లీక్ పేపర్ అమ్మకాల విలువ 15 కోట్లు

లీక్ పేపర్ అమ్మకాల విలువ 15 కోట్లు
  • విచారణలో సిట్ దూకుడు
  • డీఈ రమేశ్ అరెస్ట్​తో కొత్త మలుపు
  • వేగంగా కదులుతున్న అధికారులు
  • వచ్చే వారం కోర్టులో చార్జ్​షీట్​
  • తొలి రిపోర్టులో 37 మందిపై అభియోగాలు
  • ఈడీ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం

ముద్ర, తెలంగాణ బ్యూరో :
టీఎస్పీఎస్పీ ప్రశ్నపత్రాల లీకేజీలో కొనుగోళ్లు కోట్లు దాటిపోయాయి. ఈ కేసులో ఇప్పటి వరకు 50 మందిని అరెస్ట్​ చేయగా, డీఈ పూల రమేశ్​ ద్వారానే పెద్ద ఎత్తున వ్యాపారంగా సాగినట్లు తేలింది. ఏఈ, డీఏఓ పరీక్షా పత్రాల అమ్మకాల ద్వారానే పూల రమేశ్​రూ.13 కోట్లకుపైగా వసూలు చేసినట్లు సిట్​అనుమానిస్తున్నది. దీనికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ఈ వ్యవహారంపై హైకోర్టుకు నివేదిక ఇచ్చిన సిట్ నాంపల్లి కోర్టులో ఇంకా అభియోగ పత్రాలు దాఖలు చేయలేదు. ఈ వారంలో విచారణను కొలిక్కి తీసుకువచ్చి వచ్చేవారంలో చార్జ్​షీట్​ దాఖలు చేయనున్నారు. 37 మంది నిందితులుగా చేర్చనున్నారు. ఇప్పటికే ఈ కేసుపై ఈడీ విచారణ మొదలుపెట్టి నివేదిక కోసం కోర్టుకెళ్లిన విషయం తెలిసిందే. నిందితులను, టీఎస్పీఎస్సీ చైర్మన్​, సెక్రెటరీని ఈడీ విచారించింది.  ఈడీ విచారణ సమయానికి రూ. 39 లక్షలు మాత్రమే చేతులు మారినట్లుగా సిట్​ వెల్లడించింది. దీంతో ఈడీ కొంత బ్యాక్​ స్టెప్​ వేసింది. కానీ, ఇప్పుడు కొనుగోళ్ల వ్యవహారం కోట్లు దాటడంతో ఈడీ రీ ఎంట్రీ ఇవ్వనుంది. మనీ లాండరింగ్​ కేసుగా మళ్లీ విచారణ చేయాలని భావిస్తున్నారు. సిట్ స్థానిక కోర్టులో చార్జ్​షీట్ దాఖలు చేయగానే ఈడీ  రీ ఎంట్రీ అవుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ​

రూ.16 కోట్ల వ్యాపారం
ఉద్యోగ నియామక ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కమిషన్​ఉద్యోగి ప్రవీణ్​నుంచి ప్రధాన నిందుతులు రేణుక, ఆమె భర్త ఢాకూ నాయక్​ రూ.10 లక్షలకు పేపర్లు కొనుగోలు చేసిన విషయం బయటకు వచ్చింది. ఆ తర్వాత దాన్ని ఇతరులకు అమ్మారు. ఈ వ్యవహారంలో మొత్తం రూ. 39 లక్షలు చేతులు మారినట్లుగా సిట్ వారం కిందట వరకు రిపోర్ట్​లో పేర్కొన్నది. కానీ, డీఈ పూల రమేశ్ అరెస్ట్​ తర్వాత విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏఈ పరీక్ష సందర్భంగా ఎలక్ట్రానిక్​ డివైజెలు ఉపయోగించి, పరీక్ష రాయించినందుకే రూ. 2.50 కోట్లకు ఏడుగురు అభ్యర్థుల నుంచి బేరం కుదుర్చుకున్నట్లు తేలింది. ఆ తర్వాత డీఏఓ, ఏఈ పేపర్​ లీకు కావడం, కమిషన్ లో ఉద్యోగం చేస్తున్న సురేశ్​తో పరిచయం, ప్రశ్నపత్రాలు బయటకు రావడంతో డీఈ రమేశ్ భారీ బేరాలకు దిగారు. ఒక్కో పేపర్​ను రూ. 10 లక్షల నుంచి రూ. 13 లక్షలకు అమ్మేందుకు సిద్ధమయ్యారు. ఇలా ఏకంగా 80 మందికిపైగా ప్రశ్నపత్రాలను అమ్మినట్లు తేలింది. 

80 మంది ఎవరెక్కడ!?
డీఈ రమేశ్​ను కస్టడీకి తీసుకున్న సిట్​ఇప్పుడు 80 మంది వివరాల కోసం జల్లెడ పడుతున్నది. చాలా విషయాలు రమేశ్ దాస్తున్నట్లు సిట్​అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 80 మందికి ఏఈ, డీఏఓ పేపర్​ను విక్రయించినట్లు చెప్పడంతో వారి కోసం వెతుకుతున్నారు. వీరిలో కొంతమందిని సిట్​ గుర్తించినట్లు తెలుస్తున్నది. ఒకేసారి వీరందరినీ అరెస్ట్​చేసే అంశాలపై పరిశీలన చేస్తున్నారు. ఇప్పటి వరకు కొంతమంది రూ. 13 లక్షలకుపైగా ఇచ్చి ప్రశ్నపత్రాలను కొన్నామని సిట్​ పోలీసుల ముందుకు ఒప్పుకుంటున్నట్లు సమాచారం. ఈ లెక్కన ప్రశ్నపత్రాల కేసులో రూ. 16 కోట్లకుపైగా వ్యాపారం సాగినట్లు స్పష్టమవుతున్నది. 

వచ్చేవారంలో చార్జ్​షీట్​
ఈ కేసుపై సిట్​ ఇంకా చార్జ్​షీట్​ దాఖలు చేయలేదు. హైకోర్టుకు సీల్డ్​ కవర్​నివేదికనుమాత్రమే ఇచ్చింది. స్థానిక కోర్టులో ఇంకా చార్జ్​షీట్​ దాఖలు చేయలేదు. వచ్చేవారంలో సిట్​ విచారణ పూర్తి నివేదికతో చార్జ్​షీట్​ దాఖలు చేయనున్నది. ఇందులో 37 మందిపై తొలుత అభియోగాలు మోపనున్నట్లు తెలుస్తున్నది. ఆ తర్వాత అనుబంధ చార్జ్​షీట్​లో డీఈ రమేశ్​, 80 మంది వివరాలను సమర్పించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

ఈడీకి చాన్స్​
ఇప్పటికే ఈ కేసుపై ఈడీ రంగంలోకి దిగినా.. ఆర్థిక లావాదేవీలు లక్షల్లో ఉండటం, ఇటు సిట్​ కూడా సహకరించకపోవడంతో.. వెనక్కి తగ్గింది. కానీ, సిట్​ చార్జ్​షీట్​ దాఖలు చేసిన తర్వాత ఈడీ మళ్లీ రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. మనీలాండరింగ్​ కేసుగా విచారణకు దిగనున్నది. అంతేకాకుండా కోట్లలో లావాదేవీలు సాగడంతో.. ఈడీకి మరింత బలం చేకూరినట్లుగా మారింది. సిట్​ దాఖలు చేసే చార్జ్​షీట్​ కోసం ఈడీ ఎదురుచూస్తున్నది.