ఫోకస్ తెలంగాణ!

ఫోకస్ తెలంగాణ!
  • కేంద్ర కేబినెట్ లో ఎలక్షన్​స్పెషల్​
  • రాష్ట్రానికి తాయిలాల కోసమే భేటీ!
  • పసుపు బోర్డు ఏర్పాటుకు అడుగులు
  • ట్రైబల్ యూనివర్సిటీకి గ్రీన్ సిగ్నల్​
  • కృష్ణా జలాల పంపిణీపైనా ట్రిబ్యునల్!
  • ఎన్నికలకు ముందే కేంద్రం ప్రకటన
  • నాలుగున్నరేండ్ల డిమాండ్లకు ఇప్పుడు నిర్ణయం
  • కిషన్ రెడ్డి హుటాహుటి టూర్ అందుకేనా?
     


ఢిల్లీలో బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం తెలంగాణ కోసమే నిర్వహించినట్లుగా స్పష్టమవుతోంది. రాష్ట్రంలో రాజకీయంగా హాట్ కామెంట్స్​చేసిన ప్రధాని మోడీ.. ఇక్కడ ప్రకటించినట్లుగా నిజమాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మరోవైపు గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని పాలమూరు సభలో ప్రధాని ప్రకటించిన రెండ్రోజులకే వర్సిటీకి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే రాష్ట్రం తెలంగాణ ఏర్పాటు నుంచి సాగుతున్న కృష్ణా జల వివాదాలపై కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుకు సైతం ఆమోదం తెలిపారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ప్రధాని ప్రకటించిన ఒక్క రోజులోనే కేంద్ర కేబినెట్​ఉన్నఫళంగా భేటీ కావడం.. ఇందులో కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణపై బీజేపీ స్పెషల్​ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. 

హస్తినకు అత్యవసరంగా కిషన్​రెడ్డి!

రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కిషన్​రెడ్డి కేంద్ర కేబినెట్ భేటీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. బుధవారం మాత్రం తెలంగాణ అంశాలపై నిర్ణయాలు ఉండటంతో.. అత్యవసరంగా ఢిల్లీ ఫ్లైటెక్కారు. దీన్నిబట్టి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర కేబినెట్ సమావేశంలో రాష్ట్ర అంశాలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వబోతున్నట్టుగా ముందుగానే సమాచారం ఉందని తాజాగా తెలుస్తోంది. కేంద్ర కేబినెట్ నిర్ణయాల కోసమే కిషన్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందని చెపుతున్నారు. ఢిల్లీ వెళ్లిన కిషన్​రెడ్డి బుధవారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికలు, అభ్యర్థుల ఎంపికపై వీరు లోతుగా చర్చలు జరిపినట్లు సమాచారం.

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో పసుపు బోర్డుపై నాలుగున్నరేండ్ల నుంచి సాగుతున్న వ్యవహారంలో కేంద్ర కేబినెట్ ముందడుగేసింది. నిజామాబాద్​లో పసుపు బోర్డు నెలకొల్పనున్నట్లు కేబినెట్​నిర్ణయం తీసుకుంది. అలాగే ములుగు జిల్లాలో గిరిజనుల ఆరాధ్య దైవమైన సమ్మక్క, సారక్క పేర్లపై కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం, కృష్ణా జల వివాదాలపై కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుకు కేంద్రమంత్రులు ఆమోదం తెలిపారు. నిజానికి ఒక ట్రిబ్యునల్ లో వివాదంపై చర్చ నడుస్తుండగా, మరో ట్రిబ్యునల్ అవసరం లేదంటూ ఇప్పటివరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చెప్తూ వచ్చింది. కానీ కీలకమైన ఎన్నికల ముంగిట ఈ నిర్ణయం తీసుకున్నది. కృష్ణా జలాల్లో ఏపీ, తెలంగాణ వాటాలు తేల్చాలని ట్రిబ్యునల్ కు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కొత్త నిబంధనలు రూపొందించాలని ఆదేశించింది. దీంతో ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల వివాదం ఓ కొలిక్కిరానుంది.  

విమర్శలకు సమాధానమిస్తూ..!

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కేంద్ర కేబినెట్ నిర్ణయాలు రాజకీయ చర్చకు దారి తీస్తున్నాయి. కొంతకాలంగా తాము వేర్వేరు.. బీ టీం కాదు.. ఏ టీం కాదు అంటూ వాదనలకు దిగుతున్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు.. ఇప్పుడు కీలకమైన నిర్ణయాలతో బీజేపీ మరోసారి వేర్వేరు అనే విధంగా తేల్చుకునేందుకు సిద్ధమైనట్లుగా రాజకీయ పరిణామాలను మార్చుతున్నది. అయితే, కేంద్ర కేబినెట్ నిర్ణయాలను తమ విజయంగా చెప్పుకునేందుకు ఇటు బీఆర్ఎస్​ కూడా రంగంలోకి దిగుతున్నది. ఇటీవల సీఎం కేసీఆర్ బీజేపీపై మూడు ప్రధాన అంశాల్లోనే తీవ్రమైన విమర్శలు చేస్తూ వస్తున్నారు. పసుపు బోర్డు హామీని తెరపైకి తెచ్చారు. నిజామాబాద్​లో పర్యటనలు పెంచిన ఆ పార్టీ.. ఎమ్మెల్సీ కవిత సైతం ఇటీవల ఇదే నినాదాన్ని అందుకున్నది. గత ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసిన ధర్మపురి అరవింద్ బీజేపీని గెలిపిస్తే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని రైతులకు బాండ్ కూడా రాసిచ్చారంటూ సంబంధిత పత్రాల ఫొటోలను ప్రచారానికి తీసుకుంటున్నారు. పసుపు బోర్డు వ్యవహారంలో కేంద్రం కూడా నాలుగేండ్ల నుంచి నాన్చుతూనే వస్తుంది. పసుపు బోర్డును కాదని.. స్పైసిస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని మాత్రమే ఏర్పాటు చేయడంతో బీజేపీపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ లోనూ పసుపుబోర్డు ఏర్పాటు చేయడం సాధ్యం కాదన్నారు. కానీ ఇప్పుడు ఎన్నికలకు ముందు దీనిపై నిర్ణయం తీసుకుని కేబినెట్ లో కూడా ఆమోదించారు. 

జల వివాదాల్లో..

ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటిని పరిష్కరించడంలో కేంద్రం వేడుక చూస్తున్నట్లుగా వ్యవహరించింది. అపెక్స్ కమిటీ భేటీ నిర్వహించినా.. జల వివాదాలు తేల్చలేదు. అయితే రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలను కేంద్రం కొన్ని సందర్భాల్లో రాజకీయంగా అనుకూలంగా మల్చుకుంటుందనే ప్రచారం కూడా జరిగింది. దీనికితోడుగా గోదావరి జలాలను తమిళనాడుకు తరలించే గోదావరి–కావేరీ ప్రాజెక్టుకు సైతం కేంద్రం అడుగులు ముందుకేసి.. రెండు తెలుగు రాష్ట్రాలకు వాటర్​వార్​ను పెంచింది. 2014లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయిన సమయంలో ఉమ్మడి రాష్ట్రానికి ముందు నుంచి ఉన్న 811 టీఎంసీల నీటిని రెండు రాష్ట్రాలు పంచుకున్నాయి. ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించారు. అయితే రాష్ట్ర విభజన సమయంలో ఇది తాత్కాలిక సర్దుబాటు మాత్రమే అని చెప్పినా.. ఇప్పటి వరకూ దీనిపై ఎలాంటి అడుగు పడలేదు. అయితే, విభజన చట్టం కింద కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేశారు. ఈ బోర్డే నీటిని పంచుతోంది. రాష్ట్రం విడిపోయిన తరువాత నీటి పంపకాలు కూడా కొత్తగా చేపట్టాలని తెలంగాణ పదేపదే కోరుతున్నది. కేఆర్​ఎంబీ నిర్వహిస్తున్న సమావేశాల్లో తెలంగాణ ఇంజినీర్లు దీనిపైనే పట్టుపడుతున్నారు. దీంతో జల వివాదాలు ముదురుతున్నాయి. అయితే, అంతకుముందు తీర్పుల సమయంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా లేదు కాబట్టి, తెలంగాణ వాదన వినేలా కొత్త ట్రిబ్యునల్ కావాలని తెలంగాణ వాదించింది. అందుకోసం కొత్తగా ట్రిబ్యునల్ వేయాలని 2014 నుంచి డిమాండ్​ చేస్తున్నారు. రెండుసార్లు అపెక్స్​కమిటీ భేటీ అయినా.. దీనిపై కేంద్రం నిర్లక్ష్యమే చూపించింది. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయకుంటే.. ఉన్న ట్రిబ్యునలే కొత్తగా నీటి పంపకాలు చేయాలని డిమాండ్ చేసింది. మొన్నటి వరకు ట్రిబ్యునల్​ప్రస్తావన తీసుకురాని కేంద్రం.. ఇప్పుడు ఎన్నికల ముందు కొత్త ట్రిబ్యునల్​ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక, గిరిజన వర్శిటీ చాలా కాలంగా పెండింగ్ లో ఉంది. ఇది విభజన చట్టంలో హామీ. ఎన్నికలకు వెళ్లే ముందు ఈ హామీని నెరవేరస్తూ నిర్ణయం తీసుకున్నారు. గిరిజన యూనివర్సిటీకి రూ. 889 కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.

తాయిలాలేనా..?

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఎన్నికల తాయిలాలను ప్రకటించినట్లుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్ర అసెంబ్లీకి ఈనెల 10 లేదా 13 వరకు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. ఈ తరుణంలో బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో తెలంగాణ కోసమే మూడు ప్రధాన నిర్ణయాలు తీసుకున్నారు. నిజానికి బీజేపీ కర్ణాటకలో ఫెయిలవడంతో.. తెలంగాణపై కొంత ఫోకస్​పెంచినట్లుగా బీజేపీ ప్రయత్నాలు చేసింది. దీనికి అనుగుణంగా రెండు ఉప ఎన్నికలతోపాటుగా జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి కలిసి వచ్చింది. కానీ పార్టీలో జరిగిన కొన్ని పరిణామాలు ఇప్పుడు బీజేపీని ఎన్నికల ఉనికిలో లేకుండా చేసిందనే ప్రచారం జరుగుతున్నది. తాజాగా ఇటీవల ప్రధాని మోడీ రాష్ట్రానికి వచ్చి ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించారు. ఈ దఫా అధికారంలోకి రావాలని బీజేపీ వ్యూహాంతో ముందుకు సాగుతున్నట్లుగా వ్యవహరిస్తున్నది. కొంతకాలంగా బీజేపీ లక్ష్యంగా బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు అడపాదడపా ప్రయత్నాలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో లబ్ధి కోసమే కేంద్రం కేబినెట్ లో  మూడు అంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజామాబాద్ రైతులు పసుపు బోర్డు ఏర్పాటు విషయమై పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. గత ఎన్నికల సమయంలో పసుపు బోర్డు అంశం ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేసింది. నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా బీజేపీకి కలిసివస్తుందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి మాట్లాడుతూ కృష్ణాజలాలపై  కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం మధ్య గతంలో చర్చలు జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. కృష్ణా జలాల్లో తమ వాటా తేల్చాలని  తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు దాఖలును కిషన్ రెడ్డి గుర్తు చేశారు. అయితే ఈ విషయాన్ని తాము పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో సుప్రీంకోర్టులో కేసును తెలంగాణ సర్కార్ వెనక్కు తీసుకుందన్నారు. కృష్ణా జలాలపై వివాదాన్ని పరిష్కరించిన కేంద్రానికి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.