టీ- బిస్కెట్ తాగేదెలా...?

టీ- బిస్కెట్ తాగేదెలా...?
  • జిల్లా ఆస్పత్రి క్యాంటీన్ కు రాజకీయ గ్రహణం
  • ప్రారంభించడంలో అధికారుల నిర్లక్ష్యం
  • ఆదాయానికి గండి-రోగుల *అవస్థలు


ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా : నాగర్‌కర్నూల్ లో ప్రతి వ్యవహారంలో రాజకీయ జోక్యం పెరిగిపోతుంది. చివరికి రోగులకు టీ..బిస్కట్, మంచినీళ్లపైనా ప్రభావం చూపడం విడ్డూరం. విషయానికి వస్తే... జిల్లా జనరల్ ఆస్పత్రిలో కొన్ని సంవత్సరాలుగా ఒకే వ్యక్తికి నామ మాత్రపు కిరాయికి క్యాంటీన్ నిర్వహించేలా కట్టబెట్టారు. టెండర్ లేకుండా కొందరు అధికార పార్టీ నాయకుల అండతో  అనేక సంవత్సరాలుగా జిల్లా ఆసుపత్రిలో తిష్ట వేసిన క్యాంటీన్ టెండర్ దారు భారీగా ఆదాయాన్ని గడించారు. ఇది వివాదంగా మారడంతో మీడియా, సోషల్ సామాజిక మాధ్యమాలలో వార్తలు రావడంతో స్పందించిన అధికారులు లోపాయి కారిగా టెండర్ ను ఖరారు చేశారు. టెండర్ దక్కిన తర్వాత  కూడా వ్యాపారాన్ని ప్రారంభించకపోవడం లేదు. దీని వల్ల ఆసుపత్రికి వచ్చే రోగులు,  వారి బంధువులు టీ, బిస్కెడ్  మరియు టిఫిన్ ల కోసం అవస్థలు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సమయంలో గోళీలు వేసుకోవడానికి మంచినీళ్లూ దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. మంచినీటి సమస్య కూడా అధికంగా ఉండడంతో బయట వ్యాపారం చేసే వారు అధిక ధరలకు కొనుక్కుంటున్నారు.

గత కొన్ని నెలలుగా క్యాంటీన్ తెరవకపోవడంతో రోగులు, బంధువుల అర్ధాకలి ఎవరికీ పట్టకపోవడం గమనార్హం. ఈ విషయం తెలిసినా జిల్లా ఆస్పత్రి అధికారులు చోద్యం చూడటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సదరు టెండర్ దారుడుకి ఉన్న రాజకీయ అండదండలే అధికారుల చర్యలకు వెనుకడుగు వేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇది ఓ రకంగా ఆసుపత్రి ఆదాయం సైతం నష్టానికి కలిగిస్తోంది.  ఇప్పటికైనా అధికారులు స్పందించి క్యాంటీన్ తెరిపించాలని,  లేకుంటే రీ టెండర్ నిర్వహించి క్యాంటీన్ ప్రారంభించేలా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని రోగులు బంధువులు కోరుతున్నారు.