నిర్మల్ ప్రజల రుణం తీర్చుకుంటా

నిర్మల్ ప్రజల రుణం తీర్చుకుంటా
  • ఇచ్చిన హామీలు నెరవేరుస్తా- మహేశ్వర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్:తనకు భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించిన నిర్మల్ ప్రజల రుణం తీర్చుకుంటానని, వారికి ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని నిర్మల్ ఎమ్మెల్యేగా గెలుపొందిన బిజెపి అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి అన్నారు. తాను పదేళ్ల క్రితం  ఓటమి పాలైనప్పటి నుంచి తన వెన్నంటి ఉన్న నిర్మల్ ప్రజల్ని మరువలేనని అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనను నద్దా పార్టీ లోకి ఆహ్వానించిన సమయంలో నిర్మల్ లో కాషాయం జెండా ఎగరేసి ఢిల్లీ వస్తా అని  ఇచ్చిన తన హామీని నెరవేర్చిన నిర్మల్ ప్రజల ఆదరం మరువలేనన్నారు. భారత ప్రధాని మోది సైతం  నిర్మల్  బహిరంగ సభ కు వచ్చి ఆశీర్వదించారన్నారు. బీ ఆర్ ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజానీకం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం బిజెపిని నాలుగు స్థానాల్లో గెలిపించారన్నారు.

నిర్మల్నియోజక వర్గంలో కాంగ్రెస్ హామీలను నమ్మలేదని అన్నారు.ఉమ్మడి ఆదిలాబాద్ లో డబుల్ ఇంజన్ సర్కార్ తో అభివృద్ధి సాధ్యమని బీజేపీ కి పట్టం కట్టారని పేర్కొన్నారు.రాబోయే రోజులలో ప్రజల సమస్యల పై పోరాడుతూ వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. తమ పార్టీ ఇప్పుడు 8 సీట్లు గెలవవచ్చు, కానీ వచ్చే సారికి ఇది 80 కి చేరుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.బీజేపీ ఇచ్చిన మాట తప్పదని, అసెంబ్లీ లో ప్రజల పక్షాన పోరాడతానని హామీ ఇచ్చారు.