డబుల్ బెడ్ రూం ఇండ్ల చివరి దశ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి- జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

డబుల్ బెడ్ రూం ఇండ్ల చివరి దశ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి- జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలో రెండో విడతలో జరుగుతున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చివరి దశ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. జిల్లాకేంద్రంలోని భాస్కర్ గడ్డలో నిర్మిస్తున్న 416 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులు, జంగేడు రోడ్డు విస్తరణ పనులను గురువారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భాస్కర్ గడ్డ వద్ద రూ.22.48 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 416 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి చేసి లబ్దిదారులకు అందజేసే విదంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేశాలపల్లిలో నిర్మించి లబ్ధిదారులకు అందజేసిన 544 డబుల్ బెడ్ రూం ఇండ్ల వద్ద కనీస మౌలిక వసతులు సంప్ నిర్మాణం, విద్యుత్ వైరింగ్ పనులు వేగవంతం చేయాలని పంచాయతీ రాజ్ అధికారులను ఆదేశించారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల కు విద్యుత్ కనెక్షన్ అందించేందుకు డీడీ తీయాలని సూచించారు.

డబుల్ బెడ్ రూం ఇండ్లకు మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ అధికారుల సమన్వయంతో మున్సిపల్ శాఖ అధికారులు త్రాగునీటి పైప్ లైన్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని  సూచించారు. పనులు నాణ్యతతో త్వరగా పూర్తయ్యే విధంగా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. జంగేడు రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన కలెక్టర్ పురోగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రూ. 4కోట్ల  వ్యయంతో ప్రభుత్వం అంబేడ్కర్ విగ్రహం నుంచి జంగేడు వరకు సుమారు ఒక కిలోమీటర్ రోడ్డు విస్తరణ పనులకు గాను ప్రభుత్వం టీయుఎఫ్ఐడీసీ నిధులు మంజూరు చేసిందని అన్నారు.  రోడ్డు విస్తరణ పనుల నేపథ్యంలో అవసరమైన భూమి సేకరణకు సామరస్యంగా చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని, ఆక్రమణలు తోలగించే దిశగా చర్యలు తీసుకోవాలని  మున్సిపల్ అధికారులను ఆదేశించారు. 
అనంతరం రేగొండ మండలం తహసిల్దార్ కార్యాలయంలో మండల ప్రజా పరిషత్ అధికారి, తహసిల్దార్ లతో ఉపాధి హామీ పనులు లేబర్ టర్న్ అవుట్, భూ సమస్యలు, భూ సర్వేలపై సమీక్ష సమావేశం నిర్వహించి తగు సూచనలు చేశారు.
ఈ పర్యటనలో ఇంచార్జి మున్సిపల్ కమిషనర్ అనిల్ కుమార్, పిఆర్ డీఈ వెంకటేశ్వర్లు, రేగొండ ఎంపిడిఓ, తహసీల్దార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.