ధనిక రాష్ట్రంలో జీతాల కరువ

ధనిక రాష్ట్రంలో జీతాల కరువ

  • తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాల్లో జాప్యం
  • రోజుకు రెండు మూడు జిల్లాల చొప్పున చెల్లింపు
  • 11 జిల్లాలకు ఇప్పటికీ అందని శాలరీ
  • జాడలేని ‌4 డీఏలు, పీఆర్సీ ఎరియర్స్
  • ‌‌పెండింగ్​లో రూ. 1000 కోట్లకు పైగా బిల్లులు 
  • రాష్ట్ర ఆర్థిక లోటే అసలు సమస్య
  • ఈఎంఐ, ఫైనాన్స్​రుణాల చెల్లింపు జాప్యంతో జరిమానాలు

ముద్ర, తెలంగాణ బ్యూరో : ధనిక రాష్ట్రంగా పేరొందిన తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రతి నెల వేతనాల కోసం నిరీక్షిస్తున్నారు. హైదరాబాద్, పరిసర జిల్లాల్లో ఉద్యోగులు 2వ తేదీలోపే వేతనాలు పొందుతుంటే.. మిగతా జిల్లాల్లో మాత్రం రెండో వారం వరకు వేచి చూడాల్సిన దుస్థితి నెలకొంది. గతంలో ప్రతీనెల 1వ తేదీన ఠంచన్​గా ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జీతాలు జమయ్యేవి. కానీ ఏడాది కాలంగా వేతనాల కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. ఆర్థిక లోటే జీతాల చెల్లింపులో జాప్యానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. నిధులు లేకపోవడంతోనే ప్రభుత్వం రోజుకు రెండు లేదా మూడు జిల్లాల విడదల వారీగా వేతనాలు జమా చేస్తున్నట్లు ఉద్యోగవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సమైక్య రాష్ట్రంలో జీతాల చెల్లింపులో ఏనాడూ అంత జాప్యం జరగలేదని, స్వరాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి రావడం ఆవేదన కలిగిస్తుందని ఉద్యోగులు చెబుతున్నారు. కాగా బుధవారం వరకు ఉమ్మడి నిజామాబాద్, వరంగల్, నల్లగొండలోని 11 జిల్లాల ఉద్యోగులకు జీతాలు అందలేదు.

ఉద్యోగుల వెతలు..!
జీతాల చెల్లింపులో జాప్యం జరగడంతో రుణాలిచ్చిన బ్యాంకులు, ఫైనాన్స్​సంస్థలు 5వ తేదీలోపు వాయిదాలు చెల్లించకపోతే ఉద్యోగ, ఉపాధ్యాయుల ఖాతాలు స్తంభింపజేసి జరిమానా వేస్తున్నారు. ప్రస్తుతం 90 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, గృహ నిర్మాణాలు, వాహన కొనుగోళ్లు, పిల్లల చదువులు, వివాహాలకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. ఇంకొందరు అత్యవసర పరిస్థితిలో ఫైనాన్స్​తీసుకున్నారు. జీతాలు ఆలస్యం కావడంతో ఈఎంఐలు ఆలస్యమవుతున్నాయని, దీంతో ఆయా బ్యాంకులు తమపై ఒత్తిడి తేవడంతోపాటు భారీ జరిమానా విధిస్తున్నాయని ఉద్యోగులు వాపోతున్నారు. రాష్ట్రంలో మిగులు ఆదాయం గురించి తరుచూ గొప్పలు చెబుతోన్న సీఎం, మంత్రుల వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నారు. వీటితోపాటు రావల్సిన 4 డీఏలు, పీఆర్సీ ఎరియర్స్, సప్లిమెంటరీ బిల్లులు, గృహ నిర్మాణ బిల్లులు, సంపాదిత సెలవుల అమ్మకం, మెడికల్ రీయింబర్స్​మెంట్ మొత్తం సుమారు 2వేలకు పైగా బిల్లులు పెండింగ్​లో ఉన్నాయి. ఈ  బిల్లుల విలువ రూ. వెయ్యి కోట్లపైనే ఉంటుందని సంఘ నేతలు చెబుతున్నారు.

= ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చనిపోతే వారి అంత్యక్రియలకు గతంలో రూ.10వేలు రూ.20వేల వరకు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు చావు జరిగి రెండు నెలలవుతున్నా దహస సంస్కారాలకు ఇవ్వాల్సిన డబ్బులు అందడం లేదు. 
= గతంలో దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు ఫెస్టివల్​అడ్వాన్స్​పేరిట పండుగలకు రూ.20 వేల వరకు ఇచ్చేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు.
= ఏడాదిలో ఓ సారి తీర్థ, విహార యాత్రలకు వెళ్లేందుకు ఇచ్చే హోం టౌన్, ఎల్​టీసీ బిల్లుల ఊసేలేదు. 
= ఎవరైనా అనారోగ్య సమస్యలతో సెలవు పెట్టి సప్లమెంటరీ బిల్లుల వేతనాలు పొందే అవకాశం గతంలో ఉండేది. కానీ 6 నెలల నుంచి సప్లిమెంటరీ జీతాల బిల్లు మంజూరు లేదు. 

ఈ కుబేర్​కరుణిస్తేనే..!
గతంలో ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలకు సంబంధించిన బిల్లులు ఎస్టీఓ, డీటీఓల వద్ద మంజూరై ఆయా కార్యాలయాల నుంచి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమయ్యేవి. కానీ ఏడాదిన్నర నుంచి ఈ కుబేర్​ పేరిట కేంద్రం ప్రవేశపెట్టిన కేంద్రీకృత వ్యవస్థను అనుసరించి వేతనాలు అందుతున్నాయి. ఎస్టీఓ, డీటీఓల్లో పాస్​ అయిన వేతన, ఇతర బిల్లుల్ని సంబంధిత అధికారులు ఆథరైజేషన్ కోసం ఈ కుబేర్​లో నమోదు చేస్తారు. తర్వాత ఏ రోజు ఏయే జిల్లాలకు వేతనాలు వేయాలో ప్రగతి భవన్ నుంచి ఫైనాన్స్​కార్యదర్శికి ఆదేశాలు వెళ్తాయి. ఆ మేరకు ఆయా జిల్లాల్లో విధులు నిర్వర్తిస్తోన్న ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు వారివారి ఖాతాల్లో జమా అవుతాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 2.78లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 1.10లక్ష మంది ఉపాధ్యాయులు, 2 లక్షలపైచిలుకు మంది పెన్షనర్లు ఉన్నారు.

= పెద్దపల్లి జిల్లా లోకపేట ప్రాథమిక పాఠశాలకు ఓ ఉపాధ్యాయుడు ఏడాది క్రితం గుండె సంబంధిత వ్యాధితో ఆస్పత్రి పాలయ్యాడు. చికిత్సకు రూ. 2లక్షల ఖర్చయింది. 8 నెలల క్రితం మెడికల్ రీయింబర్స్​మెంట్ బిల్లు పెట్టుకున్నాడు. అయితే ఇంత వరకు బిల్లు మంజూరు కాలేదు. దీంతో రాష్ట్ర, జిల్లా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. ఇతనిలాగే ఎంతో మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు బిల్లుల కోసం వేచి చూస్తున్నారు..
 

ధనిక రాష్ట్రంలో ఈ పరిస్థితి బాధాకరం
కె. సారయ్య, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ టీచర్స్​యూనియన్
సకాలంలో వేతనాలు అందక, బిల్లులు మంజూరు కాక రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరం. సంపాదిత సెలవుల నగదు(ఈఎల్), మెడికల్ రీయింబర్స్‌‌మెంట్, పిల్లల ఫీజు రాయితీ, జీపీఎఫ్ అడ్వాన్సులు, పాక్షిక విత్ డ్రాయల్స్ తదితర బిల్లులు 6 నెలలు దాటినా శాంక్షన్ కావడం లేదు. ఈ–-కుబేర్‌‌లో నెలల తరబడి పెండింగులో పెడుతున్నారు. ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా కూడా మంజూరు చేయకపోవడంతో సదరు బిల్లులన్నీ కొలాప్స్​అవుతున్నాయి.