సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ  దేశంలో నెంబర్ వన్   

సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ  దేశంలో నెంబర్ వన్   
  •  ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలకు అభివృద్ధి, సంక్షేమ రంగాలు రెండు కళ్ళు లాంటివి
  •  సమాజంలో 85 శాతం ఉన్న పేదలకు సంక్షేమ పథకాలు అవసరం
  •  ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఎన్నికల మేనిఫెస్టోను వంద శాతం అమలు చేసారు
  • ప్రజల దీవెన, కార్యకర్తల సహకారంతో మూడవసారి అధికారంలోకి వస్తాం
  • కేసీఆర్ గారు హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అవుతారు                                     
  • అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి:   ముఖ్యమంత్రి కేసీఆర్  నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రంగంలో దేశంలో నెంబర్ వన్ గా మారిందని  బాన్సువాడ నియోజకవర్గ BRS పార్టీ అభ్యర్థి, రాష్ట్ర శాసన సభాపతి  పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.  సోమవారం సాయంత్రం ఆయన బాన్సువాడ లోని ఆయన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..

ప్రజలకు కనీస అవసరాలు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని,అభివృద్ధితో పాటుగా పేదల సంక్షేమం ముఖ్యమని అన్నారు.తెలంగాణ రాష్ట్రం వచ్చాక దుర్భిక్షం పోయి సుభిక్షం అయిందని, సంక్షోభం పోయి సంక్షేమం అయిందని అన్నారు.తెలంగాణ రాకముందు TDP, కాంగ్రెస్ పార్టీల ప్రభుత్వాల హయాంలో సంక్షేమ రంగానికి చాలీచాలని నిధులు ఇచ్చేవారని,కేసీఆర్ గారి పరిపాలనలో తెలంగాణ రాష్ట్ర సంపదను పెంచి ఆ సంపదను ప్రజలకు పంచడం జరుగుతుందని అన్నారు.చెప్పిందే చేసుడు కేసీఆర్ కు అలవాటని,2018 మేనిఫెస్టోలో చెప్పిన అంశాలను వంద శాతం అమలు చేశారని అన్నారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు అలివికానీ హామీలను ఇస్తున్నారని,. ప్రజలు ఆలోచించాలని అన్నారు.రైతుబీమా తరహాలోనే పేదల కోసం  కేసీఆర్ బీమా ను అమలు చేస్తారని,.రాష్ట్రంలో 1.10 కోట్ల కుటుంబాలు ఉంటే BPL పరిధిలోని 93 లక్షల  కుటుంబాలకు కేసీఆర్ బీమా తో భరోసా లభిస్తుందని అన్నారు.


ప్రపంచంలో ఇంత పెద్ద ఎత్తున బీమా చెల్లిస్తున్నది కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమేనని అన్నారు.దేశంలో అత్యధిక మందికి, ఎక్కువ మొత్తంలో పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని,రాష్ట్రంలో 46 లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయని అన్నారు.రైతుబంధు రూ. 16,000 కు పెంపుదల,రేషన్ లో సన్న బియ్యం పంపిణీ.గృహలక్ష్మి ఇళ్ళ మంజూరుతో పాటుగా స్వంత స్థలం లేని పేదలకు ఇళ్ళ స్థలాలు మంజూరు,అగ్రవర్ణ పేదలకు ప్రతి నియోజకవర్గంలో గురుకులం ఏర్పాటు, జర్నలిస్టులకు 15 లక్షల ఆరోగ్య రక్ష,ప్రజలు కోరుకుంటున్నట్లు అసైన్డ్ భూములపై హక్కులు ఇచ్చి అమ్మకానికి, కొనడానికి మార్పు,పేదలకు రూ. 400 కే గ్యాస్ సిలిండర్ ఇస్తారని తెలిపారు.ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో  ఇచ్చిన హామీలను అమలు చేయలేక చేతులెత్తేసిందని అన్నారు.బి-ఫారం ఇచ్చి, ఎన్నికల ఖర్చు కోసం పార్టీ తరుపున రూ.40 లక్షలను  చెక్కు రూపంలో ఇచ్చారని, ముఖ్యమంత్రికి ధన్యవాదాలని పోచారం అన్నారు.మీడియా సమావేశంలో  రైతుబంధు జిల్లా అధ్యక్షుడు డి. అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్,  వైస్ చైర్మన్ జుబేర్, PACS చైర్మన్ ఎర్వల కృష్ణారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు గోపాల్ రెడ్డి, గురు వినయ్, విఠల్ రెడ్డి, జిన్నా రఘు, నరసింహా చారి‌ తదితరులు పాల్గొన్నారు.