పెద్దపల్లి జిల్లాలో టెన్షన్... టెన్షన్...

పెద్దపల్లి జిల్లాలో టెన్షన్... టెన్షన్...
  • రామగిరి జెఎన్ టియు లోని స్ట్రాంగ్ రూమ్ లో అభ్యర్థుల భవితవ్యం 
  • ఆదివారం 12 గంటలకల్లా  తేలిపోనున్న జాతకం..
  • అన్ని సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలం..
  • గెలుపు ధీమాతో అధికార పార్టీ అభ్యర్థులు..
  • వార్ వన్ సైడ్ జరిగిన... ధీమాతో ఎలా ఉంటున్నారని ప్రజల్లో తీవ్రమైన చర్చ..


ముద్ర పెద్దపల్లి ప్రతినిధి:పెద్దపల్లి జిల్లాలో టెన్షన్... టెన్షన్...వాతావరణం నెలకొంది...పెద్దపెల్లి, మంథని, రామగుండం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల కంటే ఈసారి ప్రజల్లోనే  ఎక్కువగా టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఎన్నికల ప్రచారం మొదలు నుంచి  అధికార పార్టీ అభ్యర్థిని ఢీ కొనేందుకు  ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తో పాటు బిజెపితో పాటు  స్వతంత్రులు,  సర్వశక్తులు ధారపోసి నువ్వా నేనా... అన్నట్టుగా ప్రచారంలో దూసుకెళ్లారు. నవంబర్ 30వ తేదీన జరిగిన పోలింగ్ అనంతరం అట అభ్యర్థులు, ఇటు ప్రజల్లో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు? అనేదే కంటిమీద కునుకు లేకుండా పోయింది. రామగుండం నియోజకవర్గం పరిస్థితి చూసుకుంటే... గత మూడు పర్యాయాలు పోటీ చేసి ఓడిపోయిన  కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ ఈసారి గెలుపు ధీమాతో  ప్రజల్లోకి వెళ్లారు. ప్రజల్లో కూడా అంతకు మించి సానుభూతి కూడా పొందారు. ఇక అధికార పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కోరు కంటి చందర్  కూడా తనదైన శైలిలో  ప్రచారంలో హోరెత్తించారు. నవంబర్ 28వ తేదీ వరకు ప్రచారంలో స్పీడు ప్రదర్శించిన ఎమ్మెల్యే అభ్యర్థి కోరు కంటి చందర్ ఆ మరుసటి రోజు నుంచే అటు పార్టీ వర్గాల కు ఒక్కసారిగా షాకిచ్చారు. ఎవరికి అందుబాటులో లేకుండా... అసలేం జరుగుతుందో తెలియకుండా కనిపించకుండా పోయారు.

ఒక దశలో  పదిమంది కార్పొరేటర్లు  రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ప్రకటించేందుకు సిద్ధం కాగా, ఆ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అప్పటికప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు ప్రజలను తరలించిన ఖర్చులను పంపించడంతో కార్పొరేటర్లు వెనుకడుగు తీసుకున్నారు. ఆ తర్వాత కూడా ఓటర్లకు, అన్ని రోజులు ప్రచారం చేసిన కార్పొరేటర్లకు డబ్బుల విషయంలో  ఆశ చూపడంతో రామగుండంలో అర్థరాత్రి వరకు ఓటర్లు తలుపులు తెరిచే ఎదురుచూసిన పరిస్థితి అక్కడ తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. అయితే ఎమ్మెల్యే అభ్యర్థి కోరు కంటి చందర్ ఏ ఒక్కరికి చిక్కకుండా నేరుగా పోలింగ్ రోజునే వచ్చి ఓటు వేసి వెళ్లారు. అప్పటికే వార్ వన్ సైడ్ గా ప్రజలంతా కాంగ్రెస్ అభ్యర్థికే మొగ్గు చూపినట్లు ప్రచారం జరిగింది. అయితే అధికార పార్టీ వర్గాలు మాత్రం రహస్యంగా సంక్షేమ పథకాలు పొందుతున్న లబ్ధిదారులకు మాత్రమే  డబ్బులు పంచినట్లు సమాచారం. లబ్ధిదారులు వేసే ఓటు మీదనే ధీమాతో ఉంటున్నారని తెలిసింది. ఇదిలా ఉండగా  బిజెపి అభ్యర్థి కందుల సంధ్యారాణి కీ కూడా మహిళల నుంచి  సానుభూతిపరమైన ఓట్లు పడ్డట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ స్వతంత్ర అభ్యర్థిగా చేపట్టిన ప్రచారం కు  కూడా తన ఓటు బ్యాంకును భద్రపరచుకున్నట్లు తెలుస్తోంది. రామగుండంలో నలుగురు అభ్యర్థుల మధ్య తీవ్రమైన పోటీ ఉండడంతో ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. అయితే ప్రజల్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి పేరు మాత్రమే వినబడుతుంది. 

మంథనిలో నువ్వ...నేనా

మంథని నియోజకవర్గంలో చూసుకుంటే  ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీధర్ బాబు, అధికార పార్టీ అభ్యర్థి పుట్ట మధు మధ్యలోనే నువ్వా నేనా... అన్నట్టుగా ఉంది...నియోజకవర్గ పరిధిలోని మహదేవ్పూర్, కాటారం, మహా ముత్తారం మండలాల  ఓట్లే కీలకం కానున్నాయి. అయితే ఆ మండలాలకు చెందిన ఓట్లు ఎక్కువ శాతం కాంగ్రెస్ అభ్యర్థికే పడినట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థి  గెలుస్తాడని గట్టి ప్రచారం జరుగుతుంది. వీరిద్దరిలో ఎవరిని అదృష్టం వరిస్తుందో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకల్లా బయటపడుతుంది. 

పెద్దపల్లిలో ఉత్కంఠ పెద్దపెల్లి నియోజకవర్గం ఉత్కంఠ వాతావరణం నెలకొంది...అధికార పార్టీ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి పైన  ప్రజల్లో ఉన్న అసంతృప్తి కారణంగా ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి విజయ రమణ రావు కి ఎక్కువ శాతం గెలుపు అవకాశం ఉన్నట్లు ఓటింగ్ సరళిని బట్టి పరిశీలకులు భావిస్తున్నారు. పోలింగ్ రోజునే... ఆయా సంస్థలు జరిపిన సర్వేలు పెద్దపల్లి జిల్లాలోని  మూడు స్థానాలు కాంగ్రెస్ వశం చేసుకుంటుందని తెలిసి చెప్పాయి. అటు ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా రావడం విశేషం. ఏది ఏమైనా  అభ్యర్థుల భవితవ్యం మరి కొద్ది గంటల్లోనే తేలిపోనుంది..

 విజయోత్సవాలకు అనుమతి లేదు..

ఇదిలా ఉండగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఆదివారం నాడు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాలలో 144 సెక్షన్ అమలు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ రె మా రాజేశ్వరి ప్రకటించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు  నిషేధాజ్ఞలు కొనసాగనున్నాయి. దీంతో జిల్లాలో ఎక్కడ కూడా కార్యకర్తలు విజయోత్సవ వేడుకలు, ర్యాలీలుచేపట్టడానికి అవకాశం లేకుండా పోయింది. అలాగే మద్యం దుకాణాలు సైతం రోజంతా మూసి ఉండనున్నాయి.