విలువైన మట్టి కొట్టుకుపోతున్నారు...

విలువైన మట్టి కొట్టుకుపోతున్నారు...
  • యథేచ్ఛగా అక్రమ మట్టి త్రవ్వకాలు
  • తొర్రూరు రెవెన్యూ లో అక్రమ మట్టి దందా
  • భారీగా సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు
  • చోద్యం చూస్తున్న నియంత్రణ శాఖల అధికారులు

ఇబ్రహీంపట్నం, ముద్ర:  నగర శివార్లలో మట్టి మాఫియా ఆగడాలు హెచ్చు మీరుతున్నాయి. అనుమతులు లేకుండా మట్టి త్రవ్వకాలు జరిపి విక్రయిస్తూ కొందరు అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు. రైతుల అవసరాల సాకుతో ప్రైవేటు, ప్రభుత్వ భూములను కొల్లగొట్టి మట్టి కొట్టుకుపోతున్నారు. కొంత మంది ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు మట్టి మాఫియా అవతారం ఎత్తి వ్యాపారం చేస్తూ రూ. లక్షలు గడిస్తున్నారు. ఇంతా జరుగుతున్నా సంబంధిత నియంత్రణా అధికారులు మాత్రం ఉదాసీనంగా వ్యవహరించడంతో మట్టి మాఫియా ఆగడాలు మితి మీరుతున్నాయి. ఈ తవ్వకాల తంతు వెనుక రాజకీయ పార్టీ నాయకుల ఆశీస్సులు ఉండటంతో మట్టి దందా జోరుగా సాగుతోంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని తుర్కయంజాల్ మున్సిపాలిటి తొర్రూర్ రెవిన్యూ పరిధి సర్వే నంబర్  383/1, ప్రభుత్వ భూమిలో మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ మట్టిని టిప్పర్ లలో ఖాళీ స్థలాలు, లేఅవుట్లకు తరలిస్తూ ఒక్కొక్క టిప్పర్ కి రూ. 5 నుండి 10 వేల వరకు వసూలు చేస్తున్నారు. భారీగా మట్టి వ్యాపారం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో కోట్లాది రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది.

పగలు, రాత్రి తేడా లేకుండా తవ్వకాలు చేపడుతున్నా సంబంధిత నియంత్రణా అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లోతట్టు పంట భూములను ఎత్తు చేయడానికి అంటూ ఇరిగేషన్‌ అధికారుల నుంచి మొక్కుబడిగా అనుమతులు తీసుకుంటున్నారు. ఎక్స్‌కవేటర్లతో మట్టిని తవ్వి రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లలో రోడ్ల నిర్మాణం, ఖాళీ స్థలాలను ఎత్తు చేయడానికి మట్టి తరలిస్తున్నారు. అక్రమ తవ్వకాలపై ఫిర్యాదులు చేసినా అధికారులకు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.