అజరామరం..ఘంటసాల గానం

అజరామరం..ఘంటసాల గానం
  • ఆయన స్వరధార ఇప్పటికీ, ఎప్పటికీ అమృతమే. 
  • గాన గంధర్వడు, పద్మశ్రీ ఘంటసాల జయంతి వేడుకలు
  • ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-తెలుగు పాట ఉన్నం త కాలం ఘంటసాల వెంకటేశ్వరరావు సజీవంగా ఉంటారని మాజీ మంత్రి , సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్  రెడ్డి పేర్కొన్నారు. అమర గాయకుడు ఘంటసాల 101 వ జయంతి వేడుకల సందర్భంగా  సూర్యాపేట లో జ్ఞాన సరస్వతి సంస్కృతిక కళావేదిక ఆధ్వర్యంలో  స్వరనీరాజన  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సినిమా సంగీతాన్ని ఎవరెస్ట్  ఎత్తుకు చేర్చిన ఘనత ఘంటశాల మాస్టారుది అని కొనియాడారు. బెజవాడ నుంచి బ్రెజిల్‌ దాకా, పంజాబ్‌ నుంచి పారిస్‌ దాకా ఆయన ఖ్యాతి ఎరుగని వారుండరన్నారు.

గేయ రచయితలు అక్షరాలకు ప్రాణం పోసేస్తే..ఆ మాటలను మల్లియల మాలికలు చేసి​ శ్రోతలను ఉర్రూతలూగించిన గళం ఆయన సొంతం అన్నారు. శిలలపై చిక్కిన శిల్పాల సరిగమలతో సమ్మోహనం చేసిన స్వరం ఘంటసాలగారిదన్నారు. ఆయన నిష్క్రమించి  దశాబ్దాలు దాటిపోయినా సినీ సంగీతంలో ఓలలాడించిన జగదేక వీరుడు అని కొనియాడారు.జోలపాడినా, వెన్నుతట్టినా, మొట్టికాయలేసినా, భావగీతమైనా, విషాదగీతమైనా, విప్లవగీతమైనా ఘంటసాల తరువాతే ఎవరైనా అన్నారు. కేవలం 51 ఏళ్ల వయసులోనే ఆయనను కోల్పోవడం తెలుగు జాతి దురదృష్టం అన్నారు. అంతకు ముందు  ఘంటసాల చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలువురు గాయకులు ఆయన పాడిన గేయాలను వినిపించారు. ప్రస్తుత తరానికి మహానుభావుడి విశిష్టతను తెలియజేయడానికి కార్యక్రమాన్ని నిర్వహించిన జ్ఞాన సరస్వతి సాంస్కృతి కళావేదిక సభ్యులను జగదీష్  రెడ్డి అభినందించారు.