నవలా నవలామణి వాణిశ్రీ - ఆగస్ట్ 3 వాణిశ్రీ పుట్టినరోజు

నవలా నవలామణి వాణిశ్రీ - ఆగస్ట్ 3 వాణిశ్రీ పుట్టినరోజు

తెలుగు సినిమాల్లో కొంతకాలం నవలలు రాజ్యం ఏలాయి. అప్పట్లో నవలల ఆధారంగా సినిమాలు తీశారు. ఆ నవలల్లో వర్ణించిన రూప లావణ్యాలు కల హీరోయిన్ ఎవరంటే …. ఇంకెవరు వాణిశ్రీ అని ఎవరైనా వెంటనే చెప్పేవారు. నవలా నాయకి అనగానే నిన్నటి జనరేషన్ వారికి వెంటనే గుర్తొచ్చే హీరోయిన్ వాణిశ్రీనే. తెలుగులో ఆమె యాక్ట్ చేసిన మూవీస్ లో దాదాపు అన్నీ హిట్టయ్యాయి. తెరకు కావలసిన పర్సనాలిటీ, హీరోయిన్ గా నటించేందుకు అవసరమైన అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న నటి వాణిశ్రీ. తెలుగులో ద్విపాత్రాభినయం చేసిన తొలి కథానాయకి కూడా వాణిశ్రీనే.

వాణిశ్రీకి ఆ రోజుల్లో బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. సినిమాల్లో వాణిశ్రీ వేసుకున్న గాజులు, ఆమె కట్టిన చీరలు, చెవులకు పెట్టుకున్న పెద్ద పెద్ద రింగులు బాగా పాపులర్ అయ్యాయి. అమ్మాయిలు వాణిశ్రీలా ఉండాలనుకునేవారు. తమను తాము వాణిశ్రీగా అనుకుంటూ యద్దనపూడి సులోచనారాణి నవలల్లో హీరో రాజశేఖర్ లాంటి వాడు తమ లైఫ్ పార్టనర్ కావాలని డ్రీమ్స్ లోకి వెళ్లిపోయేవారు. 

కళలంటే ఇష్టం  

రెండు దశాబ్దాలకు పైగా తెలుగు సినిమా హీరోయిన్ గా వెలిగిన వాణిశ్రీ 1948 ఆగస్ట్ 3న పుట్టింది.

వాణిశ్రీ సొంత ఊరు నెల్లూరు. స్కూలు చదువు కూడా కొంతవరకూ నెల్లూరులోనే. ఆమెకు బాగా చదువుకోవాలని ఉండేది. మద్రాసు వెళ్ళిన తర్వాత కూడా ఆమె ఆంధ్ర మహిళా సభలో చదువుకుంది. కానీ స్కూల్ ఫైనల్ తో ఆపేయాల్సి వచ్చింది. ఆ తర్వాత మూడేళ్లు భరతనాట్యం, వీణ నేర్చుకుంది. వెంపటి చినసత్యం దగ్గర చాలాకాలం డాన్స్ ప్రాక్టీస్ చేసింది. 

సినిమాల్లోకి

1967లో మరపురాని కథ సినిమాతో హీరోయిన్ గా స్క్రీన్ పై కనబడిన వాణిశ్రీ అసలు పేరు రత్నకుమారి. అంతకు ముందే అదే పేరుతో మరో నటి ఉండడంతో … మహానటుడు ఎస్వీ రంగారావుగారు రత్నకుమారి పేరును వాణిశ్రీ అని పేరు మార్చారు. కొత్తల్లో చిన్నాచితకా వేషాలు… అంటే చెలికత్తెలాంటివి వేసింది. ఎన్.టి. రామారావు భీష్ముడిగా నటించిన భీష్మ చిత్రంలో ఎక్కడో ఓ సీన్ లో తళుక్కుమంది వాణిశ్రీ. మరపురాని కథ చిత్రంతో కొంత గుర్తింపు వచ్చింది. అలా అతి చిన్న స్థాయి నుంచి టాప్ హీరోయిన్ లెవెల్ కు చేరుకుంది. ఇదంతా ఒక్క రోజులో కాలేదు. దానివెనక ఆమె దీక్ష, పట్టుదల ఉన్నాయి. మొదట్లో ఆమె చాలా అవమానాల్ని కూడా ఫేస్ చేసింది. అలా అవమానించిన వాళ్లే తమ పిక్చర్ లో ఆమే కావాలని క్యూలు కట్టారు. వాణిశ్రీ ఉంటే చాలు తమ పంట పండినట్టే అని ప్రొడ్యూసర్లు అనుకునేవారు.

ఆలస్యంగా అవకాశాలు

మరపురాని కథ విజయం సాధించినా వెంటనే ఛాన్సులు రాలేదు. కొంత టైం పట్టింది. రంగులరాట్నంలో నడిరేయి ఏ జామునో పాటలో నటించిన వాణిశ్రీకి మంచి పేరొచ్చింది. ఇద్దరు అమ్మాయిలు సినిమాలో ద్విపాత్రాభినయం చేసే అవకాశం వచ్చింది. అందులో నాగేశ్వరరావు హీరో అయినా స్టోరీ అంతా వాణిశ్రీ చుట్టూనే తిరుగుతుంది.

మైల్ స్టోన్ దసరాబుల్లోడు

అక్కినేనితో నటించిన దసరాబుల్లోడు సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో వాణిశ్రీ తిరుగులేని హీరోయిన్ అయింది. అలాగే ప్రేమ్ నగర్ మరో ఘనవిజయం తెచ్చిపెట్టింది. నాగేశ్వరరావుతో సెక్రెటరీ, దత్తపుత్రుడు, విచిత్రబంధం, కొడుకు కోడలు, ఆలుమగలు, బంగారుబాబు వంటి హిట్స్ చేసింది. ఎన్.టి. రామారావుతో మొదటిసారి నిండుహృదయాలు సినిమాలో హీరోయిన్ గా చేసింది. తర్వాత ఆయనతో చేసిన ఎదురీత, ఎదురులేని మనిషి, దేశోద్ధారకులు మంచిపేరు తెచ్చాయి. ఇక … హీరోలతో చేసిన సినిమాలే కాకుండా జీవనజ్యోతి, జీవన తరంగాలు, గోరంత దీపం వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో వాణిశ్రీ సోలోగా తన సత్తా చాటుకుంది. గోరంతదీపంలో మేకప్ లేకుండానే యాక్ట్ చేసింది. ఇందులో ఆమె నటన, కెమెరా కోణాలు, బాపు డైరెక్షన్ ఆభరణాలు.  

హీరోల ఫేవరేట్ 

అప్పటి స్టార్ హీరోలు కూడా వాణిశ్రీని హీరోయిన్ గా తీసుకోమని రెకమెండ్ చేసేవారు. మధ్యతరగతి మహిళ అచ్చం ఇలాగే ఉంటుందా అనిపించేది వాణిశ్రీని చూస్తే. యద్దనపూడి నవలల్లో నాయికకు వాణిశ్రీ సజీవ శిల్పంగా నిలిచింది. ఆమె గెటప్ లో కొప్పు ఒక స్పెషాలిటీ. అంతవరకూ తెలుగు సినిమాల్లో అత్త, అమ్మ, హుందా బామ్మ కేరక్టర్స్ వేసేవాళ్లే కొప్పు చుట్టుకునేవారు. వాణిశ్రీ వచ్చాక కొప్పు హీరోయిన్ పరమైంది.

సావిత్రి వారసురాలు

మహానటి సావిత్రి తర్వాత ఆమె వారసురాలు వాణిశ్రీ అని చాలామంది అన్నారు. సాత్వికమైన పాత్రలు, సీరియస్ గా, పొగరుగా ఉండేవి, చిలిపివి ఇలా అన్ని రసాలూ పండించిన వాణిశ్రీ

తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో కూడా నటించింది. సౌత్ లో అన్ని లాంగ్వేజెస్ లో యాక్ట్ చేసి మెప్పించింది. వాణిశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలు.

-వి.మధుసూదనరావు.