బండికి ఉద్వాసన

బండికి ఉద్వాసన
  • ఈటలకు కీలక బాధ్యతలు
  •  జిల్లాలో మారనున్న రాజకీయ సమీకరణాలు

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్ర రాజకీయాలలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బిజెపి జాతీయ నాయకత్వం బండి సంజయ్ ని తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తొలగించింది. దీంతో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న బండి సంజయ్ వర్గం తీవ్ర నిరాశకు లోనయ్యారు. అయితే కేంద్ర సహాయ మంత్రిగా అవకాశం కల్పించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంకోవైపు తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ఈటల రాజేందర్ రాజేందర్ ను నియమిస్తూ కీలక బాధ్యతలు అప్పజెప్పింది. దీంతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోనున్నాయి. ఇప్పటివరకు బండి సంజయ్ వన్ మెన్ షో చేశాడు. ఇకనుండి ఈటల రాజేందర్ రాష్ట్రంతో పాటు జిల్లాలో కీలకంగా వ్యవహరించనున్నారు.

బండి సంజయ్ 2020 మార్చి నెలలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. 2019లో ఎంపీగా గెలుపొందడం ఆ తర్వాత బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి వరించడంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలలో కీలక నేతగా మారాడు. దుబ్బాక ఉప ఎన్నికలలో బిజెపి గెలవడంతో ఒక్కసారిగా ఫైర్ బ్రాండ్ గా మారాడు. అనంతరం జిహెచ్ఎంసి ఎన్నికలలో సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేసి 46 సీట్లు గెలపొందడం ఆయనకు కలిసి వచ్చిన అంశం. అనంతరం నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ఓడిపోగా హుజురాబాద్ ఉప ఎన్నికలలో ఈటల రాజేందర్ గెలుపుతో బిజెపి మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. మునుగోడు ఉప ఎన్నికల్లో ఓడిపోగా హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. రాష్ట్రంలో అధికారం తోపాటు సొంత ఇమేజ్ ను పెంచుకునే విధంగా ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా ఐదు విడుదలుగా కొనసాగించారు. దీంతో రాష్ట్రంలో బిజెపి పార్టీకి తగిన మైలేజ్ లభించింది.

కోఆర్డినేషన్ లేకపోవడమే కొంపముంచింది

నేతల మధ్య సమన్వయం లేకపోవడం బండి సంజయ్ కొంప ముంచిందని విశ్లేషకులు భావిస్తున్నారు. చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం ఒక అంశం కాగా సీనియర్ నేతలను సమన్వయపరచుకో పోవడం అతని మైనస్ పాయింట్. వన్ మెన్ షో చేయడం పార్టీలో ఉన్న సీనియర్ నాయకులకు నచ్చకపోవడం కూడా ప్రధాన  కారణంగా తెలుస్తుంది. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటినుండి కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్న స్థానిక నాయకులకు తగిన సమయం ఇవ్వకపోవడం కూడా ఇప్పుడు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.

కాన్ఫిడెన్షియల్ నేత ఈటల

రాష్ట్ర రాజకీయాల్లో సౌమ్యునిగా, వివాదరహితులుగా, తెలంగాణ ఉద్యమ నేతగా గుర్తింపు ఉన్న నేత ఈటల రాజేందర్. ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర రాజకీయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. టిఆర్ఎస్ నుండి బయటకు వచ్చిన అనంతరం ప్రత్యేక పరిస్థితులలో బిజెపిలో చేరారు. హుజరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించి దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికల్లో గెలిచిన నేతగా గుర్తింపు పొందాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ను ఎదురొడ్డి నిలబడి గెలిచిన నేతగా బిజెపి అధిష్టానం దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, 20 సంవత్సరాల పాటు తెలంగాణ ఉద్యమంలో కొనసాగి విశేష రాజకీయ అనుభవాన్ని గడించాడు. ఇప్పుడు ఆ నేపద్యమే బిజెపి అధిష్టానానికి కాన్ఫిడెన్షియల్ నేతగా గుర్తింపునిస్తూ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించింది.

బండి ఈటల మధ్య అంతర్గత పోరు
ఈటల రాజేందర్ బిజెపిలో చేరిన నాటి నుండి సముచిత గౌరవం ఇవ్వలేదన్న ఆరోపణలు బండి సంజయ్ పై ఉన్నాయి. దీంతో ఇద్దరు మధ్య అంతర్గత పోరు కొనసాగుతూ ఉండేది. ఇద్దరు బిజెపిలో కీలక నేతలు కావడంతో రెండు వర్గాల మధ్య పచ్చ గడ్డి వేస్తే బగ్గుమనేలా పరిస్థితులు నెలకొన్నాయి. నేరుగా ఇద్దరు నేతలు ఎప్పుడు బహిర్గత పరిచినప్పటికీ పరిస్థితి మాత్రం అలాగే కనిపించేది. జిల్లాలో ఉన్న కార్యకర్తలు ఇద్దరు మధ్య నలిగిపోతూ సంఘర్షణకు గురయ్యారు. జాతీయ నేతలు జిల్లా పర్యటన వచ్చినప్పుడు  ఇద్దరు నేతలు కలిసి వేదికలు పంచుకున్న సందర్భాలు చాలా అరుదు. ఇప్పుడు ఈటల రాజేందర్ కు కీలక బాధ్యతలు అప్పగించడంతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోనున్నాయి.