కేసీఆర్ ను ఎవరు ఓడించలేరు..

కేసీఆర్ ను ఎవరు ఓడించలేరు..
  •  ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న సర్కారు ఇది
  • అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లలా సాగుతున్నయ్
  •  అన్ని రంగాల్లో అభివృద్ధి పరుగులు
  •  మంత్రి సత్యవతి రాథోడ్.. 
  • భూపాలపల్లి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: తెలంగాణలో కేసీఆర్ ను ఎవరు ఓడించలేరు, ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న సర్కారు ఇది, తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం రెండు జోడెడ్లలా ముందుకు సాగుతున్నాయని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్ ఆదివారం సుడిగాలి పర్యటన చేసి, వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రతిపక్షాలపైకి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం, మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం లాంటి దుర్మార్గపు పనులను చేస్తున్నందుకే కర్ణాటకలో ప్రజలు ఒక గుణపాఠం లాంటి తీర్పును ఇచ్చారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మోదీ వచ్చి గల్లీ గల్లీ, ఇంటింటికి తిరిగి ప్రచారం చేసినా, కాంగ్రెస్ వాళ్లు కాళ్ళ వేళ్ళ పడ్డా, కెసిఆర్ ను ఏమి చేయలేరని ఎద్దేవా చేశారు. బిజెపి, కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాల్లో రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వడం జరుగుతుందా..?  రైతుబంధు ఎక్కడైనా ఇచ్చే సంస్కారం ఉందా..? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనుల పట్ల ఇతర రాష్ట్రాల ప్రజలు తెలంగాణ వైపు చూస్తున్నారని చెప్పారు. గతంలో ఎన్నడు జరగని అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాతనే జరుగుతుందని చెప్పారు.

రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. తొమ్మిదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపారని, ఆటు అభివృద్ధి, ఇటు సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో ముందుకు వెళుతూ అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేయడం జరుగుతుంది అన్నారు. 75 ఏళ్ల పాలనలో అప్పటి పాలకులు చేసింది ఏమీ లేదని, ఇప్పటికీ గ్రామాలలో సమస్యలు ఉన్నాయని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి తోడుగా స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి అభివృద్ధిలో భాగస్వాములు కావడం హర్షనీయమని అన్నారు. భూపాలపల్లి జిల్లాలో హెచ్ డీ ఎఫ్ సీ సహకారంతో ఏడు కోట్లతో 19 గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని చెప్పారు. రాష్ట్రంలోని అంగన్ వాడీ కేంద్రాలలో పిల్లలకు, బాలింతలకు, మహిళలకు, ఇకపై సన్న బియ్యం సరఫరా చేయడం జరుగుతుందని, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం కోసం ఆరోగ్య లక్ష్మి పథకం, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టు తదితర పథకాలను అమలు చేయడం జరుగుతుందని, పుట్టిన బిడ్డకు కేసిఆర్ కిట్టు కూడా అందిస్తున్నట్లు గుర్తు చేశారు.

ఇటీవలే విడుదల చేసిన ఇంటర్, టెన్త్ ఫలితాల్లో ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు ముందంజలో నిలిచారని చెప్పారు. ఉత్తమ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో భూపాలపల్లి ఐదవ స్థానంలో నిలిచిందని, రానున్న రోజుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థులను మరింత ఉత్తమంగా తీర్చిదిద్దాలని చెప్పారు. ప్రత్యేక తరగతుల నిర్వహణ కోసం విద్యార్థులకు ఉదయం పూట రాగి జావతో అల్పాహారం అందించనున్నట్లు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి సర్కారు బడిలో పిల్లలకు నూతనంగా అల్పాహారం అందించడం జరుగుతుందని వివరించారు. భూపాలపల్లి పట్టణంలో రూ.66 లక్షల వ్యయంతో సఖి సెంటర్ నిర్మించడం హర్షనీయమని, అదేవిధంగా రూ.25 లక్షలతో ఏర్పాటు చేసిన అంబులెన్స్ సేవలను కూడా జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.

- అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి సత్యవతి రాథోడ్..

 భూపాలపల్లి జిల్లాలో ఆదివారం సుడిగాలి పర్యటన చేసిన మంత్రి సత్యవతి రాథోడ్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముందుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం మైలారంలో ఆదివారం జరిగిన రేణుక ఎల్లమ్మ, కంఠమహేశ్వర దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు, అనంతరం చెల్పూరు గ్రామంలో రూ.50 లక్షలతో నిర్మించిన మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ ను, జిల్లా కేంద్రంలో రూ.66 లక్షలతో నిర్మించిన సఖి వన్ స్టాప్ సెంటర్ ను, హెచ్ డీ ఎఫ్ సీ ఆధ్వర్యంలో ఏడు కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను, జిల్లా కేంద్రంలో  నూతనంగా ఏర్పాటు చేసిన అంబులెన్సు ను మంత్రి సత్యవతి రాథోడ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ చైర్మన్ జక్కు శ్రీ హర్షిణీ, అదనపు కలెక్టర్ దివాకర, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.