హోం గార్డ్ కి ఎక్కువ .. జైల్ జవాన్ కి తక్కువ

హోం గార్డ్ కి ఎక్కువ .. జైల్ జవాన్ కి తక్కువ
  • చిన్న శాఖ పై ప్రభుత్వానికి కూడా చిన్న చూపే
  • ఆదాయం ఇస్తున్న శాఖ ఉద్యోగులకు ఆరోగ్య భద్రత సున్నా
  • ఎర్నడ్ (EL) లీవ్స్ విషయంలో కూడా జైల్ ఉద్యోగులకు అన్యాయమే
  • ఉద్యోగుల పిల్లల చదువులకు సంక్షేమ పధకాలు లేవు , ఉద్యోగుల అవసరాలకు లోన్ స్కీమ్స్ లేవు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: తెలంగాణా జైళ్ళ శాఖ లో జవాన్ కు ఇస్తున్న యూనిఫాం అలవెన్స్ ఒక హోం గార్డ్ కి ఇస్తున్న యూనిఫాం అలవెన్స్ కన్నా 50% తక్కువ . హోంగార్డ్ కి 7500 యూనిఫాం అలవెన్స్ ఉండగా జైల్ జవాన్ కి మాత్రం చాలీ చాలని 3500 యూనిఫాం అలవెన్స్ తో సరిపెట్టుకుంటూ వెళ్ళదీస్తున్నారు . ఇతర యూనీఫాం శాఖ మాదిరి కాకుండా ప్రతిరోజూ ఖచ్చితంగా డ్యూటీ టైం లో యూనీఫాం ధరించి విధులు నిర్వహించేది జైల్ జవాన్ మాత్రమే. 

కేవలం 1200 నుండి 1300 మంది ఉద్యోగులున్న చిన్న శాఖ జైళ్ళ శాఖ . చిన్న శాఖలలో ప్రభుత్వానికి ఆదాయం ఇస్తున్న శాఖ ఒక్క జైళ్ళ శాఖ అనడంలో అతిశయోక్తి లేదు అలాంటి జైల్ ఉద్యోగులను ప్రభుత్వం ఏ రకంగా ఆదుకోవడం లేదని సగటు జైల్ ఉద్యోగి పడుతున్న ఆవేదన చూస్తే కళ్ల్ళు చెమర్చక తప్పదు . ఇతర యూనీఫాం శాఖలకు ఇస్తున్న సదుపాయాలు వీరికి లేకపోవడం గమనార్హం. వీరికి ఏదైనా అనారోగ్యం సంభవించినా కూడా కేవలం EHS మీదనే ఆధారపడాల్సి వస్తుంది . ఇతర శాఖల మాదిరి వీరికి ఆరోగ్య భద్రత , హెల్త్ స్కీం లు లేకపోవడంతో ఏదైనా అనుకోని సంఘటనలు సంభవిస్తే అప్పు చేసి మరీ హాస్పటల్ బిల్స్ కట్టాల్సి వస్తుంది . దీనికి తోడు కుటుంబ పోషణ కు కూడా అప్పు చెయ్యాల్సి వస్తుంది. 

ఇతర ప్రభుత్వ యూనీఫాం శాఖల తో పోల్చుకుంటే  వీరికి సెలవుల విషయంలో కూడా అన్యాయమే జరుగుతుంది . ఇతర యూనీఫాం శాఖల  మాదిరి సెలవులను వీరికి ప్రభుత్వం కెటాయించక పోవటం వీరిపట్ల చిన్న చూపుకు నిదర్శనం. ఇతర ఖాఖీ యూనీఫాం శాఖలో ఉద్యోగులకు సెలవులను 45 ఇవ్వగా వీరికి  మాత్రం 30 తోనే కుదించింది . ఇందులో కూడా మరో యూనీఫాం శాఖ వారు 30 లీవ్స్ సరెండర్ చేసే వీలుండగా వీరు మాత్రం 15 మాత్రమే సరెండర్ చేసే అవకాశం ఉంది . ఇక కొత్తగా ఇప్పుడు 60 సెలవుల కోసం ప్రభుత్వం పై మరో ఖాఖీ శాఖ ఉద్యోగులు ఒత్తిడి తెస్తుండగా జైళ్ళ ఉద్యోగులు మాత్రం 45 సెలవుల కోసం ప్రభుత్వానికి , పై అధికారులకు ఆర్జీ పెట్టుకోవడం వారి వెనుకబాటు తనానికి నిదర్శనం. 

ఇకపిల్లల చదువులకు , విదేశాలకు వెళ్ళేందుకు ఎలాంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం జైళ్ళ శాఖ ఉద్యోగులకు ఇవ్వకపోవడంతో వీరి పిల్లల చదువుల పై ఈ ప్రభావం అధికంగా ఉంది . విదేశాలకు వెళ్ళి చదువుకోవాలంటే వేరే దారి లేక చదువుకోవాలని ఆశ ఉన్నా ఆ స్థోమత లేక ఉన్న దాంట్లో సంతృప్తి పడుతున్న పరిస్తితి ఉద్యోగుల పిల్లలది . ఇంటి నిర్మాణం విషయంలో కూడా వీరికి ఎలాంటి హౌసింగ్ సొసైటీ లోన్ లు ప్రభుత్వం నుండి లేక పోవడం , వీరి శాఖలో కూడ ఎలాంటి రుణాలు మంజూరు చేసేందుకు వీలు లేకపోవడంతో దిక్కు మొక్కు లేక బ్యాంకులకు వెళితే బ్యాంక్ వారు వీరికి యూనిఫాం శాఖకి సొంత కార్పోరేషన్లు ఉన్నాయని వారే మీకు హౌసింగ్ లోన్ కల్పిస్తారని సమాధానం చెప్పడంతో చాలా మంది నిరాశగానే వెనుదిరుగుతున్నారు . వీరికి ఇతర విషయాలలో కూడా ప్రభుత్వం నుండి ఎలాంటి ఆర్ధిక తోడ్పాటు లేకపోవడంతో ఎన్నేళ్ళయినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న సామెత లా వీరి జీవితాలు ఉన్నాయి . కనీసం ఉన్నతాధికారులు ఇప్పటికైనా ప్రభుత్వంతో చర్చించి వీరి సమస్యలను పరిగణన లోకి తీసుకొని అన్ని ఇతర యూనిఫాం శాఖల మాదిరి వీరికి కూడా అన్ని రకాల సదుపాయాలు కల్పించే విధంగా ముఖ్యంగా వీరి ఆరోగ్య విషయాలపైన మరియు వీరి పిల్లల చదువులపైన చర్యలు తీసుకోవాలని వీరు కూడా సమాజంలో ఉన్నతంగా ఉండేలా కనీసం ఒక సామాన్యుడి మాదిరి అయినా ఉండేలా చూడాలని ఉద్యోగులు కోరుతున్నారు . ఇకనైనా ఉన్నతాధికారులు ఈ చిరుద్యోగులపై కనికరం చూపిస్తే వీరి జీవితాలలో వెలుగులు నింపవచ్చని మరి కొందరి ఉద్యోగుల అభిప్రాయం.