. 2019 నుంచి సబర్మతి జైల్లో ఉన్నాడు. ఇతడిపై 100కు పైగా క్రిమినల్‌ కేసులున్నాయి. అయితే, రాజు పాల్‌ హత్య కేసులో ముఖ్యసాక్షిగా ఉన్న ఉమేశ్‌ పాల్‌ 2006లో అపహరణకు గురై విడుదలయ్యాడు. 2007లో అతడు అతీక్‌తోపాటు పలువురిపై కిడ్నాప్‌ కేసు నమోదు చేశాడు. ఈ కేసు విచారణ చివరి రోజు (ఫిబ్రవరి 24, 2023)నే అతడు హత్యకు గురయ్యాడు. ఉమేశ్‌ పాల్ కేసు వేసిన వారిలో అష్రాఫ్ కూడా ఉన్నాడు. ఇప్పుడు ఈ కేసులో అతడు నిర్దోషిగా తేలాడు. అతీక్‌ అహ్మద్ యూపీ ప్రయాగ్‌రాజ్‌ కోర్టు  దోషిగా తేల్చింది.