రెచ్చిపోతున్న భూ మాఫియా

రెచ్చిపోతున్న భూ మాఫియా
  • రేకుర్తిలో 36 ఎకరాల కబ్జాకు ప్రయత్నం
  • కోర్టులో కేసు ఉన్నా ఆగని కబ్జా కోరులు

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :కరీంనగర్ లో భూ మాఫియా రెచ్చిపోతుంది. కరీంనగర్ శివారు ప్రాంతాల్లో  ఖాళీ భూమి కనబడితే చాలు కబ్జాకు గురవుతున్నాయని అనేక ఫిర్యాదులు ఉన్నాయి.  కరీంనగర్ కు ఆనుకొని ఉన్న రేకుర్తి పరిధిలోని సర్వే నంబర్ 165 166 167 168 లోని 36.1 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఈ సర్వే నంబర్లలోని భూమిపై భూ కబ్జాదారుల కన్ను పడింది. ఈ భూమి తనదే అంటూ షే ఖాన్ వారసుడైన ఖలీద్ ఒకపక్క మరికొందరు తమదేనంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనికి సంబంధించి హైకోర్టు లో కేసు నడుస్తుంది. 194 సర్వే నంబర్ పై సింగల్ బెంచ్ ఉత్తర్వులు ఖలీదుకు వ్యతిరేకంగా రాగా, ఖలీద్ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో స్టే లభించింది.

తాజాగా తమ కంటే తమకే అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయని భావిస్తూ ఎవరికి వారుగా ఈ భూమిపై కాలుమోపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో రేకుర్తి మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాష్ కొందరు పేదలతో కలిసి ఈ స్థలంలో శుక్రవారం టెంట్ వేసి దీక్ష ప్రారంభించారు. దీంతో ఖలీద్ వర్గీయులతో పాటు ఇతరులు రావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ భూమికి సంబంధించి కేసు కోర్టులో ఉన్నందున ఎవరు కూడా ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదని టెంట్ ను తొలగించారు. అనంతరం నందెల్లి ప్రకాష్ ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. షేక్ ఖాన్ భూములకు సంబంధించి మొదటి నుంచి వివాదం చోటు చేసుకుంటూనే ఉంది.

భూముల ధరలకు రెక్కలు రావడంతో ఇప్పుడు భూ కబ్జాదారుల కన్ను, రాజకీయ నాయకుల కన్ను రేకుర్తి భూములపై పడింది. తాజాగా జరుగుతున్న పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఎవరికివారుగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ భూములు ఆక్రమణకు గురికావడంతో పలువురు 1997లో హైకోర్టును ఆశ్రయించారు. దీంతో భూములపై విచారణ చేపట్టాలని  కలెక్టర్ ను కోర్టు ఆదేశించింది. అప్పటి కలెక్టర్ బి.ఆర్ మీనా ఐదు గ్రామాల లో విచారణ జరిపి 4,500 ఎకరాల భూమి ఆక్రమణకు గురైనట్లు గుర్తించి 514 పేజీల రికార్డును హైకోర్టుకు అందించారు. అప్పటినుండి  వివాదం కొనసాగుతూనే ఉంది. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ హయాంలో హైకోర్టులో కేసు నడుస్తుండగానే వివాదాస్పద భూములు రిజిస్ట్రేషన్ అవుతున్నాయని అనేక ఫిర్యాదులు అందాయి. దీంతో ఎలాంటి రిజిస్ట్రేషన్లు జరగవద్దని ఫ్రీజింగ్ లో ఉంచాలని జిల్లా రిజిస్టార్ ను ఆదేశించారు. అప్పటినుండి ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ను నిలిపివేశారు. దీని వెనకాల బడా నేతలు, ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.