హార్డ్​వేర్​ కోసం  పీఎల్​ఐ 2.0కు 44 దరఖాస్తులు

హార్డ్​వేర్​ కోసం  పీఎల్​ఐ 2.0కు 44 దరఖాస్తులు
  • భారత్​ను అగ్రగామిలో నిలబెట్టే ప్రణాళికలతో దిగ్గజ సంస్థలు

న్యూఢిల్లీ: భారత్​ఫోన్ల మాదిరిగానే ల్యాప్​టాప్​లు, పీసీలు, కంప్యూటర్ల తయారీకి యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి ఇప్పటికే అంతర్జాతీయ, దేశీయ 44 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇంకా కొన్ని అంతర్జాతీయ దిగ్గజ సంస్థలైతే వీటి ఉత్పత్తిలో భారత్​ను అగ్రగామిలో నిలిపేందుకు ప్రణాళికలతో ముందుకు వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే భారత్​లో ఫోన్ల వినియోగం, తయారీ వ్యాపారం జోరుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవలే కేంద్రం వీటి దిగుమతిపై పలు ఆంక్షలు విధించిన దాన్ని తిరిగి అక్టోబర్​ 31వ తేదీ వరకూ వాయిదా వేసింది.  ప్రొడక్షనల్ లింక్డ్ ఇన్సెంటివ్ ఐటీ హార్డ్‌వేర్ కోసం పీఎల్ఐ 2.0 కింద ప్రోత్సాహకాల కోసం మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దరఖాస్తులను ఆహ్వానించింది. దీనికి విశేషాధారణ లభించింది. 

ఐటీ హార్డ్‌వేర్‌ తయారీ కోసం ప్రకటించిన రూ.17,000 కోట్ల పీఎల్‌ఐ కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఈ నెల 30తో ముగియనుంది. మార్కెట్‌ పరిశోధక సంస్థ కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ తాజా డేటా ప్రకారం.. ఈ జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి దేశంలోని టాప్‌-5 పర్సనల్‌ కంప్యూటర్‌ బ్రాండ్ల జాబితాలో లెనొవో, హెచ్‌పీ, డెల్‌, యాపిల్‌, ఏసర్‌ స్థానం దక్కించుకున్నాయి. భారత పీసీ, ల్యాప్‌ట్యాప్​ల  మార్కెట్‌ వార్షిక విక్రయాలు 800 కోట్ల డాలర్ల (సుమారు రూ.65,600 కోట్లు) స్థాయిలో ఉందని, అందులో దాదాపు 65 శాతం విదేశాల నుంచి దిగుమతవుతున్నవేనని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌  అన్నారు. పీఎల్‌ఐ పథకాల మద్దతుతో వచ్చే 2-3 ఏళ్లలో దేశీయ డిమాండ్‌లో 60-–65 శాతం ఐటీ హార్డ్‌వేర్‌ ఉత్పత్తులు దేశీయంగానే సమకూరవచ్చని ఆప్టిమస్‌ ఎలక్ర్టానిక్స్‌ లిమిటెడ్‌ ఎండీ ఏ గురురాజ్‌ అన్నారు. ల్యాప్‌ట్యాప్​లు, పీసీలు, ట్యాబ్లెట్ల దిగుమతులపై ఆంక్షలు ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయంగా లావా ఇంటర్నేషనల్‌ సహ వ్యవస్థాపకులు అభిప్రాయపడ్డారు.