అభివృద్ధికే పట్టం కట్టే బాన్సువాడ ఓటర్లు !

అభివృద్ధికే పట్టం కట్టే బాన్సువాడ ఓటర్లు !
  • ఆరు సార్లు కాంగ్రెస్, ఆరు సార్లు టిడిపికి జై, మూడు సార్లు బిఆరెస్
  • ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది పోచారం రికార్డు
  • బాన్సువాడలో త్రిముఖ పోటీ                                            

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: బాన్సువాడ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధినే ప్రమాణికంగా తీసుకొని తమ నాయకుడిని ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తోంది. నియోజకవర్గంలో 1957 నుంచి 1983 వరకు వరుసగా ఐదు సార్లు కాంగ్రెస్ పార్టీ తన జెండాను ఎగురవేయగా, టిడిపి ఆవిర్భవించాక పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లింది. 1983 నుంచి 1999 వరకు  ఐదు సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా టిడిపి గెలుపొంది బాన్సువాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి ప ధంలో తీసుకెళ్ళింది. 2004లో మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎగురవేయగా, 2009లో టిడిపి గెలుపొందింది. టిఆర్ఎస్ పార్టీలో పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రవేశించాక నియోజకవర్గంలో తిరుగులేని నేతగా గుర్తింపు ఉన్న ఆయనను 2011, 2014, 2018 ఎన్నికల్లో ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారు.   ప్రస్తుతం 8వ సారి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ నుంచి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, బీజేపీ నుంచి నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ బరిలో ఉన్నారు. బాన్సువాడ నియోజకవర్గ చరిత్రను పరిశీలిస్తే......

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడక ముందే నిజాం కాలంలో హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్న రోజుల్లో బాన్సువాడను తాలు కాగా ఏర్పాటు చేశారు. ఇందులో బాన్సువాడ, బీర్కూర్తో పాటు నిజాంసాగర్, పిట్లం మండలాలు ఉండేవి. దీనినే సమితిగా పేర్కొనే వారు.  1952లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా బాన్సువాడ, బీర్కూర్, కోటగిరి, వర్నీ మండలాలను కలిపి నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేశారు. 1957లో మొదటి సారి నియోజకవర్గానికి సాధారణ ఎన్నికలను నిర్వహించారు. 2016లో జరిగిన జిల్లాల పునర్విభజనలో భాగంగా బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాలను కామారెడ్డి జిల్లాలో, కోటగిరి, వర్నీ, రుద్రూర్, చందూర్, మొస్రా, పోతాంగల్ మండలాలను నిజామాబాద్ జిల్లాలో కలిపారు. బాన్సువాడ నియోజకవర్గ కేంద్రం కామారెడ్డి జిల్లా కేంద్రానికి 60 కిలో మీటర్ల దూరంలో, నిజామాబాద్ జిల్లా కేంద్రానికి 52 కిలోమీ టర్ల దూరంలో ఉంది. బాన్సువాడ నియోజకవర్గానికి ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరుగగా, కాంగ్రెస్, కాంగ్రెస్ (ఐ)లు కలిపి ఇప్పటి వరకు ఆరు సార్లు విజయం సాధించగా, తెలుగుదేశం పార్టీ ఆరుసార్లు గెలుపొందింది. 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో టిడిపి నుంచి టీఆర్ఎస్లో చేరిన పోచారం శ్రీనివాసరెడ్డి భారీ మెజారిటీతో గెలుపొంది, గులాబీ జెండాను ఎగురవేశారు. 2014లోనూ ఆయన గెలుపొంది మంత్రి పదవిని అలకించారు. 2018లో గెలుపొంది అత్యున్నత స్పీకర్ పదవిని పొందారు.

ఎమ్మెల్యే పదవులు :

1957లో బాన్సువాడ నియోజకవర్గానికి మొదటి సారిగా ఎన్నికలను నిర్వహించారు. ఆనాడు కాంగ్రెస్ అభ్యర్థినిగా యల్లాప్రగడ సీతాకుమారి నామీనేషన్ వేశారు. పోటీలో ఎవరూ లేకపోవడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. 1963,67, 72, 78 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో వరుసగా నాలుగు సార్లు కాంగ్రెస్ అభ్యర్థి ఎం. శ్రీనివాస్ రావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. 1983లో టిడిపి తరపున మొదటి సారి పోటీ చేసిన కిషన్ సింగ్, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రావుపై మంచి మెజారిటీతోనే గెలుపొందారు. 1985లో టిడిపి అభ్యర్థి ఎస్వీఎల్ నర్సింహారావు, 1989లో టిడిపి అభ్యర్థి కత్తెర గంగాధర్లు గెలుపొందారు. పోచారం... ఆరు సార్లు విజయం

తన ఊరి పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి టిడిపి తరుపున 1994లో  ఎన్నికల బరిలో నిలవగా,  కాంగ్రెస్ అభ్యర్థిని బీనాదేవిపై సుమారు 56వేల ఓట్లతో మెజారిటీతో గెలుపొందారు. అభివృద్ధే లక్ష్యంగా ఆయన పని చేయడం వల్ల అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పోచారంనకు 1998లో మంత్రి పదవితో సత్కరించారు. అనంతరం 1999 సాధారణ ఎన్నికల్లోనూ పోచారం శ్రీనివాస్ రెడ్డియే భారీ మెజారిటీతో గెలుపొంది మంత్రి పదవిని అలకించారు. అయితే 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సునామీలో టిడిపి కొట్టుకుపోయింది. దీంతో టిడిపి అభ్యర్థి పోచారంనకు కాంగ్రెస్ నుంచి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన బాజిరెడ్డి గోవర్ధన్ సుమారు 26వేల మెజారిటీతో గెలుపొందారు. కానీ కాంగ్రెస్ తన సీటును ని లుపుకోలేకపోయింది. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బాజిరెడ్డిపై మళ్ళీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గెలుపొందారు. టిడిపి అధినేత చం ద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతం కారణంగా విసుగెత్తిన పోచారం 2011లో ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, టీఆర్ఎస్లో చేరారు. జిల్లాలో ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్ళిన పోచారం, 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్పై సుమారు 49వేల వె జారిటీతో గెలుపొందారు. టిఆర్ఎస్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా పదవిని అలంకరించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కాసులు బాలారాజుపై సుమారు 26వేల మెజారిటీతో గెలుపొంది. కేసీఆర్ కేబినెట్లో రాష్ట్ర వ్యవసాయ, సహకార, ఉద్యానవన శాఖ మంత్రిగా పదవులు ని ర్వర్తించారు.  2018 ఎన్నికల్లోను కాంగ్రెస్ అభ్యర్ధి కాసుల బాలరాజుపై 18 వేల మెజారిటీ తో గెలుపొంది, అసెంబ్లీ స్పీకర్ పదవి పొంది, సమర్ధవంతంగా అసెంబ్లీని నడిపారు. అలాగే బాన్సువాడ ను సుమారు 10వేల కోట్లతో అభివృద్ధి చేశారు.  పెరుగుతున్న వయస్సు రీత్యా ప్రస్తుతం ఆఖరి సారి ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తుండగా, ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో పోచారం ను గెలిపించేందుకు కార్యకర్తలు, నాయకులు ఉవ్విళ్లూరుతున్నారు.  మరోవైపు స్థానికేతారులైన కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులు నామినేషన్ గడువు ముగిసిన తరువాత నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏదీ ఏమైనా ప్రస్తుత ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో? ప్రజల ఆదరణ ఎటు వైపు ఉందో డిసెంబర్3 వరకు వేచి చూడాల్సిందే !