రాహుల్ గాంధీతో కోదండరాం భేటీ

రాహుల్ గాంధీతో కోదండరాం భేటీ
  • కాంగ్రెస్ తో కలిసి నడుస్తాం
  • నియంతను గద్దె దించుతాం
  • రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరగాలి
  • టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో టీజేఎస్ పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరాం భేటీ అయ్యారు. శుక్రవారం స్థానిక వి పార్క్ హోటల్లో ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. తెలంగాణలో రాజకీయ పునరేకికరణ జరగవలసిన అవసరం ఉందని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అనంతరం మీడియాతో కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్తో కలిసి పని చేయాలని రాహుల్ గాంధీ కోరినట్లు తెలిపారు. కెసిఆర్ నియంత పాలనను గద్దెదించడానికి టీజేఎస్ ఏర్పడిందని వెల్లడించారు. కాంగ్రెస్తో పొత్తులో భాగంగా మూడు సీట్లు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ బలహీనంగా ఉన్న ఎల్లారెడ్డి, కోరుట్ల జహీరాబాద్ స్థానాల్లో జన సమితి టికెట్లు ఆశిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజావ్యతిరేక విధానాలపై రాహుల్ గాంధీకి నోటు ఇచ్చినట్లు విశ్వాసనీయ సమాచారం. సీట్ల సర్దుబాటు వ్యవహారం టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి టీజేఎస్ స్టేట్ ఆఫీసుకు వచ్చి చర్చలు జరుపుతారని రాహుల్ గాంధీ స్పష్టం చేశారని వెల్లడించారు. కోదండరాంపేట పార్టీ నేతలు ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వర రావు అంబటి శ్రీనివాస్ బైరి రమేష్ నిజ్జన రమేష్ వినోద్ మోహన్, కిరణ్ రత్నం తో పాటు తదితరులు ఉన్నారు.