కాళేశ్వరం’ పునర్దర్శనమ్ ‘నాస్తి’రస్తుః

కాళేశ్వరం’ పునర్దర్శనమ్ ‘నాస్తి’రస్తుః
  • భక్తుల నిలువు దోపిడి - దేవాదాయ శాఖ మౌనం

మహాదేవపూర్, ముద్ర: ఆధ్యాత్మిక పథంలో ముక్తిని ప్రసాదించే పురాణ ప్రశస్తి గాంచిన కాళేశ్వరం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున ఉబలాటపడతారు. వచ్చినవారు నిర్వహణను చూసి తట్టుకోలేకపోతున్నారు. ఇక్కడి వ్యాపార ధోరణికి  తోడు దేవస్థానం నిర్వహణకు బెంబేలెత్తిపోతున్నారు. కాళేశ్వరం దేవస్థానంలో అభిషేకం టికెట్ రూ.1116 మరియు లక్ష బిల్వార్చన 5,116 గా నిర్ణయించడం జరిగింది. గతంలో 116 రూపాయలకు అభిషేకం టికెట్లు ఏకంగా వెయ్యి నూట పదహారు రూపాయలకు పెంచడంతో భక్తుల తలకుమించిన భారంగా మారింది. అది కూడా మంటపములోనే అభిషేకం చేయించడం ఆతర్వాత దర్శనానికి అనుమతి ఇవ్వడంతో ఎంతో భక్తితో వచ్చిన భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. అమ్మవారి వద్ద కుంకుమార్చన 316 రూపాయలకు పెంచారు. కాలసర్ప దోష నివారణకు వెయ్యినూట పదహారుల టికెట్ గా నిర్ణయించారు.

అదనంగా పూజా సామాను కొనుక్కోవాలంటే దుకాణదారులు పెద్ద మొత్తంలో డబ్బులు గుంజుతున్నారు. పూజా సామాగ్రి 500 రూపాయలు అవసరం అవుతుంది. అభిషేకం కిట్టు 300 రూపాయలకు లభిస్తుంది. బయట వ్యాపారస్తులు ధరలు విపరీతంగా పెంచి అమ్ముతున్నా దేవస్థానం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దేవస్థానం దుకాణ సముదాయంలో ఉన్న వ్యాపారస్తులు గదులను అధిక ధరలకు టెండర్లు దక్కించుకున్న కారణంగా రోజుకో రకంగా రేట్లు పెంచి వస్తువులు విక్రయిస్తున్నారు. వ్యాపారస్తులపై దేవస్థానం అధికారులకు ఇలాంటి నియంత్రణ లేదు. గోదావరిలో బట్టలు మార్చుకునేందుకు దేవస్థానం నుండి ఎలాంటి తాత్కాలిక గదులు ఏర్పాటు చేయకపోగా గ్రామస్తులు బట్టలు మార్చుకునేందుకు తాత్కాలికంగా గదులు ఏర్పాటు చేసి స్త్రీలనుండి ఇష్టారీతిన వసూలు చేసుకుంటున్నారు. టాయిలెట్ల వద్ద కూడా డబ్బులు తీసుకుంటున్నప్పటికిని వాటిని పరిశుభ్రంగా ఉంచడంలో దేవస్థానం అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎక్కడ పండుకోలో ఎక్కడ తినాలో దేవస్థానంలో స్పష్టమైన నిబంధనలేమి లేవు. వంటకు పొయ్యి వెలిగించిన తర్వాత దేవస్థానం సిబ్బంది వచ్చి వారిని అక్కడ నుంచి తరిమి వేస్తున్నారు.

వాహనాలతో వచ్చినవారు సమీపంలోని అడవిలోకి వెళ్లి వంటావార్పు నిర్వహించుకుంటుండగా, వాహనాలు లేనివారు తట్టా బుట్టా పట్టుకొని గల్లి గల్లి తిరుగుతూ ఇబ్బందుల పాలవుతున్నారు. దేవస్థానంలో ఉచితంగా కనీసం పడుకునే అవకాశం కూడా ఇవ్వరు. వండుకొని తినడానికి కూడా అవకాశం తక్కువే. దేవస్థానంలో భక్తులకు ఎలాంటి గౌరవ మర్యాదలు ఉండవు. వారిని ఆదరించి బెదిరించడమే సిబ్బందికి తెలుసు. మర్యాదగాపూర్వకంగా భక్తులతో ప్రవర్తించాలని పలువురు భక్తులు కోరుతున్నారు. నిత్య శివ కళ్యాణం ఎప్పుడు జరుగుతుందో ఆ దేవుడికే తెలియాలి. ఒకరోజు 10 గంటలకు మరో రోజు 11 గంటలకు మరో రోజు 12 గంటలకు తోచినప్పుడు కళ్యాణం నిర్వహిస్తారు. కళ్యాణం చేయించే వారికి హారతిని కూడా ఇవ్వడం లేదని శివ కళ్యాణం చేయించుకునే భక్తులు వాపోతున్నారు. అన్నదాన కార్యక్రమంలో భాగంగా 50 మందికి మాత్రమే టికెట్లు ఉంచుతుండగా ఇందులో 30 టికెట్లు దేవస్థానం సిబ్బంది మాత్రమే వాడుకుంటున్నారు. నిరుపేద భక్తులు కౌంటర్ వద్దకు వచ్చి వేడుకున్నా వారికి భోజనం టికెట్ దొరకటం లేదు. అస్తికల నిమజ్జనం వద్ద కూడా డబ్బులు పెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తున్న నానాటికి కాలేశ్వరం వచ్చే భక్తుల సంఖ్య క్షీణిస్తున్నట్లు తెలుస్తుంది. అనేక దేవాలయాలతో పోల్చుకుంటే కాలేశ్వరం వచ్చినవారు అనేక కష్టాల పాలవుతున్నట్లు భక్తులను విచారిస్తే తెలుస్తుంది. భక్తులనుంచి వచ్చే ఆదాయాలను పర్వదినాలలో భక్తుల సౌకర్యాల కోసం వెచ్చించాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా కాళేశ్వరం దేవస్థానాన్ని భక్తుల సౌకర్యాలే ధ్యేయంగా నడిపించాలని కోరుతున్నారు.