గణేష్ నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు - ఎస్పీ పుల్లా కరుణాకర్

గణేష్ నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు - ఎస్పీ పుల్లా కరుణాకర్

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలో గణేష్ నిమజ్జనం శోభాయాత్ర  ప్రశాంతంగా, శాంతియుత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ పుల్లా కరుణాకర్ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో సోమవారం ఎస్పీ కరుణాకర్ మాట్లాడుతూ వినాయక నిమజ్జనం చేసే చెరువులు, కుంటలు, నదుల వద్ద ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గణేష్  ఊరేగింపు సమయంలో గ్రామాల్లో విద్యుత్ తీగలు తగిలి  ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని అప్రమత్తతగా వ్యవహరించాలని, కండిషన్లో ఉన్న వాహనాలను మాత్రమే గణేష్ శోభయాత్రకు వినియోగించాలని చెప్పారు. వినాయక ప్రతిమలను ఊరేగించే వాహన డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలని, మద్యం తాగి వాహనాలు నడపరాదని, తాగి నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. విగ్రహాలు తీసుకొని నీళ్లలో లోతు వరకు ఎవరూ వెళ్లకూడదని, అందులోనూ ఈతరాని  వారు ఎట్టి పరిస్థితుల్లో నీళ్లలో దిగకూడదని సూచించారు. నిమజ్జనం రోజున వాహనాలపై డీజేతో కూడిన మ్యూజిక్ సిస్టమును ఉపయోగించడం నిషేధించడం జరిగిందని, ఇతర మతాలకు గాని ఇతర వర్గాలకు చెందిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని ఏలాంటి రెచ్చగొట్టే పనులు చేయవద్దని పేర్కొన్నారు. మండపాల నిర్వాహకులు, తల్లిదండ్రులు చిన్నారులను నిమజ్జన ప్రాంతాలకు తీసుకురావద్దని తల్లిదండ్రులు తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని అన్నారు. జిల్లాలో ప్రశాంతంగా శోభయాత్ర నిర్వహణ కోసం  ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉత్సవ కమిటీ సభ్యులు, శాంతి కమిటీ సభ్యులలతో పోలీసు అధికారులు సమావేశం నిర్వహించారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవని,  ఏదైనా సంఘటన జరిగితే నిర్వాహకులు వెంటనే పోలీసులకు తెలియజేయాలని, ప్రజలు సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఏలాంటి వదంతులు, పుకార్లను నమ్మవద్దని చెప్పారు. ఏమైనా సమస్యలు ఉంటే దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కు గాని, డయల్-100 కు గాని సమాచారం అందించాలని కోరారు. ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం జరుగడమే జిల్లా పోలిసు శాఖ అభిమతమని, శాంతియుత, ప్రశాంత వినాయక నిమజ్జోత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.