టెర్రరిస్టులకు, కాంగ్రెస్ నేతలకు తేడా ఏముంది

టెర్రరిస్టులకు, కాంగ్రెస్ నేతలకు తేడా ఏముంది
  • కాంగ్రెస్ ఎంపీ సురేష్ వ్యాఖ్యలు దుర్మార్గం
  • కాంగ్రెస్ నేతలపై దేశ ద్రోహం కేసు పెట్టాలి
  • బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :భారతదేశాన్ని విభజించాలంటూ కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలకు, టెర్రరిస్టులకు తేడా ఏముందని ప్రశ్నించారు. ఈరోజు కరీంగనగర్ లో మీడియాతో మాట్లాడుతూ ‘‘కాశ్మీర్ ను ప్రత్యేక దేశం కావాలని టెర్రరిస్టులు, పంజాబ్ ను ఖలిస్తాన్ దేశంగా ప్రకటించాలని ఉగ్రవాదులు చెబుతున్నారు.  కాంగ్రెస్ ఎంపీ సురేష్ భారత్ ను దక్షిణ దేశంగా, ఉత్తర దేశంగా విభజించాలని అంటున్నడు మరి వాళ్లకు, వీళ్లకు తేడా ఏమిటి?’’ అని అన్నారు.

గతంలో రాహుల్ గాంధీ సైతం భారతీయుడిగా చెప్పుకునేందుకు సిగ్గు పడుతున్నానని దేశాన్ని కించపర్చారన్నారు. ఆయన బావ రాబర్ట్ వాద్రా సైతం భారత్ దుర్బల దేశమని భారతీయులను కించపర్చారని మండిపడ్డారు.భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడే నేతలపై దేశ ద్రోహ కేసు పెట్టాలని కోరారు. భారత్ ను ముక్కలు చేయాలని కోరడం ముమ్మాటికీ దేశ ద్రోహమేనని, ప్రజలంతా వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.ఐఎన్డీఐఏ కూటమి చీలికలు పేలికలైందని, బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆ కూటమి నుండి బయటకు రావడంతోపాటు, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్ పై చేసిన విమర్శలే ఇందుకు నిదర్శనమన్నారు. రాబోయే ఎన్నికల్లో మోదీకి పోటీగా నిలబడటం పక్కనపెడితే  40 ఎంపీ సీట్లు కూడా సాధించడం కాంగ్రెస్ కు సాధ్యం కాదని మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు.

అద్వానీకి భారతరత్న పురస్కారం ప్రకటించడంపట్ల హర్షం వ్యక్తం చేసిన బండి సంజయ్ బీజేపీ కార్యకర్తగా ఉన్నందుకు గర్వపడుతున్నామని, తమకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నామని చెప్పారు. బీజేపీ నేతలకు పద్మసహా ఉన్నత అవార్డులను ప్రదానం చేస్తున్నారనే ప్రచారాన్ని ఖండించారు. రాజకీయాలు, పార్టీలకు అతీతంగా వివిధ రంగాల్లో సేవ చేసిన వారికి పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా పద్మ అవార్డులు ఇచ్చిన ఘనత బీజేపీదేనన్నారు. గతంలో పైరవీలు చేసుకునే వారికే అవార్డులు వచ్చేవని, మోదీ హయాంలో పైరవీలు, అవినీతికి తావులేకుండా నిష్ణాతులైన వారికే అవార్డులు వరిస్తున్నాయని, ఎంతోమంది పేదలకు అవార్డులు దక్కడమే ఇందుకు నిదర్శనమని అన్నారు.