తెలంగాణ సంపదనంతా దోచుకున్నది కల్వకుంట్ల కుటుంబం

తెలంగాణ సంపదనంతా దోచుకున్నది కల్వకుంట్ల కుటుంబం
  • పూటకో పార్టీ మారే నాయకులకు బుద్ధి చెప్పండి
  • సిద్ధాంతాలకు కట్టుబడిందే చందుపట్ల కుటుంబం
  • భూపాలపల్లిలో ఎగిరేది కాషాయ జెండానే
  • ఆదరించి దీవించండి..అభివృద్ధి చేసి చూపిస్తా  
  •  మీడియా సమావేశంలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డి

 మొగుళ్లపల్లి, ముద్ర : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సబ్బండ వర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతారని అనుకుంటే, తెలంగాణ వనరులను, సంపదనంతా దోచుకుతున్నది కల్వకుంట్ల ఫ్యామిలీ అని భూపాలపల్లి బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డి మండిపడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మెట్టుపల్లి, మొట్లపల్లి, ఎల్లారెడ్డిపల్లి, ముల్కలపల్లి, మొగుళ్ళపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో మహిళలు, యువకులు, రైతులు, విద్యార్థులు ఆమెకు ఘన స్వాగతం పలుకుతూ.. బ్రహ్మరథం పట్టారు. అనంతరం మొట్లపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె  మాట్లాడారు. సిద్ధాంతం అంటూ లేకుండా పార్టీలు మారుతూ..మాయమాటలతో మభ్యపెట్టే నాయకుల మాటలను ప్రజలు నమ్మవద్దని, భూపాలపల్లి నియోజకవర్గంలో  ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని దత్తత తీసుకుంటే..మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని దత్తత తీసుకున్నారని, ఇందులో ఎవరు గెలిచినా బిఆర్ఎస్ లో ఉండే విధంగా వ్యూహా రచనలు చేసి మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కుట్రలు చేస్తుండడాన్ని ప్రజలు గమనించాలని కోరారు. పార్టీ సిద్ధాంతాల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని కుటుంబం చందుపట్ల కుటుంబమని, పార్టీ కార్యకర్తల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, నిరంతరం పోరాడే భారతీయ జనతా పార్టీని ఆదరించి.. ఆశీర్వదించాలని, త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భూపాలపల్లిలో ఎగిరేది కాషాయ జెండానేనని, ప్రజలంతా భారతదేశ ప్రధాని నరేంద్రుడు చేస్తున్నటువంటి అభివృద్ధిని, ప్రపంచ దేశాల ముందు భారత్ ప్రతిష్టను పెంచిన ఘనతను, తీవ్రవాద దేశాల నుండి వాటిల్లే ముప్పు నుండి భారత్ ను కాపాడే విధానాన్ని, చంద్రయాన్ 2 తో భారత్ ప్రతిష్ఠతను ఇనుమడింపజేసిన విధానాన్ని, ఇలా అన్ని రంగాలలో భారత ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్న పరిపాలనను గమనించిన తెలంగాణ ప్రజలు డబల్ ఇంజన్ సర్కార్ ను కోరుకుంటున్నారని, అదేవిధంగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించి..మహిళల పట్ల ఆయనకున్న గౌరవాన్ని చాటుకున్నారని, మహిళలోకమంతా కూడా ప్రధాని నరేంద్రుడి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం బిజెపి నియోజకవర్గ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి, మొగుళ్ళపల్లి మండల అధ్యక్షులు చేవ్వ శేషగిరి యాదవ్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు కన్నం యుగంధర్, బిజెపి రాష్ట్ర కమిటీ సభ్యులు  చదువు రామచంద్రారెడ్డి, వెన్నంపల్లి పాపయ్య, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎరుకల గణపతి, ఏడునూతల నిషిధర్ రెడ్డి, నాయకులు చాడ రఘునాథరెడ్డి, ముడుపు అశోక్ రెడ్డి, లింగంపల్లి ప్రసాద్ రావు, కుమ్మరి సారయ్య, దొంగల రాజేందర్, దొంగల రాజయ్య, మోరే వేణుగోపాల్ రెడ్డి, తక్కల్లపల్లి విజేందర్ రావు, పసరగొండ శివ, కూస రత్నాకర్  తదితరులు పాల్గొన్నారు.