మేడ్చల్ అసెంబ్లీ భరిలో ఈటెల జమున?

 మేడ్చల్ అసెంబ్లీ భరిలో ఈటెల జమున?

ముద్ర ప్రతినిధి, మేడ్చల్ : మేడ్చల్ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య పోటీ రసవత్తరంగా ఉండనుంది. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న మంత్రి మల్లారెడ్డిని ఢీ కొట్టగల ధీటైన అభ్యర్థి ఎంపిక కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి మంత్రి మల్లారెడ్డికి ఇప్పటికే టికెట్ కన్ఫర్మ్ అవ్వగా  కాంగ్రెస్, బీజేపీ నుంచి ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. బీజేపీ మాత్రం మేడ్చల్ అసెంబ్లీ స్థానాన్ని ఛాలెంజ్ గా తీసుకొని ఈ స్థానంలో కమలం జెండా ఎలాగైనా ఎగరవేయాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ తెలంగాణ రాష్ట్ర చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమునను బరిలో దింపబోతుందని పార్టీ వర్గాలలో జోరుగా చర్చ సాగుతోంది. అదే గనక నిజమైతే మేడ్చల్ అసెంబ్లీ స్థానంలో పోటీ రసవత్తరంగా సాగడంతో పాటు రాజకీయ పరిణామాలు పూర్తిగా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే మేడ్చల్ అసెంబ్లీ బరిలో బీజేపీ తరపున పోటీ చేసేందుకు ఇప్పటికే కొంపల్లి మోహన్ రెడ్డి, విక్రంరెడ్డి ఎవరికి వారు కొంతకాలం నుంచి తీవ్ర ప్రయత్నాలు చేసుకుంటున్నారు. పార్టీ అధిష్టానం మాత్రం ఈటల జమునను పోటీలో దింపాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.