ఎయిర్ పోర్ట్ మెట్రో మార్గంలో 13 స్టేషన్లు  

ఎయిర్ పోర్ట్ మెట్రో మార్గంలో 13 స్టేషన్లు   

Hyderabad Metro :  నగరంలోని నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు మార్గంలో చాంద్రాయణగుట్ట వరకు 14 కిలోమీటర్ల పొడవునా 13 మెట్రో స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్టు హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం వున్న నాగోల్ స్టేషన్ సమీపంలోనే తొలి స్టేషన్ తో ప్రారంభమవుతుందని తెలిపారు. నాగోల్ చౌరస్తా, అల్కాపురి చౌరస్తా, కామినేని ఆస్పత్రి, ఎల్బీనగర్ కూడలి, సాగర్ రింగ్ రోడ్డు, మైత్రీనగర్, కర్మన్ ఘాట్, చంపాపేట్ రోడ్ కూడలి, ఒవైసీ ఆస్పత్రి, డీఆర్డీవో, హఫీజ్ బాబానగర్, చాంద్రాయణగుట్ట  ప్రాంతాల్లో కొత్త మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు.

ఆ మార్గంలో మెట్రో రైలు ఎలైన్ మెంట్, స్టేషన్లు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలన్నది ఖరారు చేయడానికి వీలుగా ఆయన శనివారం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నాగోల్ నుంచి చాంద్రాయణగుట వరకు కొన్ని ఫ్లైఓవర్ల వల్ల స్టేషన్ల నిర్మాణానికి భూసేకరణ అనివార్యంగా మారింది. అయితే, ఇందులో ప్రైవేటు ఆస్తులు వీలైనంత కనిష్టంగా సేకరించేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే మెట్రో రైలు స్టేషన్లకు సంబంధించి పేర్లను ఖరారు చేయడానికి ముందు ట్రాఫిక్ పోలీసులు, సాధారణ ప్రజానీకం నుంచి సూచనలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.