చివరి రోజు విస్తృతంగా ప్రచారం

చివరి రోజు విస్తృతంగా ప్రచారం

ముద్ర.వీపనగండ్ల: ప్రధాన పార్టీలైన బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీలు చివరి రోజు మండలంలోని గ్రామాలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు, కొల్లాపూర్ నియోజక వర్గంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పోటీలో ఉన్నారు, బిజెపి పార్టీ నుంచి ఎల్లేని సుధాకర్ రావు, నిరుద్యోగుల తరపున స్వతంత్ర అభ్యర్థిగా శిరీష అలియాస్ బర్రెలక్క పోటీలో నిలిచారు. ప్రధానంగా నియోజకవర్గంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల నుంచే పోటీ ఉంటుంది, అయితే నిరుద్యోగుల తరఫున శిరీష అలియాస్ బర్రెలక్క పోటీలో నిలచడంతో ఈమె ఎవరి ఓట్లను తేల్చుతుందోనని ప్రధాన పార్టీల అభ్యర్థులు భయపడుతున్నారు.బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో చెందిన నాయకులు కార్యకర్తలు పోటాపోటీగా జన సమీకరణ చేసి గ్రామాల్లోని ప్రధాన వీధుల వెంట, ఇంటింటికి తిరుగుతూ తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు, బిజెపి అభ్యర్థి ఎల్లేని సుధాకర్ రావు, స్వతంత్ర అభ్యర్థి శిరీష అలియాస్ బర్రెలక్క ఇప్పటికే గ్రామాలలో ప్రచారం నిర్వహించి తమకు ఓటు వేయాలని ప్రజలను కోరారు, గ్రామాలలో ప్రధాన పార్టీలో నాయకులు డబ్బు మద్యంతో ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేపట్టడమే కాక ఈ రెండు రోజులు వారికి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనాలను కూడా ఏర్పాట్లు చేశారు. గత 15 రోజులుగా మైకులు డీజెలతో వాహనాలు గ్రామాల్లో తిరగడంతో వాటి శబ్దాలకు ప్రజలు కొంత ఇబ్బందులు పడ్డారు. నేటి నుంచి వాటి శబ్దాలు తగ్గుతుండటంతో ప్రజలు కొంత ఊపిరి పీల్చుకున్నారు.