ఇకపై నిరంతరంగా సీఎం కప్‌.. అంతం కాదిది ఆరంభం

ఇకపై నిరంతరంగా సీఎం కప్‌.. అంతం కాదిది ఆరంభం
  • దేశానికే ఆదర్శంగా తెలంగాణ - త్వరలో నూతన క్రీడా విధానం
  • క్రీడా మంత్రి డా॥ వి. శ్రీనివాస్‌ గౌడ్‌
  • యువ క్రీడా చైతన్యానికి ప్రతీక సీఎం కప్‌ 
  • ఇంటి పండుగలా నిర్వహణ / 6 స్టేడియాల్లో, 18 క్రీడాంశాల్లో పోటీలు ప్రారంభం 
  • సాట్స్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌
ముద్ర ప్రతినిది, హైదరాబాద్ : సీఎం కప్‌ను ఇకపై నిరంతరంగా ప్రతి సంవత్సరం నిర్వహించి, గ్రామీణ క్రీడా ప్రతిభను ప్రోత్సహిస్తామని రాష్ట్ర ఎక్త్సెజ్‌, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్‌ వి. శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. సీఎం కప్‌ ` 2023 పోటీలను ఈరోజు ఉదయం ఎల్‌బి స్టేడియంలో క్రీడా శాఖ మంత్రి డాక్టర్‌ వి. శ్రీనివాస్‌ గౌడ్‌, సాట్స్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్ద్యేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత పది సంవత్సరాల నుండి అనేక కార్యక్రమాలు నిర్వహించిందని, క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్‌, ప్రొఫెషనల్‌ కోర్సులలో 0.5 రిజర్వేషన్‌ అమలు, భారీగా నగదు ప్రోత్సాహకాల పెంపు, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు నగదు ప్రోత్సహకాలతో పాటు ఇండ్ల స్థలాల కేటాయింపు వంటి నిర్ణయాలతో దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచిందన్నారు. 16 వేల గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి గ్రామీణ స్థాయి నుంచి అంచెలంచెలుగా క్రీడాభివృద్ధి సాధించిందని, తెలంగాణ రాష్ట్రం ఆచరిస్తోన్న విధానాలు చూసి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తాయని ఆయన అన్నారు. సీఎం కప్‌ నిర్వహణ అంతం కాదిది ఆరంభమని ఇకపై నిరంతరం కొనసాగుతుందని ఆయన ఉద్ఘాటించారు. 

18 క్రీడాంశాల్లో పోటీలు ప్రారంభం
సాట్స్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ మాట్లాడుతూ మట్టిలో మాణిక్యాలను గుర్తించి వారి ఉత్సాహానికి ప్రోత్సాహం ఇచ్చే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా యువ క్రీడా చైతన్యాన్ని వెల్లివిరిసే దిశగా సీఎం కప్‌ ` 2023 పోటీల నిర్వహణ జరుగుతోందని  అన్నారు. దశాబ్ది కాలంలో తెలంగాణ రాష్ట్రం అబ్బురపరిచే విజయాలతో దూసుకెళ్తుందని, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్‌  నాయకత్వంలో అన్ని రంగాల మాదిరిగానే క్రీడారంగం కూడా అద్భుతమైన ఫలితాలను సాధిస్తుందని అన్నారు. ఆదివారం హైదరాబాద్‌ నగరంలోని ఎల్‌బి స్టేడియం, గచ్చిబౌలి స్టేడియం, జింఖాన గ్రౌండ్స్‌, సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియం, కెవిబిఆర్‌ ఇండోర్‌ స్టేడియం, షూటింగ్‌రేంజ్‌లో కలిపి మొత్తం 18 క్రీడాంశాల్లో సీఎం కప్‌ ` 2023 రాష్ట్ర స్థాయి పోటీలు ప్రారంభమయ్యాయి.
6 స్టేడియాల్లో ఆరంభమైన పోటీలు 
సీఎం కప్‌ - 2023 రాష్ట్ర స్థాయి పోటీలు 6 స్టేడియాల్లో ఆదివారం ఆరంభం అయ్యాయి. ఈ రోజు ఎల్‌బి స్టేడియంలో జరిగిన  సీఎం కప్‌ - 2023 పోటీలకు ముఖ్య అతిథులుగా హాజరై, హ్యాండ్‌బాల్‌ పోటీలను ప్రారంభించిన రాష్ట్ర క్రీడా అబ్కారి, పర్యాటక, యువజన సర్వీసుల శాఖల మంత్రివర్యులు వి. శ్రీనివాస్‌ గౌడ్‌ , తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ , పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడా శాఖ మంత్రివర్యులు శ్రీనివాస్‌ గౌడ్‌  మాట్లాడుతూ క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 2 శాతం రిజర్వేషన్స్‌ ఇస్తూ, క్రీడలకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుంది అని మంత్రి  తెలిపారు. వివిధ జిల్లాలోని రాష్ట్ర స్థాయికి విచ్చేసిన క్రీడకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని సూచించారు.

మండల, జిల్లా స్థాయి పోటీల్లో విజయం సాధించి, రాష్ట్ర స్థాయికి ఎంపికైన దాదాపు 7 వేలకు పైగా క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. నిన్న రాత్రే నగరానికి చేరుకున్న ఆ క్రీడాకారులందరికి వసతి సౌకర్యాలు, భోజన ఏర్పాట్లను సాట్స్‌ నిరంతరం పర్యవేక్షిస్తోందని ఆయన తెలిపారు. క్రీడాకారులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా సాట్స్‌ వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో సీఎం కప్‌ ` 2023 పోటీలను విజయవంతం చేస్తోందని వివరించారు. ఈ కార్యక్రమంలో సాట్స్‌ ఓఎస్‌డి డా॥ కె. లక్ష్మీ, డిప్యూటి డైరెక్టర్లు శ్రీమతి వి. సుజాత, ధనలక్ష్మీ, హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షులు జగన్‌ మోహన్‌రావ్‌, టేబుల్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ తదితరులు పాల్గొన్నారు.
జింఖానా గ్రౌండ్‌
జింఖానా గ్రౌండ్‌లో ఈరోజు ఉదయం సీఎం కప్‌ పోటీలను ప్రారంభించి, క్రీడాకారులను ఉద్ద్యేశించి ప్రసంగించిన సాట్స్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ గత నెల రోజుల నుండి యావత్‌ తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఆటల పోటీలతో కళకళలాడుతూ జాతరలను తలపింపజేస్తున్నాయన్నారు. వివిధ గ్రామాలు, జిల్లాల నుండి హైదరాబాద్‌కి విచ్చేసి రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనడం అద్భుతమైన అవకాశం అని, ఇది రాష్ట్రంలో అతి పెద్ద యువ క్రీడా సంబురం అని తెలిపారు. రాష్ట్ర స్థాయి సీఎం కప్‌ పోటీలను క్రీడా ప్రేమికులు వీక్షించి, క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సాహించాలని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహంతో  నిఖిత్‌ జరిన్‌, ఈషాసింగ్‌ లాంటి ఎంతో మంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు అని ఆయన అన్నారు.

గచ్చిబౌలి 
జిఎంసి బాలయోగి స్టేడియంలో జరుగుతున్న పోటీలను క్రీడలు, యువజనాభివృద్ధి, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా ప్రారంభించారు. క్రీడల నిర్వహణలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు రంగారెడ్డి డిఆర్‌డిఏ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌, సిద్ధిపేట డివైఎస్‌ఓ నాగేందర్‌, వివిధ క్రీడా సంఘాలు, ప్రతినిధులు పాల్గొన్నారు. 
సరూర్‌నగర్‌ 
సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో జరుగుతున్న పోటీలను రాష్ట్ర బెవరేజెస్‌ కార్పోరేషన్‌ ఛైర్మన్‌ గజ్జెల నాగేష్‌, ఓలంపిక్‌ అసోసియేషన్‌ కార్యదర్శి జగదీష్‌ యాదవ్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి డైరెక్టర్లు, చంద్రారెడ్డి, అనురాధ తదితరులు పాల్గొన్నారు. 

యూసఫ్‌గూడా 
యూసఫ్‌గూడా స్టేడియంలో జరుగుతున్న బాస్కెట్‌బాల్‌, రెజ్లింగ్‌ పోటీలను సాట్స్‌ ఓఎస్‌డి డాక్టర్‌ కె. లక్ష్మీ ప్రారంభించారు. క్రీడాకారులకు సాట్స్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ స్పోర్ట్స్‌ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఓలంపిక్‌ అసోసియేషన్‌ ఛైర్మన్‌ డా॥ ఎస్‌. వేణుగోపాలచారి, స్టేడియం అడ్మినిస్ట్రేటర్‌ రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు