రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే

రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే
  • కామారెడ్డిలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తా    
  • రోడ్ షోలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, తెలంగాణ లో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పదేళ్ళ అవినీతి పాలనకు చమరగీతం పాడి, కాంగ్రెస్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మంగళవారం నాడు కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్ షోలో ఆయన ప్రసంగించారు. దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య ఈ యుద్ధం జరుగుతోందని అన్నారు. పదేళ్ళలో దొరల తెలంగాణను చూశారని, ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు తెలంగాణ ధనాన్ని దోచుకున్నారని, ఒక లక్ష కోట్ల రూపాయలను ఒకటే ప్రాజెక్టు ద్వారా దోచుకున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని అన్నారు. మహిళల ఖాతాల్లో నెల నెలా రూ.2,500 ఖాతాల్లో జమ చేస్తామని, రూ.500లకే గ్యాస్సిలిండర్ అందిస్తామని, ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం కల్పిస్తామని, ఇలా ప్రతీ నెల 5వేలను అందిస్తామన్నారు. రైతు భరోసా పథకం ద్వారా రైతుల ఖాతాలో ఏటా 15 వేలను చెల్లిస్తామని, రూ.12 వేలను కూలీలకు అందిస్తామని, 24 గంటల ఉచిత విద్యుత్తు అందిస్తామని అన్నారు.

కేసీఆర్ లక్షలాది మందిని నిరాశ్రయులు చేయగా, తాము రూ.5 లక్షలను ప్రతీ ఒక్కరికి అందిస్తామన్నారు. కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న కేసీఆర్కు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని, తనను భారీ మెజారిటీతో గెలిపించాలని టిపిసిసి చీఫ్ రేవంత్రెడ్డి కోరారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కామారెడ్డిలో పెద్ద ఎత్తున పరిశ్రమలను ఏర్పాటు చేయమని, హైదరాబాద్-కామారెడ్డి మద్య పరిశ్రమల కారిడార్ ను ఏర్పాటు చేస్తామన్నారు.  ఈ ప్రాంతంలో గల్ఫ్ కార్మికులు అధికంగా ఉన్నారని, వారికోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తామన్నారు.   బీడీ కార్మికుల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని, కటాఫ్ తేదీ లేకుండా పింఛన్లు మంజూరు చేస్తామని అన్నారు. దేశమంతా కామారెడ్డి వైపు చూస్తోందని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తథ్యమని అన్నారు. తమ ప్రభుత్వంలో తెలంగాణలో విద్యార్థులకు విద్యా ఉపాధి అవకాశాలు, బడుగు, బలహీన వర్గాలను ఆదుకొనేందుకు ప్రణాళికలు చేశామన్నారు. కేసీఆర్ నిరుద్యోగులకు తీరని అన్యాయం 
చేశారన్నారు. కేసీఆర్ బాయ్ బాయ్ అంటూ నినాదాలు చేశారు.