వసూళ్ల దందాకు కొత్త "రూటు"

వసూళ్ల దందాకు కొత్త "రూటు"
  • మానేరు లో వసూల్ రాజాలు...
    మట్టి రోడ్డు వేసి... టోల్ పేరిట వసూల్ చేసి... ఎవరు వేయమన్నారు...ఎందుకు వేశారు....
  • చేతులెత్తేసిన అధికారులు...
    పెద్దపల్లి భూపాలపల్లి జిల్లా సరిహద్దు ఓడేడు మానేరులో... టోల్ గేట్ ఏర్పాటుచేసి వాహనదారుల నుంచి బలవంతంగా అక్రమ వసూల్

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: ఇప్పటివరకు... మానేరు నదిలో ఇసుక దొంగలు పడటమే చూస్తున్నాం... కానీ ఇక్కడ మాత్రం ఒక అడుగు ముందుకేసి... కాసింత బరితెగించి... అక్రమ సంపాదనకు కొత్త "మార్గం" ఎంచుకున్నారు. రాత్రికి రాత్రి తమ జాగిరి అన్నట్టు.. మానేరు నదిలో మట్టి రోడ్డు వేశారు.. వాహనదారుల నుంచి రోజు రోజుకు రూ. లక్షల్లో వసూలు చేస్తున్నారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే... ఈ దందాను అడ్డుకోవాల్సిన అధికారులను ఇదేమిటి అని అడిగితే..? కామ్ ఏమి చేయలేమంటూ చెప్పడం పలు అనుమానాలకు తావిస్తున్నది. పెద్దపల్లి జిల్లా ముత్తారం మానేరు నది ఇప్పుడు అక్కడ కొంతమందికి కాసులు కురిపిస్తున్నది. ప్రభుత్వం చేయాల్సిన పనిని... కొందరు ప్రైవేటు వ్యక్తులు ఓ మట్టి రోడ్డు వేసి టోల్ పేరిట వాహనదారుల నుంచి బలవంతంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఎవరని అడగకుండా, ఇలాంటి టెండర్ లేకుండా... వారికి వారే మానేరు నది లో మట్టి పోసి రోజు లక్ష వసూలు చేస్తున్నారు. అటుగా రోడ్డు మార్గం ఉందని వాహన చోదకులు ఎవరైనా వెళితే.. దర్జాగా టోల్ పేరిట వసూలు చేస్తున్నారు.

ఇదేమిటి అని అడిగితే... మట్టి రోడ్డు వేయడానికి అయినా ఖర్చు ఎవరిస్తారు అంటూ ఎదురు సమాధానం చెప్పి మరి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మూడు పువ్వులు... ఆరు కాయలుగా రోడ్డుపై వెళుతున్న వాహనాలను ఆపి డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో లారీలలో, వ్యాన్లలో, కార్లలో, ద్విచక్ర వాహన దారలు పై వెళుతున్న వారి జేబులు కొల్లగొడుతున్నారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మట్టి రోడ్డు వేసి లక్షలు పట్టపగలే వసూలు చేస్తున్న పట్టించుకున్న వారే కరువయ్యారు. దీంతో అధికారులపై మండల ప్రజలు ఆగ్రహం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అక్రమ వసూలను వెంటనే నిలిపివేయాలని కోరుతున్నారు. ఈ రోడ్డు వేయడానికి ఎవరు టెండర్ ఇచ్చారు...? ఎవరు అనుమతి ఇచ్చారు..? ఇందులో సంబంధిత అధికారుల వాటా ఎంత..? అనేది తేలాల్సి ఉన్నది. ఒక మానేరు నదిలో మట్టి రోడ్డు వేసిన... అధికారులు ఎందుకు అభ్యంతరం చెప్పడం లేదు అనేదే ఇక్కడ అంతుచిక్కడం లేదు.