అన్ని వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం మతాల పేరిట చిచ్చు తగదు

అన్ని వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం మతాల పేరిట చిచ్చు తగదు

తెలంగాణా శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి

ముద్ర ప్రతినిధి,నిర్మల్: కెసిఆర్ ప్రభుత్వ హయాంలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు తలెత్తుకునేలా పథకాలు రూపొందించిన ఘనత దేశంలో మరి రాష్ట్రానికి లేదని తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం లోని పోతంగల్ మండలం టాక్లి గ్రామంలో సోమవారం జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్న ప్రజా సంక్షేమం కోసం పాటుపడే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరేనని అన్నారు. పేదింటి ఆడబిడ్డ పెళ్ళికి తల్లిదండ్రులు అప్పులు చేయకూడదనే ఆలోచనతో ప్రారంభించిందే కళ్యాణలక్ష్మీ పథకం, రైతుల కన్నీళ్లు తుడిచేందుకు రైతుబంధు, 24 గంటల పాటు విద్యుత్ సరఫరా, మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కెసిఆర్ పనితీరుకు నిదర్శనమన్నారు.ఇపుడురాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు లేవని,రైతులు తలెత్తుకు తిరిగేలా చేసిన ఘనత కెసిఆర్ దేనన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణంతో పేదలకు వసతి కలిగిందన్నారు.

కేవలం తొమ్మిదేళ్ళ  పాలనలోతెలంగాణలో ఇన్ని పథకాలు రూపొందిస్తే, గత 70 ఏళ్ళుగా ఉన్న రాష్ట్రాలలో ఎందుకు లేవని ప్రశ్నించారు. ఆసరా పెన్షన్లతో ఇళ్ళలో వృద్ధులకు ఆర్థిక సహాయం చేస్తే పక్కనే ఉన్న మహారాష్ట్ర లో కేవలం 1000 రూపాయలు ఇస్తున్నారని వెల్లడించారు. ఈ పథకాలకు ఆకర్షితులై మహారాష్ట్ర ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు.తెలంగాణ ఏర్పడక ముందు లక్ష రూపాయల నిధులు తేవాలంటే కష్టంగా ఉండేదని, నేడు స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మూలంగా  నిధులు వస్తున్నాయన్నారు. మల్లన్న సాగర్ ద్వారా గోదావరి జలాలు నిజాంసాగర్ ప్రాజెక్టు లోకి వస్తున్నాయని,ఇక  భవిష్యత్తులో రైతులకు సాగునీటిపై ఆందోళన అవసరం లేదని పేర్కొన్నారు.
బాన్సువాడ నియోజక వర్గంలోని మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించడానికి సిద్దాపూర్ రిజర్వాయర్, జాకోర-చందూరు ఎత్తిపోతల పథకాలను నిర్మిస్తున్నామని చెప్పారు. రైతుల సౌకర్యార్థం త్వరలోనే యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు.

మతం పేరుతో రాజకీయాలు తగవు
కెసిఆర్ హయాంలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంటే కొన్ని పార్టీలు మతం పేరిట రాజకీయాలు చేయటం శోచనీయం అన్నారు. ముస్లిం మతానికి చెందిన కబీరు రామచంద్రుని భక్తుడని, ఇలా మత సామరస్యాన్ని కాపాడిన దేశంలో మత రాజకీయాలు చేయటం మత సామరస్యాన్ని దెబ్బతీయటమే అన్నారు.

పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
అంతకు ముందు టాక్లి లో పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.కోటి రూపాయలతో నూతనంగా వేసిన టాక్లీ-సాలంపాడు రోడ్డును ప్రారంభించారు. రూ.5 లక్షల వ్యయంతో నిర్మించిన  సిసీ రోడ్డును ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ళను ప్రారంభించారు. ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్ ఫ్లవర్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమాల్లో ఆర్డీవో రాజేశ్వర్,పార్టీ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.