10th Question Paper Leak పది ప్రశ్నాపత్రం లీక్ పై కలెక్టర్ ఆగ్రహం

10th Question Paper Leak పది ప్రశ్నాపత్రం లీక్ పై కలెక్టర్ ఆగ్రహం
10 question paper leaked

ముద్ర, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (వికారాబాద్): తాండూరులో పది పరీక్షల ప్రశ్నాపత్రం లీకైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. టీఎస్‌పీఎ‌స్పీ పేపర్ లీకేజీల సంఘటనలు కొనసాగుతుండగానే పది పరీక్షల మొదటి రోజు ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో విపక్షాలు ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తి పోస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో తాండూరులో మొదటి రోజు సోమవారం ఉదయం పరీక్ష మొదలైన ఏడు నిమిషాలలోపే అంటే 9:37 గంటలకే ప్రశ్నాపత్రం లీక్ అయ్యింది. పకడ్బందీగా నిర్వహించాల్సిన పదో తరగతి వార్షిక పరీక్షల పేపర్ తాండూరు వాట్సాప్ సోషల్ మీడియాల గ్రూప్‌లలో ముందే చెక్కర్లుకొట్టింది. ఈ విషయంపై అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ పేపర్ మనది కాదంటూ బుకాయించారు.

అయితే పరీక్షా సమయం అయిపోయిన తర్వాత 12:30 గంటలకు బయటకు వచ్చిన విద్యార్థుల దగ్గర పేపర్ చూడగా ఆ పేపర్ ఈ పేపర్ ఒకటే విధంగా ఉన్నట్టుగా తెలిసింది. దీంతో ముందుగానే పదో తరగతి పరీక్ష పేపర్ లీక్ అయిందని వెలుగులోకి రావడం జరిగింది. ప్రశ్నాపత్రం లీకేజ్‌తో టెన్త్ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై తీవ్ర ఆగ్రహంగా ఉన్న జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఎంఈఓ వెంకటయ్యతో ఫోన్లో మాట్లాడారు. ఘటనకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. ఇన్విజిలేటర్ బందయ్య ఫోన్ నుండి ప్రశ్న పత్రం లీక్ అయినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందజేయాలంటూ జిల్లా విద్యాధికారితోపాటు మండల అధికారికి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అధికారులు మాత్రం ప్రశ్న పత్రం లీక్ కాలేదని చెబుతున్నారు.