తుంగతుర్తిలో చర్చినియాంశంగా మారిన గత అసెంబ్లీ ఎన్నికల వివాదం

తుంగతుర్తిలో చర్చినియాంశంగా మారిన గత అసెంబ్లీ ఎన్నికల వివాదం
  • న్యాయస్థానంలో ఎమ్మెల్యే పిటిషన్ కొట్టివేత పై సర్వత్రా చర్చ
  • ఆలస్యమైన న్యాయమే గెలుస్తుంది అంటున్న అద్దంకి దయాకర్

తుంగతుర్తి ముద్ర:-రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం నమోదైన కేసులు ఒక్కటి ఒక్కటిగా జడ్జిమెంట్లు రావడం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఫలితాలు వ్యతిరేకంగా ఉండడం సంచలనం సృష్టిస్తుండగా తాజాగా తుంగతుర్తి అసెంబ్లీ స్థానానికి సంబంధించిన ఫలితాల కేసు సైతం చర్చనీయాంశంగా మారింది .మంగళవారం గత ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి అద్దంకి దయాకర్ వేసిన పిటిషన్ కొట్టి వేయాలని అధికార పార్టీ శాసనసభ్యుడు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ వేసిన పిటిషన్ హైకోర్టు  కొట్టివేయడంతో ఈ విషయంపై అటు రాష్ట్రవ్యాప్తంగా ఇటు తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాను వేసిన కేసుకు సంబంధించి కాంగ్రెస్ అధికార ప్రతినిధి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి అద్దంకి దయాకర్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల ప్రకటనలో అవకతవకలు జరిగాయని తాను గెలిచిన అధికార పార్టీ అభ్యర్థి గెలిచినట్టు ప్రకటించారని తనకు న్యాయం చేయాలని ఆనాడే తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించానని తెలిపారు.

తుంగతుర్తి నియోజకవర్గం లోని పోలింగ్ బూతులలో నమోదైన ఓటింగ్ శాతం కన్నా అధికార పార్టీ ఎమ్మెల్యేకు 1050 ఓట్లు అధికంగా వచ్చినట్లు కౌంటింగ్ అధికారులు చూపించారని అన్నారు. 19 ఈవీఎంలు మొరాయించడంతో ఒక ఈవీయంలోని వివి పాట్లను లెక్కించి 141 ఓట్లు కాంగ్రెస్కు రాగా వాటిని నాటి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఖాతాలోకి మళ్లించారని అన్నారు. మిగతా 18ఈవీఎంల వివి ప్లాట్లు లెక్కించకుండానే సుమారుగా ఒక్కో ఈవీఎంకు 100 ఓట్లు చొప్పున అధికార పార్టీ అభ్యర్థికి జోడించారని అన్నారు.జరిగిన అవకతవకలపై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించానని ఆలస్యమైనా ప్రజలకు న్యాయం తెలుస్తుందని అద్దంకి అన్నారు. కొన్ని బూతులలో ఉండాల్సిన ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లు నమోదు అయినట్లు లెక్కల్లో చూపించారని అన్నారు వీటన్నిటిని తగిన విధంగా పరిశీలించి తన వద్ద ఉన్న సాక్షాధారాలతో  న్యాయస్థానాన్ని ఆశ్రయించానని న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని తనకు న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని అద్దంకి అన్నారు.ఈ విషయంపై ప్రస్తుతం తుంగతుర్తి నియోజకవర్గం వ్యాప్తంగా చర్చ జరుగుతుండగా రానున్న రోజుల్లో న్యాయస్థానం ఏ విధంగా స్పందిస్తుందో ఏ విధమైన ఫలితాన్నిస్తుందో వేచి చూడాల్సిందే.