భూపాలపల్లిలో జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు..

భూపాలపల్లిలో జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆదివారం జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకలకు రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరై జాతీయజెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ సమైక్యత దినోత్సవం గూర్చి వివరించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవని, అన్ని వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. జిల్లాలో ఇటీవలే మెడికల్ కాలేజీ ప్రారంభించుకోవడం అభినందనీయమని, అదే విధంగా సమీకృత కలెక్టరేట్ భవనం కూడా ప్రారంభోత్సవానికి సిద్ధమైందన్నారు. జిల్లాలో అంచలంచెలుగా అభివృద్ధి పనులు ముందుకు సాగుతున్నాయని ఆయన తెలిపారు.

అనంతరం ఇటీవలె ప్రారంభోత్సవం అయిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి, ఎమ్మెల్సీ ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని 
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, జిల్లా ప్రజా పరిషత్ ఛైర్మన్ జక్కు శ్రీ హర్షిణీ, అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ట్రైనీ కలెక్టర్ ఉమా శంకర్, ఎస్పీ కరుణాకర్, గ్రంధాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్, డీఎస్పీ రాములు, జడ్పీ వైస్ ఛైర్మన్ కళ్ళెపు శోభ రఘుపతి రావు, మున్సిపల్ ఛైర్మన్ సెగ్గం వెంకటరాణీ సిద్దు, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.