కణం కణం.. క్షణ క్షణం

కణం కణం.. క్షణ క్షణం
  • దేశహితమే నా లక్ష్యం
  • పేరూ, చిహ్నం లేని పార్టీ కాంగ్రెస్
  • విశ్వాఘాతుకానికి పాల్పడుతోంది
  • ఈశాన్య రాష్ర్టాలను నిర్లక్షం చేసింది
  • నెహ్రూ, ఇందిర అన్యాయం చేశారు
  • అప్పుడు అక్కడ గుడిగంటలు కూడా మోగలేదు
  • పిల్లలు జాతీయ గీతమూ పాడలేదు
  • మేం అభివృద్ధి పథంలో నడుపుతున్నాం
  • మణిపూర్ ను రాజకీయంగా వాడుకుంటున్నారు
  • మేం శాంతి కోసం అనేక చర్యలు తీసుకుంటున్నాం
  • కాంగ్రెస్​మీద విరుచుకుపడిన ప్రధాని మోడీ
  • మూజువాణీ ఓటుతో వీగిపోయిన అవిశ్వాసం
  • ప్రధాని ప్రసంగం మధ్యలోనే విపక్షాల వాకౌట్

(ముద్ర, నేషనల్ డెస్క్)​:-దేశాన్ని సామాన్యుడు విశ్వసించినపుడు ఆ దేశాన్ని  ప్రపంచం కూడా విశ్వసిస్తుంది. అదే దేశ సాంస్కృతిక, సార్వభౌమత్వాలకు నిదర్శనం. తన కణం కణం, క్షణ క్షణం దేశానికే అంకితం’  అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇందుకోసం ప్రతీ ఒక్కరూ సంకల్పం తీసుకోవాలని, ప్రతీ ఒక్కరూ అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అందమూ కలిసి వెళ్లి మణిపూర్​లో శాంతిని చేకూర్చేందుకు ప్రయత్నిద్దామని అన్నారు. అక్కడి పరిస్థితులపై రాజకీయాలు చేయడం సరైంది కాదని ప్రతిపక్షాలకు సూచించారు. విపక్షాలది దేశ ప్రజల పట్ల విశ్వాస ఘాతుక అవిశ్వాస తీర్మానం అని తూలనాడారు.  విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని గురువారం సమాధానమిచ్చారు. మాటల తూటాలు విసిరారు,

కాంగ్రెస్​పార్టీకి సొంతంగా ఏదీ లేదని, పేరు, చిహ్నం ఇలా ఏమీ లేవని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. బెల్లాన్ని కూడా పేడను చేసి చూపే ఘనత కాంగ్రెస్​కే దక్కుతుందన్నారు. దేశ సైన్యాన్ని కాంగ్రెస్ నమ్మదని, విదేశీ, ఉగ్రవాదుల మాటలను నమ్ముతుందని విమర్శించారు. దేశంలోని ప్రజలలో అవిశ్వాసాన్ని మేలుకొలిపేందుకే పార్లమెంటులో అవిశ్వాస బిల్లును పెట్టిందని మండిపడ్డారు. విపక్షాలు ఎప్పుడు కూడా మోడీని బొంద పెడతామనే మాట్లాడుతున్నాయన్నారు. వారికి అదే ఇష్టమైన మాట అన్నారు. వీరి శాపనార్థాల వల్ల తనకూ, తన దేశానికి మంచే జరుగుతుందని ప్రధాని వ్యాఖ్యానించారు. దేశంలోని  మూడు సంస్థలను నిర్వీర్యం చేసేందుకు చాలామేరకు విపక్షాలు ప్రయత్నించాయన్నారు. వారి ఆటలు సాగలేదన్నారు. ఆయా సంస్థలు మరింత వృద్ధిలో నేడు కొనసాగుతున్నాయన్నారు. బ్యాంకింగ్ సెక్టార్, హెచ్ఏఎల్, ఎల్ఐసీలపై కాంగ్రెస్, విపక్షాలు నష్టం వాటిల్లే విధంగా ప్రచారం చేశాయన్నారు. దేశం అభివృద్ధి దిశగా నడవడంలో భాగంగా తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. 70 సంవత్సరాల నుంచి నిద్దురపోతున్న కాంగ్రెస్​కు దేశం ఊరికే అభివృద్ధి చెందుతుందన్న భ్రమలు ఉన్నాయన్నారు. తమ హయాంలో ఆ భ్రమలను పటాపంచలు చేస్తూ నిరంతరం పడిన శ్రమతో దేశాన్ని ఐదోస్థానంలో ఉంచామన్నారు. త్వరలోనే దేశాన్ని మూడో స్థానంలోకి కూడా తీసుకువస్తామన్నారు. 

  • కాంగ్రెస్ తీరు మారాలి

కాంగ్రెస్​ దేశ ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిందని, విశ్వాస ఘాతుకానికి సైతం పాల్పడుతోందని ప్రధాని ఆరోపించారు. ఈ చర్యలను మానుకోవాలని హితవు పలికారు. ఈశాన్య రాష్ర్టాల అభివృద్ధిని కాంగ్రెస్​ఆది నుంచే విస్మరించిందన్నారు.1966లో ఇందిరాగాంధీ వాయుసేనల ద్వారా మిజోరాంపై దాడి చేసిన విషయం ఇంకా ప్రజలకు గుర్తుందని, అందుకే  యేటా మార్చి ఐదున ఈ దాడికి నిరసనను వ్యక్తం చేస్తారని అన్నారు. 1962లో అస్సాంలో క్లిష్టపరిస్థితులు కొనసాగుతుండగా అప్పటి ప్రధాని నెహ్రూ చేసిన రేడియో ప్రసంగం అందరికీ తెలిసిందేనన్నారు. ఈశాన్య రాష్ర్టాల అభివృద్ధికి నెహ్రూ విఘాతమని స్వయానా లోహియా తెలిపారన్నారు. మణిపూర్​హింసను రాజకీయంగా వాడుకున్నది కాంగ్రెస్​ పార్టీయేనని మోడీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ‘విభజించు–పాలించు’ అనే రాజకీయాలను ప్రోత్సహించడంతోనే దేశంలోని విభిన్న ప్రాంతాలలో దాని నష్టదాయక ఫలాలు నేటికి కనిపిస్తున్నాయన్నారు. ఆ ఫలాలను తాము పూర్తిగా తుడిచి పెడుతూ ముందుకు వెళుతున్నామన్నారు. అఖండ భారత్ దిశగా గెలుపు సాధించి తీరుతామన్నారు. కచ్ఛాతీవూ ద్వీపాన్ని గిఫ్ట్​గా ఎందుకిచ్చారని ప్రశ్నించారు. ఇప్పుడేమో దాన్ని స్వాధీనం చేసుకోవాలని అంటున్నారని విమర్శించారు. 

  • అక్కడ పరిస్థితులు దారుణం

మణిపూర్​లో కాంగ్రెస్​ అధికారంలో ఉండగా పాఠశాలలో జాతీయాగీతాలాపన ఉండేది కాదన్నారు. గుడిలో గంటలు కూడా నాలుగు గంటలకే మూతపడేవన్నారు. లైబ్రరీలలో పుస్తకాలు తగలబడి పోతున్నా, రాజకీయ పబ్బం గడుపుకునేందుకే కాంగ్రెస్​ ప్రాధాన్యం ఇచ్చేదన్నారు. రాజధాని ఇంఫాల్​లో సైతం ఐఏఎస్, ఐపీఎస్​లు సైతం ఉగ్రవాదులకు మామూళ్లు ఇచ్చుకునే పరిస్థితి ఉండేదంటే ఎంత ఘోరంగా కాంగ్రెస్ ఈశాన్యాన్ని​పాలించిందో ఇట్టే అర్థమవుతుందన్నారు. మానవత్వంపై కాంగ్రెస్​కు ఆలోచనే లేదన్నారు. తాము మణిపూర్​లో రాజకీయ జోక్యాన్ని చోటు చేసుకోనీయకుండా, స్థానికుల ఆగ్రహావేశాలను చల్లార్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ దిశలో తమ ఆలోచనలు సత్ఫలితాలను ఇస్తున్నాయని, మరిన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. విపక్షాలకు దమ్ముంటే మణిపూర్ అంశంలో రాజకీయం కాకుండా హింస చల్లార్చేందుకు ప్రయత్నించాలన్నారు. బీజేపీకి ఈశాన్యం గుండె కాయలాంటిందని ప్రధాని మోడీ అన్నారు. ఎట్టి పరిస్థితులలోనూ దానిని అభివృద్ధిలో​భాగస్వామ్యం చేసి తీరుతామన్నారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాలలో రైళ్లు, ఎయిర్​పోర్టులు, గేట్​వేలు, ఎయిమ్స్, యూనివర్సిటీలు, నాగాలాండ్​నుంచి చట్టసభకు ప్రతినిధి, పద్మ పురస్కారాలు, ట్రైబల్​ మ్యూజియమ్​లాంటి అనేక చర్యలు తీసుకున్నామన్నారు. 

  • కాంగ్రెస్​కు అహంకారం

కాంగ్రెస్​కు అహంకారం నరనరానా జీర్ణించుకుపోయిందని ప్రధాని మోడీ ధ్వజమెత్తారు. వారి గోతి వారే తవ్వుకున్నారన్నారు. యూపీఏకు క్రియా, కర్మలు నిర్వహించుకొని ఐ.ఎన్.డి.ఐ.ఏ.గా నామకరణం చేసుకొని సంతోషపడ్డారన్నారు. నిజమైన భారత నిర్మాణంలో మాత్రం పాలు పంచుకోలేకపోతున్నారని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే  దిశగా వీరి ఆలోచనలు ఉన్నాయని విమర్శించారు. కొవిడ్ సమయంలో భారత్​లో వ్యాక్సిన్​ అభివృద్ధి జరిగితే దాన్ని నిర్వీర్యం చేసేలా దేశప్రజలలో అవిశ్వాసాన్ని రేకెత్తించారన్నారు. తమ ప్రభుత్వం వాటన్నింటినీ పటాపంచలు చేసిందన్నారు. 1962 నుంచి తమిళనాడులో, 1972 నుంచి కేరళ, 1985 నుంచి యూపీ, బీహార్, గుజరాత్, 1988 నుంచి త్రిపుర, 1985 నుంచి ఒడిశా, 1988 నుంచి నాగాలాండ్, ఢిల్లీ, వెస్ట్​బెంగాల్​లలో కాంగ్రెస్ మటుమాయం అయ్యిందన్నారు. దేశవ్యతిరేకత వల్లే ప్రజలు కాంగ్రెస్​ను పక్కన పెట్టారన్నారు. ఈ నేపథ్యంలోనే స్థానిక పార్టీలతో కలిసి జతకట్టి మరోమారు దేశంలో సత్తా చాటాలనుకుంటోందని ఆరోపించారు. ప్రజలు కాంగ్రెస్​నే గాక, దాని వెంట వెళుతున్న విపక్షాలను కూడా ఈసారి పక్కన పెట్టనున్నారని జోస్యం చెప్పారు. ఎర్ర, పచ్చిమిర్చిలకు కాంగ్రెస్​కు తేడాయే తెలియదన్నారు. దేశంలో ఆపద సమయం ఉంటే దూరం పారిపోతుందని, లేదంటే అధికర పక్షంపై ఆరోపణలు చేస్తోందని అన్నారు. కాంగ్రెస్​కు అహంకార పూరిత రెండు కళ్లున్నాయన్నారు. ఒకటి 26 విపక్షాలది కాగా, రెండోది అవినీతి రాజకీయ కుటుంబ పాలనదన్నారు. కానీ ప్రజలు దీన్ని గమనిస్తున్నారని రానున్న రోజుల్లో విపక్షాలకు, కాంగ్రెస్​కు గట్టి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు.

  • 2014 తరువాత

2014 తరువాత దేశం దశలవారీగా అభివృద్ధి దిశలో సాగుతోందని ప్రధాని మోడీ అన్నారు. జన్​ధన్​ఖాతాలు, రైతు సంక్షేమం, నిరుపేదలకు ఇళ్లు, జల్​జీవన్​మిషన్, స్వచ్ఛ భారత్​ తదితర అనేక కార్యక్రమాలతో బీజేపీ దేశాన్ని, దేశంలోని పేదరికాన్ని గణనీయంగా తగ్గించగలిగిందన్నారు. ఈ విషయాన్ని తాను చెప్పడం లేదని నీతి ఆయోగ్, ఐఎంఎఫ్, డబ్ల్యూహెచ్​ఓలు చెబుతున్నాయన్నారు. తీవ్ర దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారు ప్రస్తుతం దేశంలో లేనట్లేనన్నారు. పేదరికం నుంచి 13. 5 కోట్ల మంది విముక్తి పొందారన్నారు. జల్​జీవన్, స్వచ్ఛ భారత్​ల ద్వారా ఏడు లక్షల మంది నిరుపేదల ప్రాణాలు కాపాడుకోగలిగామన్నారు. ప్రజాస్వామ్యంపై, దేశ అభివృద్ధిపై కాంగ్రెస్​కు విశ్వాసం ఉండదని, అందుకే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారని విమర్శించారు. పాక్​జెండాలు మోసేవారినే నమ్ముతారని విమర్శించారు. 70 యేళ్లలో చేయని అభివృద్ధిని తమ పార్టీ కేవలం పదేళ్లలో చేసి చూపించడాన్ని తట్టుకోలేకపోతున్నారన్నారు. 

  • పార్టీయే వారిది కాదు 

1920లో ఏ.ఓ.హ్యూమ్​పార్టీ స్థాపించారని, ఆ పార్టీని జెండాను హైజాక్​ చేసి తమ పార్టీగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. రాజకీయం కోసం గాంధీ లాంటి మహాత్ముడి పేరును కూడా వాడుకున్న పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్​ పార్టీయేనని దుయ్యబట్టారు. తుక్​డే గ్యాంగ్​ పార్టీలతో కలిసి ఇప్పుడు మరోమారు దేశాన్ని చిన్నాభిన్నం చేసేందుకు చూస్తోందని ప్రధాని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్​ రాజకీయ నీతిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. దీన్ని రానున్న ఎన్నికల్లో తిప్పికొట్టి మరోమారు బీజేపీకి మునుపటి  కంటే ఎక్కువ మెజార్టీ స్థానాలతో అధికారాన్ని అందజేస్తారని అన్నారు. అనంతరం కాంగ్రెస్, విపక్ష కూటమి ‘ఇండియా’ పెట్టిన అవిశ్వాసం మూజువాణి ఓటుతో వీగిపోయింది. ప్రధాని ప్రసంగం మధ్యలోనే విపక్ష సభ్యులు వాకౌట్​చేయడం గమనార్హం.