సింగరేణి కార్మికులను మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు - గండ్ర సత్యనారాయణ రావు

సింగరేణి కార్మికులను మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు - గండ్ర సత్యనారాయణ రావు

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి కార్మికులను మోసం చేస్తున్నాయని టిపిసిసి సభ్యులు, భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గండ్ర సత్యనారాయణ రావు  అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బస్వరాజుపల్లి గ్రామ శివారులోని కేటీకే 8 ఇంక్లైన్ లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన ఐఎన్టీయుసీ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులతో బుధవారం గేట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగుకు గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఒకటేనని, వారి మోసపూరిత మాటలను కార్మీకులు నమ్మవద్దని అన్నారు. బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి సంస్థ, అభివృద్ధిలో కార్మికుల శ్రమ కష్టం ఎంతో ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని అడ్డు పెట్టుకొని మీకు ఇల్లు ఇస్తాం, దళిత బంధు ఇస్తాం, బీసీ, మైనార్టీ బంధు ఇస్తామని ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ, ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. గడిచిన తొమ్మిదిన్నరేండ్ల పాలనలో చెయ్యని అభివృద్ధి మళ్ళీ గెలిపిస్తే చేస్తారా? అంటూ ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాలన్నారు. సీఎం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి అన్నివర్గాల ప్రజలను మోసం చేశారని, మళ్ళీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఓట్ల కోసం డబ్బు సంచులు పట్టుకొని బీఆర్ఎస్ నాయకులు వస్తున్నారన్నారని తెలిపారు. మనల్ని మోసం చేసిన వారిని, మనకు ఇల్లు ఇవ్వని వారిని మన ఇండ్లలోకి రానివ్వొద్దని ఆయన కోరారు.