గిరి వికాసం లక్ష్యాలను పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా..

గిరి వికాసం లక్ష్యాలను పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలో గిరి వికాసం పథకం కింద నిర్దేశించిన లక్ష్యాన్ని వేగవంతం చేసి  సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. కలెక్టరేట్ లోని తన చాంబర్ లో బుధవారం గిరి వికాసం పథకం అమలుపై సంబంధిత అధికారులతో కలెక్టర్ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 261 బ్లాక్ యూనిట్లకు 545 మంది లబ్ధిదారులకు బోరు బావులు తవ్వించేందుకు సర్వే నిర్వహించి, మొత్తం 218 బోరు బావులు అనుమతులు మంజూరు చేశామని, అందులో 158 పూర్తి కాగా మరో 60 బోరు బావులు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. గిరి వికాసం పథకం కింద గిరిజన రైతులకు ఉచితంగా బోరు బావులు తవ్వించి విద్యుత్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. విద్యుత్ శాఖ అధికారులు డిమాండ్ నోటీస్ అందించి విద్యుత్ సరఫరా చేయడంలో తీవ్ర జాప్యం చేయడం వలన విద్యుత్ శాఖ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

గిరి వికాసం కింద బోర్లు తవ్వకం పూర్తయిన వాటికి అధికారులు విద్యుత్ సరఫరా కోసం దరఖాస్తు పెడుతున్నప్పటికీ డిమాండ్ నోటీస్ ఇచ్చి విద్యుత్ సరఫరా చేయడంలో అలసత్వం వహించడానికి గల కారణాలను అడిగి తెలుసుకుని, వారం రోజులలో విద్యుత్ సరఫరా పనులు డిమాండ్ నోటీసు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పోడు భూముల్లో ఆయిల్ పామ్ పంట సాగు చేయుట కు రైతులకు అవగాహన కల్పించాలని, ఆసక్తి గల రైతులను గుర్తించి ఆయిల్ పామ్ పంట సాగుకు చర్యలు తీసుకోవాలని ఉద్యాన, వ్యవసాయ శాఖల అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి పురుషోత్తం, అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి అవినాష్, అటవీ, విద్యుత్ శాఖ, ఉద్యాన వన, వ్యవసాయ శాఖ  అధికారులు పాల్గొన్నారు.