రామ మందిర ప్రాణ ప్రతిష్టను వ్యతిరేకించే వాళ్లు ఈ దేశ పౌరులేనా?

రామ మందిర ప్రాణ ప్రతిష్టను వ్యతిరేకించే వాళ్లు ఈ దేశ పౌరులేనా?
  • సుప్రీంకోర్టు తీర్పుని వ్యతిరేకించడమా?
  • రాహుల్ గాంధీ ధర్నా ఓ డ్రామా
  • అయోధ్య రామ మందిరం ప్రతిష్ట కరసేవకులకే అంకితం
  • అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ప్రధానికి హ్యాట్సాఫ్
  • బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :‘‘రామ మందిర ప్రాణ ప్రతిష్టను వ్యతిరేకించే వాళ్లు అసలు ఈ దేశ పౌరులేనా? అయోధ్యలో రాముడు పుట్టారనడానికి, రామ మందిరం ఉందనడానికి ఆధారాల్లేవని అంటారా? సాక్షాత్తు అత్యున్నత సుప్రీంకోర్టే తీర్పు ఇచ్చిన తరువాత ప్రశ్నిస్తారా? బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి అనుగుణంగా ఇస్తున్న తీర్పునే అవమానిస్తారా?’’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి హిందువుల 5 శతాబ్దాల చిరకాల వాంఛను నెరవేర్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి హ్యాట్సాఫ్ అన్నారు. అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ట మహోత్సవాన్ని కళ్లారా వీక్షించడం ఈ తరం ప్రజలు చేసుకున్న పుణ్యమని అన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ నాటి అయోధ్య కరసేవకుల త్యాగాలను స్మరించుకుని భావోద్వేగానికి గురయ్యారు. 

అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ అంతా రామజ్యోతి మయమైంది. ప్రతి హిందువు తమ ఇంట్లో 5 రామ జ్యోతులను వెలిగించి దీపావళి జరుపుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చైతన్యపురి మహాశక్తి ఆలయంవద్ద రూపొందించిన సైకత అయోధ్య రామ మందిరం వద్ద  స్వయంగా రామజ్యోతులు వెలిగించారు.అక్కడి నుండి నేరుగా తెలంగాణ చౌక్ వద్దకు వచ్చి కాషాయ సైనికులతో కలిసి టపాసులు పేల్చి సంబురాలు జరుపుకున్నారు. జై శ్రీరాం అనే నినాదాలతో ఆ ప్రాంతమంతా మోరుమోగింది. కాషాయ సైనికుల ఆనందోత్సవాల మధ్య బండి సంజయ్ వారితో కలిసి కొద్దిసేపు డ్యాన్సులు చేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ అయోధ్యలో ప్రధాని చేతుల మీదుగా రామాలయ ప్రాణ ప్రతిష్ట జరగడం సంతోషం.అద్బుత సన్నివేశమైన రామాలయ ప్రాణ ప్రతిష్టను చూస్తామని ఈ తరం వాళ్లు అనుకోలేదు. ప్రధానమంత్రి మోదీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పట్టుదలతో, సంకల్పంతో రామ మందిర ప్రాణ ప్రతిష్ట చేశారు. ఆనాడు అయోధ్యలో కరసేవకులను కాల్చి చంపిన చరిత్ర సంఘటనలు గుర్తుకొస్తున్నాయి. ఆనాడు సరయు నదిలో కరసేవకుల రక్తంతో ఏరులై పారిన దృశ్యాలు నా కళ్ల ముందు మెదులుతున్నయ్ అన్నారు.కరసేవకుల బలిదానాలు వృధా కాలేదు. వారి స్పూర్తితో రామ మందిర ప్రాణ ప్రతిష్ట జరిగింది.

రాహుల్ గాంధీ  ధర్నా పెద్ద డ్రామా 

అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట మహత్కార్యాన్ని దారి మళ్లించేందుకే రాహుల్ గాంధీ కుట్ర చేస్తున్నాడని మండిపడ్డారు. అయోధ్యలో గొప్ప కార్యం జరుగుతుంటే ఇక్కడేం పని అని అడిగితే అడ్డుకోవడమా? రాముడు అందరి దేవుడే కదా అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని ఎందుకు వ్యతిరేకించారో కాంగ్రెస్ నేతలు చెప్పాలని ప్రశ్నించారు.1959లొ రామ మందిరాన్ని కూల్చివేసిన చోటకు రాహుల్ గాంధీ తాత నెహ్రూ వెళ్లి బాబర్ మసీదును సందర్శించిన మాట నిజం కాదా?. 1968లో ఇందిరాగాంధీ శ్రీకృష్ణ జన్మస్థానమైన మధిరను ఈద్గాకు కేటాయిస్తానని అఫిడవిట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా?. 1992లో అయోధ్య రామ మందిరం ఉన్న చోటే బాబ్రీ మసీదును కట్టిస్తానని నాటి ప్రధాని పీవీ నర్సింహారావు చేత బలవంతంగా ప్రకటన చేయించిన చరిత్ర కాంగ్రెస్ ది కాదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఉన్నట్లు ఆధారాల్లేవన్న రాజకీయ నేతలు, హేతువాదులు ఈ దేశ పౌరులేనా? అత్యున్నత సుప్రీంకోర్టు రాముడు అయోధ్యలో జన్మించినట్లు ఆధారాలున్నాయని తీర్పునిచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పునిస్తే ప్రశ్నిస్తారా అన్నారు.అయోధ్య ఘట్టాన్ని హేతువాదులు, కాంగ్రెస్ వాదులంతా మూర్ఖులని ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని హితువు పలికారు.